Begin typing your search above and press return to search.

రాజీవ్‌ కంటె పీవీ పేరు బెటర్‌ కదా?

By:  Tupaki Desk   |   19 Aug 2016 1:26 PM GMT
రాజీవ్‌ కంటె పీవీ పేరు బెటర్‌ కదా?
X
సోనియా కుటుంబం మీద భక్తిని చాటుకోవడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని వదులుకోకుండా వాడుకుని, రాజకీయంగా బతికిపోవాలని కోరుకునే నాయకుల్లో తెలంగాణకు చెందిన మాజీ ఎంపీ వీ హనుమంతరావు ముందు వరుసలోనే ఉంటారు. కేవలం సోనియా భజనలో విచ్చలవిడిగా కీర్తించడం అనే ఒకే ఒక్క అర్హతతో చాలాకాలంగా రాజ్యసభ ఎంపీగా జీవితాన్ని గడుపుతూ వచ్చిన వీ హనుమంతరావు.. ఇప్పుడు అసలు పార్టీకే సీట్లకు ఠికానా లేకపోవడంతో మాజీ అయ్యారు. అయితే ఈ మధ్య కాలంలో సోనియా భజన చేయడానికి ఆయనకు అవకాశాలేమీ అందిరావడం లేదు.

అయితే 'తెలివైన వాళ్లు అవకాశాల్ని అందిపుచ్చుకుంటారు - గొప్పవాళ్లు అవకాశాల్ని సృష్టించుకుంటారు' అన్నట్లుగా.. ఇప్పుడు వీహెచ్‌ .. సోనియా దృష్టిలో పడడానికి ఏదో కొత్త అంశాన్ని తెరమీదకు తెస్తున్నారు. ఆయన తాజా డిమాండ్‌ ఏంటంటే.. హైదరాబాదులోని హైటెక్‌ సిటీకి రాజీవ్‌ గాంధీ పేరు పెట్టాలట. రాజీవ్‌ గాంధీ కాలంలోనే ఈ దేశంలో కంప్యూటర్‌ యుగం మొదలైందిట. రాజీవ్‌ ఆలోచనల పుణ్యమాని హైదరాబాదులో చంద్రబాబు ఐటీ పరిశ్రమను పెంచారుట. అందుచేత హైటెక్‌ సిటీకి రాజీవ్‌ గాంధీ పేరు పెడితే బాగుంటుందని ఆయన అంటున్నారు.

అయితే వీహెచ్‌ లాగా తన గురించి భజన చేసే వారు పెద్దగా లేకపోయారు గానీ.. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండగా ఐటీ - కమ్యూనికేషన్‌ రంగాలు బాగా విస్తరించాయని అందరూ అంటుంటారు. పైగా పీవీ నరసింహారావు తెలంగాణ ముద్దుబిడ్డ కూడా. ఈ కారణాలు అన్నీ పరిగణనలోకి తీసుకుని - వీహెచ్‌ చేసిన విలువైన సూచన స్ఫూర్తితో హైటెక్‌ సిటీకి పీవీ నరసింహారావు పేరు పెడితే బాగుంటుంది కదా.. అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.