Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొత్త పత్రిక, ఛానల్
By: Tupaki Desk | 4 Jan 2017 5:16 AM GMTఏదో ఒక వ్యాఖ్యలతో నిరంతరం వార్తల్లో కనిపించే రాజ్యసభ మాజీ సభ్యుడు - ఏఐసీసీ నేత వి.హనుమంతరావు మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా - ప్రింట్ మీడియాలు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని అందుకే త్వరలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పత్రికా - టీవీ ఛానల్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకునేందుకు ఈనెల 13 నుంచి అన్ని జిల్లాల్లో ప్రజా చైతన్య యాత్రలు నిర్వహిస్తానని వీ హెచ్ వెల్లడించారు.
కరెన్సీ కష్టాలను నిరసిస్తూ ప్రజాచైతన్య యాత్రలో భాగంగా వీహెచ్ మాట్లాడుతూ నోట్ల సమస్యలు పరిష్కరించుకుంటే ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తరిమికొట్టే రోజులొస్తాయని విమర్శించారు. కార్పొరేట్ శక్తులకు మేలు చేసేందుకే ప్రధాని పెద్ద నోట్లను రద్దు చేశారన్నారు. ఏకపక్షంగా నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని ఇప్పుడు ప్రతిపక్షాలు సహకరించడం లేదనడం విడ్డూరంగా ఉందని వీహెచ్ అన్నారు. నోట్ల రద్దుతో సామాన్యులు 55 రోజులుగా ఇబ్బందులు పడుతుంటే విపక్షాలు కేంద్ర ప్రభుత్వానికి ఏ విధంగా మద్దతు ప్రకటిస్తాయని ప్రశ్నించారు. దేశంలో 10 శాతం కూడా లేని స్వైప్ మిషన్లతో నగదు రహిత లావా దేవీలు ఎలా సాధ్యమని ప్రభుత్వాన్ని నిలదీశారు. బ్యాంకుల్లో దాచుకున్న కష్టార్జితాన్ని తీ కునేందుకు ప్రజలు పడరాని కష్టాలు పడుతుంటే మోడీ తన నిర్ణయం చాలా బాగుందని పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి భజనం చేయడమే గవర్నర్ పనిగా పెట్టుకున్నారని వీహెచ్ ఎద్దేవా చేశారు. 'నరేంద్ర మోడీ హఠావో-దేశ్‌కి బచావో' నినాదంతో అన్ని జిల్లాల్లో ఈనెల 7న కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు, 9న ప్రదర్శనలు, 11న బహిరంగ సభ ఏర్పాటు చేస్తా మని చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/