Begin typing your search above and press return to search.

ఉద్యోగులకు టీకా తప్పనిసరి.. వెల్లువెత్తిన ఆందోళనలు!

By:  Tupaki Desk   |   3 Nov 2021 2:30 AM GMT
ఉద్యోగులకు టీకా తప్పనిసరి.. వెల్లువెత్తిన ఆందోళనలు!
X
ఏడాదిన్నర కాలంగా కరోనా మహమ్మారి వణికించింది. ఈ ఏడాది మార్చిలోనూ కరోనా సెకండ్ వేవ్ లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ దేశాలను వణికించిన కొవిడ్.. అమెరికాలోనూ విశ్వరూపం చూపించింది. అగ్రరాజ్యం చిన్న దేశం అనే తేడా లేకుండా కోరలు చాచింది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో అమెరికా ప్రజలు ఎంతోమంది బలయ్యారు. అందుకే ఆ దేశంలో కఠిన ఆంక్షలు విధించారు. ప్రస్తుతం వ్యాక్సినేషన్ కారణంగా మహమ్మారి కాస్త అదుపులో ఉంది. కానీ అమెరికాలో మాత్రం టీకా పట్ల కఠినమైన నిబంధనలు విధించారు. పూర్తి వ్యాక్సినేషన్ అయ్యాకే ఉద్యోగులు విధుల్లోకి రావాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

వ్యాక్సిన్ తీసుకున్న ఉద్యోగులే సోమవారం నుంచి విధులకు హాజరుకావాలని ఆ దేశ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. న్యూయార్క్ లో టీకా తీసుకోకుండా విధుల్లో ఉన్న 9 వేల మంది పారిశుద్ధ్య సిబ్బందిని బలవంతపు సెలవులపై పంపింది. వేతనం చెల్లించని సెలవులపై పంపడం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎంప్లాయిస్ వ్యాక్సినేషన్ తప్పనిసరి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ న్యూయార్క్ లోని స్టాటెన్ నగరంలో కొందరు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. వ్యాక్సిన్ వ్యతిరేకించే వారు, స్థానికులు కొందరు వారికి మద్దతు తెలిపారు.


పారిశుద్ధ్య సిబ్బందితో పాటు అగ్నిమాపక సిబ్బంది కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. టీకా తప్పనిసరి నిర్ణయం సరికాదని వారు ఆందోళనకు దిగారు. ఉద్యోగులు, సిబ్బందికి స్థానికులు కూడా మద్దతుగా నిలిచారు. అయితే సిబ్బంది నిరసన పట్ల నగర మేయర్ బిల్ డి బ్లాసియో స్పందించారు. తొంభై శాతం మంది సిబ్బంది టీకా తీసుకున్నవారేనని ఆయన తెలిపారు. నగరంలో సుమారు 3 లక్షల మంది సిబ్బంది అందుబాటులో ఉన్నారని వెల్లడించారు. పారిశుద్ధ్య సిబ్బంది కొరతతో ఎలాంటి సేవలకు అంతరాయం కలగబోదని ఆయన స్పష్టం చేశారు. ఇక కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ అవసరమని నొక్కి చెప్పారు.

అగ్నిమాపక సిబ్బంది సైతం... ఈ ఆందోళనల్లో పాల్గొనగా... దీనిపై అగ్నిమాపక కమిషనర్ డానియల్ నిగ్రో రెస్పాండ్ అయ్యారు. నగరంలోని అన్ని కేంద్రాలు తెరిచే ఉన్నాయని వెల్లడించారు. అయితే అత్యవసర పరిస్థితుల్లో పనిచేయడానికి కొంతమంది సిబ్బంది మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. ఇకపోతే నగరవ్యాప్తంగా సిబ్బంది కొరత కారణంగా 18 డిపార్టుమెంట్లు, 350 యూనిట్లలో సేవలు నిలిపివేసినట్లు వివరించారు.

కరోనా తొలినాళ్లలో ఆ దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగింది. అధ్యక్షుడు బైడెన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఊపందుకుంది. అతితక్కువ కాలంలోనే టీకా పంపిణీ శాతం పెరిగింది. అయితే ఇప్పటివరకు టీకా తీసుకోని వారు కూడా ఉన్నారు. వ్యాక్సిన్ పట్ల ఉన్న భయం, అపోహల కారణంగా కొందరు జంకుతున్నారు. ప్రభుత్వం ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టినా వారిలో మార్పు రాలేదు. పైగా టీకా తీసుకోవడానికి రివార్డులు కూడా ప్రకటించింది. ఇకపోతే వందశాతం వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ఉద్యోగులకు టీకా తప్పనిసరి ఆంక్షలను విధిస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.