Begin typing your search above and press return to search.

18 ఏళ్ల వారికి టీకా.. కేంద్రం మార్గదర్శకాలు ఇంత విషయం ఉందా?

By:  Tupaki Desk   |   21 April 2021 4:30 AM GMT
18 ఏళ్ల వారికి టీకా.. కేంద్రం మార్గదర్శకాలు ఇంత విషయం ఉందా?
X
తీపి గోళీ.. కానీ అది కేవలం కోటింగ్ మాత్రమే. లోపల ఉండేదంతా చేదే.. అన్న రీతిలో కేంద్రంలోని మోడీ సర్కారు తీరు ఉంటుందని చెప్పాలి. గత ఏడాది లాక్ డౌన్ వేళ.. రుణాల మీద మారిటోరియం కావొచ్చు.. ఆ తర్వాత భారీ ప్యాకేజీ అంటూ చెప్పిన మాటలు ఘనంగా ఉన్నా.. దానికి సంబంధించిన ప్రయోజనం సామాన్యుడికి అందని పరిస్థితి. పైకి ఆడంబరంగా కనిపించే ప్రకటన బాగున్నట్లు అనిపించినా.. దాని లోతుల్లోకి వెళ్లినప్పుడు మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఉంటుంది. తాజాగా 18 ఏళ్లకు పైబడిన అందరికి టీకా అంటూ చేసిన ప్రకటన వావ్ మోడీ అనిపించేలా ఉన్నా.. కేంద్ర ఉత్తర్వుల్ని జాగ్రత్తగా చదివితే.. దిమ్మ తిరిగే వాస్తవాలు బయటకు వస్తాయి.

ఇప్పటివరకు దేశంలో వ్యాక్సిన్ బాధ్యత మొత్తం కేంద్రం కనుసన్నల్లోనే ఉండేది. ఈ కారణంతోనే.. టీకా సర్టిఫికేట్ లో ప్రధాని మోడీ బొమ్మ ఉండటం చూస్తున్నాం. ఇప్పటివరకు ఉచితంగా.. ప్రైవేటు సంస్థల్లో నామమాత్రపు ధర (రూ250)తో వ్యాక్సిన్ వేయటం తెలిసిందే. అయితే.. 18 ఏళ్లకు పైబడిన వారందరికి టీకా వేసే విషయంలో ఇప్పటివరకు మొత్తం భారం మోసిన కేంద్రం.. ఇకపై ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు యాభై శాతం వేసేసింది. యాభై శాతం భారం తమదని.. మిగిలిన యాబై శాతం భారం రాష్ట్ర సర్కారుదేనంటూ తన తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

కేంద్ర వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇదివరకు మాదిరేసాగుతుంది. వైద్య సిబ్బందికి.. ఫ్రంట్ లైన్ వర్కర్లలో 45 ఏళ్లకు పైబడిన వారికి ఉచితంగా టీకా ఇస్తామన్న కేంద్రం మాటలో.. 45 ఏళ్ల లోపు వారన్న మాటే కనిపిస్తుంది తప్పించి.. 18 ఏళ్ల లోపు వారి సంగతిని సూటిగా ప్రస్తావించలేదు. అంటే.. 18 ఏళ్లకు పైబడి 45 ఏళ్ల లోపు వారి వ్యాక్సిన్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదన ఉందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసింది. దీంతో.. రాష్ట్రాలు టీకా కోసం తమ నిధుల్ని ఖర్చు చేయక తప్పదు.

అంతేకాదు.. 18 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇచ్చే క్రమంలో టీకాల్ని ఉత్పత్తి చేసే సంస్థలు తాము ఉత్పత్తి చేసే వాటిలో 50 శాతం స్టాక్ ను రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ.. బహిరంగ మార్కెట్ కు కానీ అమ్ముకోవచ్చంటూ కేంద్రం ప్రకటించింది. అంటే.. ప్రైవేటు రంగానికి.. రాష్ట్ర ప్రభుత్వానికి ధరల విషయంలో పోటీ వస్తుంది. ఒకవేళ.. రాష్ట్రాల కంటే ప్రైవేటు రంగం అధికంగా ధర కోట్ చేస్తే వారికే సొంతమవుతుంది. లేదంటే.. ధర ఎక్కువగా ఉంటుంది. ఇది.. సామాన్యులకు భారంగా మారే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అదే సమయంలో.. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక భారంగా మారనుంది. మోడీ మాష్టారు ఏదైనా ప్రకటన చేస్తే.. ఎన్ని లెక్కలు ఉంటాయనటానికి టీకా విషయంలో ఆయన జారీ చేసిన ఉత్తర్వే నిదర్శనమని చెప్పక తప్పదు.