Begin typing your search above and press return to search.

ఫెయిల్ అయ్యానని ఇన్నాళ్లకు గుర్తుకొచ్చిందా వీహెచ్?

By:  Tupaki Desk   |   23 April 2016 12:55 PM GMT
ఫెయిల్ అయ్యానని ఇన్నాళ్లకు గుర్తుకొచ్చిందా వీహెచ్?
X
కాంగ్రెస్ పార్టీని మహా సముద్రంతో పోలుస్తుంటారు. కొన్ని అంశాల్ని చూసినప్పుడు అది నిజమనిపించకమానదు. ఎందుకంటే.. దేశ వ్యాప్తంగా ఉన్న ఎంతోమంతి నేతలకు పదవులు ఇవ్వటం.. వారికి విశేష గుర్తింపు లభించేలా చేయటంలో కాంగ్రెస్ పార్టీకి పోటీకి వచ్చే పార్టీ ఉండదనే చెప్పాలి. ప్రజాదరణ సంగతి పక్కన పెడితే.. ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం సాధించలేని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు లాంటి వారికి మూడు దఫాలు రాజ్యసభ సభ్యుడి పదవిని ఇవ్వటం అంత చిన్న విషయమేమీ కాదు. కాంగ్రెస్ పార్టీలో కాబట్టే అలాంటివి సాధ్యమవుతాయి.

వీహెచ్ కు అదృష్టం ఉంటే మరోసారి రాజ్యసభ పదవి చేజిక్కినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు.కానీ.. అలాంటి పరిస్థితి ప్రస్తుతం లేదనే చెప్పాలి. ఇక.. దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఫ్యామిలీతో సహా కలిశారు వీహెచ్. ఆమెతో భేటీ అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన వీహెచ్.. సోనియమ్మ మీద తనకున్న భక్తిని ప్రదర్శించే ప్రయత్నం చేశారు.

ఎప్పుడూ లేని విధంగా ఈసారి తనలోని కొత్త కోణాన్నిప్రదర్శించారు వీహెచ్. తనను మూడుసార్లు రాజ్యసభకు పంపినందుకు కృతజ్ఞతలు చెప్పిన ఆయన.. కాంగ్రెస్ త్యాగాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లటంలో తాను విఫలమైన విషయాన్ని ఒప్పేసుకున్నారు. నిత్యం రాజకీయ ప్రత్యర్థుల మీద కానీ.. సొంత పార్టీ నేతల మీద కానీ విమర్శలు చేసుకునే వీహెచ్ తన వైఫల్యాన్ని నేరుగా ఒప్పుకోవటం ఈ మధ్య కాలంలో ఇదేనని చెప్పక తప్పదు. ఎప్పటి మాదిరే 2019లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామన్న ధీమాను వ్యక్తం చేశారు. పార్టీ త్యాగాలు ప్రజల్లోకి తీసుకెళ్లటంలో విఫలమైన నేత.. 2019లో మాత్రం పార్టీని పవర్ లోకి తీసుకొస్తానన్న బీరాలు పలకటం వీహెచ్ లాంటి వారికే సాధ్యమవుతుందేమో..?