Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో అవ‌మానం ఆంధ్రోళ్ల‌కు ఎందుకు వీహెచ్?

By:  Tupaki Desk   |   18 April 2019 11:38 AM GMT
తెలంగాణ‌లో అవ‌మానం ఆంధ్రోళ్ల‌కు ఎందుకు వీహెచ్?
X
తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఏపీ మీద ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా వ్యాఖ్య‌లు చేసిన నేత‌ల్లో కాంగ్రెస్ నేత వీహెచ్ హ‌నుమంత‌రావు ఒక‌రు. ప్ర‌త్యేక తెలంగాణ సాధ‌న కోసం తాను ప్రాతినిధ్యం వ‌హించిన ప్రాంత ప్ర‌యోజ‌నాలు త‌ప్పించి.. ఏపీ ప్ర‌యోజ‌నాల గురించి ఏ మాత్రం ఆలోచించ‌ని వీహెచ్ లాంటోళ్లు.. ఈ రోజున రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ఏపీకి వ‌స్తామ‌ని.. ధ‌ర్నా చేస్తామ‌ని చెప్ప‌టంలో అర్థం ఉందా? అన్న‌ది ప్ర‌శ్న‌.

హైద‌రాబాద్ న‌డి బొడ్డున పంజాగుట్ట స‌ర్కిల్ వ‌ద్ద అంబేడ్క‌ర్ విగ్ర‌హానికి జ‌రిగిన అవ‌మానం.. త‌దిత‌ర ఎపిసోడ్ కు.. ఏపీకి ఏ మాత్రం సంబంధం లేదు. ఈ ఇష్యూకు సంబంధించి ఏమైనా నిర‌స‌న చేసినా.. ఆందోళ‌న నిర్వ‌హించినా తెలంగాణ‌కు మాత్ర‌మే ప‌రిమితం చేసుకోవాలి. త‌ప్పు జ‌రిగిన చోట‌.. న్యాయం కోసం కోట్లాడాలి కానీ.. అందుకు సంబంధం లేని ఏపీలో ధ‌ర్నా నిర్వ‌హించ‌టంలో ఏ మాత్రం ప్ర‌యోజ‌నం లేదు.

కానీ.. వీహెచ్ మాత్రం విచిత్ర‌మైన వాద‌న‌ను వినిపిస్తున్నారు. తెలంగాణ‌లో అంబేడ్క‌ర్ కు జ‌రిగిన అవ‌మానాల గురించి ఏపీ ప్ర‌జ‌ల‌కు తెలియాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వీహెచ్ కొత్త మాట‌ను చెబుతున్నారు. తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ‌లోని స్థానిక కాంగ్రెస్ నేత‌ల‌తో కలిసి మీడియా స‌మావేశాన్ని నిర్వ‌హించిన ఆయ‌న‌.. అంబేడ్క‌ర్ కు జ‌రిగిన అవ‌మానాల గురించి ఏపీ ప్ర‌జ‌లకు తెలియ‌జేసేందుకు కాకినాడ ఇంద్ర‌పాలెం బ్రిడ్జి వద్ద ఉన్న అంబేడ్క‌ర్ విగ్ర‌హం వ‌ద్ద శుక్ర‌వారం ధ‌ర్నా చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

తెలంగాణ‌లో జ‌రిగిన అవ‌మానంపై అక్క‌డ పోరాటం చేయ‌కుండా.. ఏపీలో చేయ‌టంలో అర్థం లేదు. వీహెచ్ తీరు చూస్తుంటే.. నిర‌స‌న‌ల‌కు.. ధ‌ర్నాల‌కు..ఆందోళ‌న‌కు తెలంగాణ‌లో ఎలానూ అనుమ‌తి ల‌భించ‌దు. ఏపీలో ర‌చ్చ చేయ‌టం ద్వారా రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు పొందాల‌న్న‌ది వీహెచ్ ఆలోచ‌న‌లా ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. తెలంగాణ‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌కు ఏపీలో ఆందోళ‌న నిర్వ‌హించ‌టం ద్వారా క‌లిగే ప్ర‌యోజ‌నం ఏమిట‌న్న‌ది ప్ర‌శ్న‌. ఏపీ ప్ర‌యోజ‌నాల గురించి ఏ మాత్రం ఆలోచించ‌ని వీహెచ్ లాంటోళ్లు.. ఈ రోజున త‌మ రాజ‌కీయ మైలేజ్ కోసం ఏపీని ఎంచుకోవ‌టాన్ని ఆంధ్రోళ్లు అంగీక‌రించ‌కూడ‌ద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. వీహెచ్ లాంటోళ్లు.. వారి రాజ‌కీయ వ్యూహాల‌కు కేంద్రంగా తెలంగాణ‌ను ఎంచుకోవాలే కానీ.. ఏపీని కాదన్న‌ది ఏపీ ప్ర‌జ‌లు ఆయ‌న‌కు అర్థ‌మ‌య్యేలా చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది.