Begin typing your search above and press return to search.

భగ్గుమన్న వీహెచ్.. రచ్చరచ్చ..

By:  Tupaki Desk   |   11 May 2019 7:12 AM GMT
భగ్గుమన్న వీహెచ్.. రచ్చరచ్చ..
X
హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో తెలంగాణలో ఇంటర్ అవకతవకలపై ప్రభుత్వ తీరుకు నిరసనగా శనివారం ధర్నా కు పూనుకున్నారు. దీనికి కాంగ్రెస్ , టీడీపీ, టీజేఎస్ కోదండరాం, ప్రజాసంఘాల పార్టీలందరూ హాజరయ్యారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై అన్నిపక్షాలు గొంతెత్తి ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలని భావించాయి. కానీ అది కాస్తా వీహెచ్ చేసిన రచ్చతో కాంగ్రెస్ పరువుపోయింది..

ఈ వేదికపై నాయకుల పేర్లను పిలిచి కూర్చీలో కూర్చోమనే విషయంలో వివాదం తలెత్తింది. తనను కావాలనే వేదికపైకి పిలవలేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ భగ్గుమన్నారు. తనకు కుర్చీ ఇవ్వరా అని మరో నేత నగేష్ పై వీహెచ్ దూసుకెళ్లారు. సీనియర్ నేతనైన తనకు కనీసం కుర్చీ ఇవ్వరా అని నగేష్ పై దాడికి దిగారు. నగేష్ కూడా ప్రతి దాడి చేయడంతో ఇద్దరు తోసుకొని పడిపోయారు.

టీఆర్ ఎస్ పై మాటల దాడి చేయాలనుకున్న అఖిలపక్షం నేతలు.. వీహెచ్ చేసిన రచ్చతో ధర్నా కాస్తా రసాభాసగా ముగిసింది.ఇతర పార్టీల వాళ్లను పార్టీలోకి తీసుకొని మన పార్టీ వాళ్లను బయటకు పంపడమేంటని.. పార్టీని నమ్ముకున్న వారిని గుర్తించరా అని వీహెచ్ విమర్శించారు. తమను అవమానించడం ఏంటని వీహెచ్ .. నగేష్ సహా ప్రశ్నించిన వారిపై దాడికి దిగారు. సీనియర్ నేతలు కుంతియా, కోదండరాం, ఎల్ రమణ ముందే వీహెచ్ దాడి చేస్తున్న దృష్యాలు మీడియాలో హైలెట్ అయ్యాయి. కేవలం తనను పిలవకపోవడం.. కుర్చీ కేటాయించకపోవడంపై వీహెచ్ చేసిన రచ్చ హైలెట్ అయ్యింది.

అంతకుముందు గాంధీభవన్ లో కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశంలో సైతం వీహెచ్ భగ్గుమన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ ఇన్చార్జి కుంతియాతోపాటు ఉత్తమ్, జానారెడ్డి, షబ్బీర్ అలీ, వీహెచ్ పాల్గొన్నారు. సమావేశంలో కాంగ్రెస్ తీరును వీహెచ్ కడిగేశారు. పార్టీ మారిన 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడలేదని.. ఇప్పుడు వారి గురించి ఎందుకు మాట్లాడుతున్నారని.. ఏం చేస్తారని ప్రశ్నించారు. అభ్యర్థుల ఎంపిక లో పక్షపాతం చూపించారని.. అందుకే కాంగ్రెస్ ఓడిపోయిందని ధ్వజమెత్తారు. ఇక కొత్తగా ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీట్లకు అభ్యర్థుల ప్రకటనను కూడా వీహెచ్ తప్పుపట్టారు. వరంగల్ కు కొండా మురళి, నల్లగొండకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మీ పేర్లను ప్రతిపాదించడం వీహెచ్ సీరియస్ అయ్యారు. అన్నీ వాళ్లకేనా పార్టీ కార్యకర్తలు ఇవ్వరా అని వాకౌట్ చేశారు. ఆ ఫస్ట్రేషన్ లోనే ఇందిరాపార్క్ వద్దకు ధర్నాకు వచ్చి ఇక్కడ కూడా తనకు కుర్చీ ఇవ్వకపోవడం.. పిలవకపోవడంతో రచ్చ రచ్చ చేశారు.

For Video Click Here