Begin typing your search above and press return to search.

అబ్బో.. పవన్ కల్యాణ్ తో వీహెచ్ సమావేశం - రాజకీయమా!

By:  Tupaki Desk   |   9 Sept 2019 3:42 PM IST
అబ్బో.. పవన్ కల్యాణ్ తో వీహెచ్ సమావేశం - రాజకీయమా!
X
తెలంగాణ కాంగ్రెస్ లో వీహెచ్ పవరేమిటో అందరికీ తెలిసిందే. ఎన్నో మాటలు చెప్పే ఈయన ఎమ్మెల్యేగా నెగ్గలేకపోతూ ఉంటారు. సోనియాగాంధీ దయ ఉన్నప్పుడు రాజ్యసభకు నామినేట్ కావడం .. ఇప్పుడు ఆమెకు కూడా ఎవరినీ నామినేట్ చేసే పవర్ లేకపోవడంతో వీహెచ్ లాంటి వాళ్లది దిక్కుతోచని స్థితిగా మారింది. అలా అధిష్టానం దయతో ఎంపీగా ఇన్నేళ్లూ కొనసాగి, ఇప్పుడు ఆ అధిష్టానానికి కూడా దిక్కులేకపోవడంతో.. వీహెచ్ కు అవకాశం లేకుండా పోయింది.

ఈ నేపథ్యంలో ఈయన కాంగ్రెస్ లో పరిస్థితులపై రియాక్ట్ అవుతూ ఉన్నారు. పార్టీని విమర్శించేస్తూ ఉన్నారు! తనకు అవకాశాలు ఇచ్చిన పార్టీనే వీహెచ్ ఇప్పుడు తప్పుపడుతున్నారు! త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానంటూ ఆయన ప్రకటించుకున్నారు కూడా. వీహెచ్ మాటలను చాలా మంది పరిశీలకులు ప్రహసనంగా భావిస్తూ ఉంటారు.

ఈ క్రమంలో ఆయన వెళ్లి జనసేన అధిపతి పవన్ కల్యాణ్ తో సమావేశం అయ్యారు! బహుశా హనుమంతరావు జనసేనలోకి చేరబోతున్నారేమో అనే టాక్ వినిపిస్తోంది. పవన్ కల్యాణ్ ను కలిసి..ఫొటోలు దిగారు వీహెచ్. ఇటీవలే తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానంటూ ప్రకటించిన వీహెచ్ ఇప్పుడు పవన్ కల్యాణ్ ను కలవడం ద్వారా..జనసేన తెలంగాణ విభాగాన్ని తనే నడిపించబోతున్నట్టుగా ప్రకటించుకున్నట్టేనా? అనే ఊహాగానాలు రేగుతున్నాయి.

అసలే జనసేన ఎన్నికల్లో ఎదురైన దారుణ పరాభవం నుంచి ఇంకా కోలుకున్న దాఖలాలు కనిపించడం లేదు. స్వయంగా పవన్ కల్యాణ్ రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడటంతో.. ఆ పార్టీ శ్రేణులు బాగా ఢీలా పడ్డాయి. ఇలాంటి నేపథ్యంలో వీహెచ్ వంటి వాళ్లు వెళ్లి ఆయనను కలుస్తుంటే..నవ్వుకునే వాళ్లు నవ్వుకుంటున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు!