Begin typing your search above and press return to search.

స్వాములోరి ద‌గ్గ‌ర‌కు వెళ్లే కేసీఆర్.. ప‌రామ‌ర్శ‌కు వెళ్ల‌రేం?

By:  Tupaki Desk   |   29 April 2019 10:23 AM IST
స్వాములోరి ద‌గ్గ‌ర‌కు వెళ్లే కేసీఆర్.. ప‌రామ‌ర్శ‌కు వెళ్ల‌రేం?
X
నోటికి వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడే అల‌వాటు ఉంద‌న్న పేరు సీనియ‌ర్ కాంగ్రెస్ నేత వీహెచ్ హ‌నుమంత‌రావుకు ఎక్కువ‌న్న పేరుంది. ఆయ‌న మాట్లాడే ప్ర‌తి మాట‌లో అంతో ఇంతో అర్థం ఉండేలా జాగ్ర‌త్త ప‌డుతుంటారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మీద ఘాటు విమ‌ర్శ‌ల్ని సంధించే విష‌యంలో తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు కామ్ గా ఉంటున్న వేళ‌.. వీహెచ్ రంగంలోకి దిగారు.

తాజాగా తెలంగాణ రాష్ట్రానికి ఇబ్బందిపెట్టేస్తున్న ఇంట‌ర్ విద్యార్థుల అంశంపై ఆయ‌న గ‌ళం విప్పిన సంగ‌తి తెలిసిందే. ఇంట‌ర్ బోర్డు చేసిన త‌ప్పుల‌తో త‌ల్ల‌డిల్లిపోయిన ఇంట‌ర్ విద్యార్థులు ప‌లువురు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవ‌టంపై ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న ఆయ‌న‌.. బాధిత కుటుంబాల్ని పరామ‌ర్శిస్తున్నారు. ఇటీవ‌ల వెలువ‌డిన ప‌రీక్షా ఫ‌లితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల్లో ప‌లువురు సూసైడ్ చేసుకున్న వారి త‌ల్లిదండ్రుల్ని ప‌రామ‌ర్శిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా వికారాబాద్ జిల్లా పూడూరు మండ‌లంలోని కంక‌ల్ గ్రామానికి చెందిన విద్యార్థిని జ్యోతి కుటుంబ స‌భ్యుల్ని వీహెచ్ ప‌రామ‌ర్శించారు.

చ‌నిపోయిన విద్యార్థి కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించేందుకు కేసీఆర్ కు స‌మ‌యం దొర‌క‌టం లేదు కానీ.. విశాఖ శార‌దా పీఠం స్వామిని ద‌ర్శించుకోవ‌టానికి మాత్రం స‌మ‌యం ఉందా? అని ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వ త‌ప్పిదం కార‌ణంగా ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న వారిలో ఏ విద్యార్థి కుటుంబాన్ని నువ్వు కానీ..నీ మంత్రులు కానీ ప‌రామ‌ర్శించారా? అంటూ సూటిగా ప్ర‌శ్నించిన వీహెచ్.. ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌ణ‌మైన విద్యాశాఖామంత్రిని ప‌ద‌వి నుంచి ఎందుకు తొల‌గించ‌రు? అని నిల‌దీశారు.

విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌ల‌న్ని ప్ర‌భుత్వ హ‌త్య‌లుగా అభివ‌ర్ణించిన వీహెచ్.. స‌రైన స‌మ‌యంలో స‌రైన రీతిలో విశాఖ స్వాములోరి అంశాన్ని ప్రస్తావించార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇంట‌ర్ ఫ‌లితాల వివాదం ఎపిసోడ్ లో ఒక‌ట్రెండు ప్రెస్ నోట్లు త‌ప్పించి.. ఈ ఇష్యూపై తానేం చేశాన‌న్న విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు తెలిసేలా కేసీఆర్ ఇప్ప‌టి వ‌ర‌కూ ఏమీ చేయ‌లేద‌న్న విమ‌ర్శ వినిపిస్తూ ఉంది. దాన్ని పెద్ద‌ది చేసేలా వీహెచ్ వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.