Begin typing your search above and press return to search.

కేసీఆర్ మొక్కుల‌పై వీహెచ్ ప‌ర్ ఫెక్ట్ పంచ్‌!

By:  Tupaki Desk   |   30 Jun 2018 10:39 AM IST
కేసీఆర్ మొక్కుల‌పై వీహెచ్ ప‌ర్ ఫెక్ట్ పంచ్‌!
X
ప్ర‌త్య‌ర్థిపై పైచేయి సాధించాల‌న్నా.. ఉడికిపోయేలా చేయాల‌న్నా.. అట్టే నోరు పారేసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. కాసింత స‌మ‌య‌స్ఫూర్తి.. మ‌రికాస్త మాట‌ల మాయాజాలం ఉంటే స‌రిపోతుంది. ప్ర‌జాద‌ర‌ణ సంగ‌తి ఎలా ఉన్నా.. పార్టీలోనూ.. మీడియాలోనూ కూసింత ప‌లుకుబ‌డి ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌నేత‌ల్లో వీహెచ్ హ‌నుమంత‌రావు ఒక‌రు.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో త‌న‌దైన వ‌ర్గాన్ని మొయింటైన్ చేసే టాలెంట్ వీహెచ్‌ కు లేద‌నే చెప్పాలి. కానీ.. రాజకీయ ప్ర‌త్య‌ర్థుల‌పై గురి చూసి కొట్టిన‌ట్లుగా పంచ్ లు వేసే విష‌యంలో మాత్రం వీహెచ్ టాలెంట్ ఏ మాత్రం త‌గ్గ‌లేద‌నే చెప్పాలి. రోజువారీ రాజ‌కీయాల్ని ఏ మాత్రం మిస్ కాని ఆయ‌న ఏ చిన్న అంశాన్ని వ‌దిలి పెట్ట‌ని వైనం క‌నిపిస్తుంది.

కేసీఆర్ మీద పంచ్ వేసే ఏ ఛాన్స్ ను మిస్ కాని వీహెచ్‌.. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి మొక్కుల మీద త‌న‌దైన శైలిలో పంచ్ వేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే మొక్కులు చెల్లిస్తానని మొక్కుకున్న పెద్ద‌మ‌నిషి.. తాను ముఖ్య‌మంత్రి సీట్లో కూర్చున్న నాలుగేళ్ల త‌ర్వాత బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మకు మొక్కుకున్న మొక్కును తీర్చుకోవ‌టానికి బెజ‌వాడ‌కు వెళ్ల‌టం తెలిసింది. అమ్మవారికి ఇచ్చింది 11 గ్రాముల (సుమారుగా) ముక్కుపుడ‌కే అయిన‌ప్ప‌టికీ.. దాన్ని స‌మ‌ర్పించ‌టానికి మందీ మార్బ‌లంతో కేసీఆర్ వెళ్లిన ఖ‌ర్చుల చిట్టానే వంద‌ల రెట్లు ఎక్కువ‌న్న విమ‌ర్వ ప‌లువురి నోట వినిపించింది.

అయితే.. కేసీఆర్ మొక్కుల మీద రాజ‌కీయ నేత‌ల విమ‌ర్శ‌లు పెద్ద‌గా రాలేద‌ని చెప్పాలి. ఆ కొరత తీర్చేలా వీహెచ్ విసిరిన పంచ్ అదిరింద‌ని చెప్పాలి.

బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ‌కు మొక్కు చెల్లించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఎన్నిక‌ల వేళ‌లో ఇచ్చిన మొక్కుల ముచ్చ‌ట ఏమిటంటూ ప్ర‌శ్నించారు. హామీల్ని మొక్కుల పేరుతో అభివ‌ర్ణించిన వీహెచ్‌.. కేసీఆర్ కు ప‌ర్ ఫెక్ట్ మొక్కుల పంచ్ వేశార‌ని చెప్పాలి. ఎన్నిక‌ల వేళ‌లో తానిచ్చిన హామీల్లో నూటికి నూరుశాతం అమ‌లు చేసిన‌ట్లుగా ఆ మ‌ధ్య‌న చెప్పుకోవ‌టం తెలిసిందే.

అయితే.. కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఇప్ప‌టికి అమ‌లు కాని అంశాల్ని ఆయ‌న ఎక‌రువు పెడుతున్నారు. ఇంటికో ఉద్యోగం.. ద‌ళిత ముఖ్య‌మంత్రి..ద‌ళితుల‌కు మూడు ఎక‌రాల భూమి.. డ‌బుల్ బెడ్రూం ఇళ్లు లాంటి హామీల్ని ఇంకా ఎందుకు నెర‌వేర్చ‌లేదో చెప్పాల‌న్నారు. తాను చెప్పిన‌వ‌న్నీ ఇచ్చేసిన‌ట్లుగా చెప్పే కేసీఆర్ మాట‌ల‌కు వీహెచ్ వ్యాఖ్య‌లు కౌంట‌ర్ గా ఉంటాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మొక్కుల చెల్లింపు నేప‌థ్యంలో కేసీఆర్ పై వీహెచ్ చేసిన వ్యాఖ్య‌లు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించేలా ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.