Begin typing your search above and press return to search.

అలా పోటీ ప‌డుతున్న అక్క‌డి గ‌వ‌ర్న‌ర్‌.. సీఎం

By:  Tupaki Desk   |   15 Sep 2017 6:14 AM GMT
అలా పోటీ ప‌డుతున్న అక్క‌డి గ‌వ‌ర్న‌ర్‌.. సీఎం
X
రాజ్యాంగ‌ప‌ర‌మైన ప‌ద‌వుల్లో ఉన్న ఇద్ద‌రు ముఖ్య నేత‌ల మ‌ధ్య రాజ‌కీయం న‌డిస్తే వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా మారుతుంది. ఒక‌రిపై ఒక‌రు ఎత్తులు పైఎత్తులు వేసుకునే తీరు ఆస‌క్తిక‌రంగా మారుతుంది. అంత‌కు మించి హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా అలాంటి ప‌రిస్థితే నెల‌కొంది కేంద్ర‌పాలిత ప్రాంత‌మైన పుదుచ్చేరి పాలిటిక్స్‌. రాష్ట్ర హోదా క‌లిగిన ఈ కేంద్ర‌పాలిత ప్రాంతంలో గ‌వ‌ర్న‌ర్‌.. ముఖ్య‌మంత్రి మ‌ధ్య అస్స‌లు పొస‌గ‌టం లేదు. ఎడ‌ముఖం.. పెడ ముఖ‌మ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే వారి తీరు ఇప్పుడు హాట్ న్యూస్ అవుతోంది.

ఇద్ద‌రి మ‌ధ్య పోటీ అంత‌కంత‌కూ ముదురుతోంది. ప్ర‌జాస్వామ్యబ‌ద్ధంగా ఎంపికైన త‌మ ప్ర‌భుత్వాన్ని లెఫ్టెనెంట్ గ‌వ‌ర్న‌ర్ కిర‌ణ్ బేడీ అస్స‌లు మ‌ర్యాద ఇవ్వ‌టం లేద‌న్న‌ది పుదుచ్చేరి ముఖ్య‌మంత్రి నారాయ‌ణ‌స్వామి ఆరోప‌ణ‌. పుదుచ్చేరికి లెఫ్టెనెంట్ గ‌వ‌ర్న‌ర్ గా వ‌చ్చిన నాటి నుంచి అక్క‌డి రాజ‌కీయ వాతావ‌ర‌ణం మారిపోయింది.

ఆ మ‌ధ్య‌న అర్థ‌రాత్రి వేళ‌.. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా టూ వీల‌ర్ మీద లెప్టెనెంట్ గ‌వ‌ర్న‌ర్ ప్ర‌యాణించ‌టం.. అక్క‌డి ప‌రిస్థితులు తెలుసుకోవ‌టం సంచ‌ల‌నంగా మార‌టంతో పాటు.. పెద్ద హాట్ న్యూస్ గా మారింది. దీంతో.. రాజ‌కీయంగా అంత‌కంత‌కూ పలుకుబ‌డి పెంచుకుంటున్న లెఫ్టెనెంట్ గ‌వ‌ర్న‌ర్ తీరుపై ఈ కాంగ్రెస్ సీఎం గుర్రుగా ఉన్నారు.

తాజాగా ఆయ‌న అర్థ‌రాత్రి ప‌ర్య‌ట‌న‌ను చేప‌ట్టారు. టూ వీల‌ర్ మీద పుదుచ్చేరి సిటీలో రౌండ్స్ వేశారు. వీరిద్ద‌రి అర్థ‌రాత్రి ట్రిప్స్ వెనుక ఉద్దేశం ఒక్క‌టే.. పుదుచ్చేరిలో మ‌హిళ‌ల‌కు ఎంత భ‌ద్ర‌త అన్న‌ది తెలుసుకోవ‌టం కోస‌మే. సీఎం తాజాగా చేప‌ట్టిన టూవీల‌ర్ ట్రిప్ లో త‌న‌తో పాటు మ‌రికొంద‌రు ముఖ్య‌నేత‌ల్ని వెంట పెట్టుకెళ్లారు. కొన్ని ప్రాంతాల్లో వీధి దీపాలు వెల‌గ‌ని వైనాన్ని చూసి వాటిని త‌క్ష‌ణ‌మే రిపేర్ చేయాల‌ని ఆదేశించారు. కొన్నిచోట్ల పేరుకుపోయిన చెత్త‌ను తొల‌గించాల్సిందిగా కోరారు. ముఖ్య‌మంత్రి స్థాయి వ్య‌క్తి ఉన్న‌ట్లుండి స్కూట‌ర్ మీద రావ‌టంతో అక్క‌డి ప్ర‌జ‌లు ఆశ్చ‌ర్యానికి గురి అవుతున్నారు. మొత్తానికి ఇరువురు ప్ర‌ముఖుల మ‌ధ్య న‌డుస్తున్న పోటీ సంగ‌తి ఎలా ఉన్నా.. కొన్ని అంశాల్లో అయినా మార్పులు రావ‌టం శుభ‌ప‌రిణామంగా చెప్ప‌క త‌ప్ప‌దు.