Begin typing your search above and press return to search.

గవర్నరుదే లేటన్న మాజీ గవర్నరు

By:  Tupaki Desk   |   24 Jun 2015 11:15 AM GMT
గవర్నరుదే లేటన్న మాజీ గవర్నరు
X
ఉభయ తెలుగు రాష్ట్రాలలో పరిస్థితులపై మాజీ గవర్నరు ఒకరు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రాజకీయవర్గాలు రెండుగా చీలి ఒక్కొక్కరు ఒక్కో సీఎంకు మద్దతిస్తున్న తరుణంలో సిక్కిం మాజీ గవర్నరు వి.రామారావు మాత్రం సీఎంల ఊసెత్తకుండా.. ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపాల్సిన బాధ్యత గవర్నరుదేనని తేల్చిచెప్పేశారు.

ఏపీ, తెలంగాణల్లో ప్రస్తుతమున్న ఉద్రిక్తతలను చక్కబరిచేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ చొరవ చూపాలని సిక్కిం మాజీ గవర్నర్ రామారావు అన్నారు. ఏది ఏమైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రాష్ట్ర ముఖ్యమంత్రిపై పెత్తనం చెలాయించాలనుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లో సెక్షన్‌-8 అమలుపై అసలు చట్టంలో ఏం ఉందో చూడాలని ఆయన అన్నారు. కోర్టులో ఉన్నందున ఓటుకు నోటు కేసుపై ఇప్పుడు మాట్లాడటం తగదని రామారావు అన్నారు.

ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిపై మరో రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారం చెలాయించడం చట్టవిరుద్ధమేనని సిక్కిం మాజీ గవర్నర్‌ రామారావు వ్యాఖ్యానించారు. విభజన బిల్లు పెట్టినపుడే సెక్షన్‌-8పై చర్చ జరిగి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి గవర్నర్‌ మాట్లాడాలని రామారావు సూచించారు. సీనియర్ రాజకీయవేత్తగా... చాలాకాలం గవర్నరుగా పనిచేసిన అనుభవఙుడిగా రామారావు చెప్పిన విషయంలో వాస్తవముందని విశ్లేషకులు అంటున్నారు. ఒక మాజీ గవర్నరుగా ఆయనకు గవర్నరు బాధ్యతలు తెలుసని.... ఆయన మాట వినైనా ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తన బాధ్యతలు నెరవేర్చాలని టీడీపీ వర్గాలు అంటున్నాయి.