Begin typing your search above and press return to search.

టీకా వేయించుకుంది ... కోటీశ్వరురాలిగా మారింది!

By:  Tupaki Desk   |   10 Nov 2021 10:32 AM GMT
టీకా వేయించుకుంది ... కోటీశ్వరురాలిగా మారింది!
X
కరోనా పై పోరాటం లో మానవాళి చేతిలో ఉండే ఏకైక అస్త్రం వ్యాక్సిన్. దేశం ఏదైనా.. ప్రాంతమేదైనా.. టీకా తీసుకోవడం అనేది జరిగితేనే కరోనాను జయించగలుగుతాం. ఇది ఇప్పటికే చాలా దేశాలు అవగతం చేసుకుని టీకాను ఓ యజ్ఞంగా చేపట్టాయి. కానీ చాలా మందిలో వ్యాక్సిన్ పై ఉండే అపోహలు ఇంకా పోవడం లేదు. ఇందుకోసం కొంతమంది దీనికి దూరంగా ఉంటున్నారు.

ఇలాంటి వారిని ప్రోత్సాహించి టీకా తీసుకునే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నాయి కొన్ని ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు. ఇందులో భాగంగానే కొన్ని ప్రాంతాల్లో వస్తువులు, మరి కొన్ని ప్రాంతాల్లో నగదును కూడా ఇస్తున్నారు. ఇలా అయినా కొందరు మారి వ్యాక్సిన్ ను తీసుకుంటే.. కనీసం వారినైనా వైరస్ నుంచి కాపాడవచ్చు కదా అని భావిస్తున్నారు. ఇటువంటి ప్రోత్సాహకాలతో కొంతమేర వ్యాక్సిన్ పై అపోహలు తగ్గి.. టీకా వేసుకునేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు.

ఇలా ఆస్ట్రేలియాలో కొన్ని కార్పోరేట్ సంస్థలు టీకా తీసుకునే వారిని ప్రోత్సహించాయి. ఇందుకుగాను లాటరీ పద్ధతిని ఎంచుకుంది. అయితే టీకా తీసుకున్న వారికి ఒక యూనీక్ కోడ్ ఇచ్చి లక్కీ డ్రాను తీసింది. ఈ లక్కీ డ్రాలో సిడ్నీకి చెందిన ఓ యువతి ఏకంగా కోటీశ్వరరాలుగా మారింది. ఈ లాటరీ లో తన పేరు రావడంతో భారత కరెన్సీ ప్రకారం సుమారు ఐదు కోట్ల నలబై లక్షల రూపాయిల సొమ్మును సొంతం చేసుకుంది. ఆమె పేరు జాన్నే ఝ. వయసు ఇరవై ఐదు. ఇంత తక్కువ వయసులోనే కోటీశ్వరురాలిగా మారింది ఆ యువతి.

కరోనా సమయంలో ప్రభావితమైన దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. దీంతో దేశంలోని కొన్ని సంస్థలు ఏకతాటిపైకి వచ్చాయి. మిలియన్ డాలర్ వ్యాక్స్ పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టాయి. దీని ప్రధాన ఉద్దేశం దేశంలోని ప్రజల్లో కరోనా పై అవగాహన కల్పించి.. టీకా తీసుకునేలా చేయడం. ఇందుకు గానూ వారు లాటరీ పద్దతిని ఎన్నుకున్నారు. దీనిని గత నెల చివరిలో ప్రారంభించారు. అనుకున్న దానికంటే భారీ స్థాయిలో ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. పెద్ద మొత్తంలో ప్రజలు వ్యాక్సిన్ తీసుకునేందుకు మొగ్గు చూపారు.

అధిక సంఖ్యలో టీకా కోసం నమోదు చేసుకునే వారు పెరిగారు. దీంతో ఒకానొక సమయంలో ఎన్ రోల్ చేసుకునే వెబ్ సైట్ కూడా క్రాష్ అయ్యింది. ఈ కార్యక్రమ నిర్వాహకులు కొన్ని గంటల్లోనే సైట్ ను పునరుద్ధరించారు. ప్రారంభమైన నాడే సుమారు మూడు లక్షల మంది టీకా కోసం నమోదు చేసుకున్నారు. దీనితో పాటే వారందరి పేర్లను లక్కీ డ్రాగా తీశారు.

ఈ లక్కీడ్రాను ఈ నెల 5 వ తేదీన తీశారు. ఇందులో సిడ్నీకి చెందిన జాన్నే ఝ అనే యువతి పేరు వచ్చింది. దీంతో విజేతగా నిలిచిన ఆమెకు సుమారు 4.2 మిలియన్ డాలర్లను ఇచ్చారు. అంతేగాకుండా 3100 మందికి లక్కీ డ్రాలోనే విజేతలుగా ప్రకటించి వివిధ రకాలైన బహుమతులు అందజేశారు.