Begin typing your search above and press return to search.

ఫైర్ బ్రాండ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన వీహెచ్

By:  Tupaki Desk   |   5 Sept 2019 12:48 PM IST
ఫైర్ బ్రాండ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన వీహెచ్
X
పవర్ చేతిలో ఉన్నా లేకున్నా అంతర్గత కుమ్ములాటలతో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవటంలో కాంగ్రెస్ పార్టీకి మించింది మరొకటి లేదన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. తాజాగా అలాంటి సీన్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రథసారధిని మారుస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఇటీవల మల్కాజిగిరి ఎంపీగా ఎన్నికైన రేవంత్ రెడ్డిని తెలంగాణ పీసీసీ చీఫ్ గా నియమించే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. రేవంత్ కు పీసీసీ పగ్గాలు అప్పజెబితే ఊరుకునేది లేదన్న మాటను.. రేవంత్ పేరు ప్రస్తావించకుండా చెబుతున్నారు వీహెచ్. వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి పీసీసీ చీఫ్ పోస్టు ఎలా ఇస్తారని ప్రశ్నించిన ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

పార్టీలో ఆయారాం.. గయరాం లాంటి వారికే కీలక పదవులు ఇస్తున్నట్లు ఆరోపించారు. పీసీసీ చీఫ్ పదవి తమదేనంటూ కొందరు ప్రచారం చేసుకుంటున్నారని.. పార్టీ కోసం కష్టపడిన వారికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలే కానీ కొత్తగా పార్టీలోకి వచ్చే వారికి ఇవ్వొద్దంటున్నారు. పార్టీ మారి వచ్చిన వారికి కీలక పదవులు ఇస్తే పార్టీలోని పలువురు నేతలు వేరే పార్టీలో చేరిపోతారంటూ హెచ్చరిస్తున్నారు.

వీహెచ్ మాటలన్ని రేవంత్ ను ఉద్దేశించి అన్న మాట వినిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీ కాంగ్రెస్ పగ్గాలు రేవంత్ కు ఇస్తేనే మేలు జరుగుతుందని.. వాక్ చాతుర్యం.. ఛరిష్మా ఉన్న ఫైర్ బ్రాండ్ కు అప్పగిస్తే మంచి జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. పార్టీలోని సీనియర్ నేతలకు మాత్రం ఈ వాదనను ఖండిస్తూ.. ఆ అవసరం లేదన్న మాటను చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ కు టీచీఫ్ పగ్గాలు ఇవ్వాలన్న దానిపై అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.