Begin typing your search above and press return to search.

ఒక్కరోజులోనే 13 లక్షల మందికి వ్యాక్సినేషన్ ... ఏపీ కొత్త రికార్డు !

By:  Tupaki Desk   |   21 Jun 2021 4:30 AM GMT
ఒక్కరోజులోనే 13 లక్షల మందికి వ్యాక్సినేషన్ ...  ఏపీ కొత్త రికార్డు !
X
కేంద్రం సహాయం ఏ మాత్రం దొరికినా కూడా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో తమ సత్తా వంద శాతం చూపుతామని ఏపీ ప్రభుత్వం మరోసారి రుజువు చేసింది. ఆదివారం రోజు రాష్ట్రంలో గ్రామ‌గ్రామానా పెద్ద ఎత్తున వ్యాక్సినేష‌న్ జ‌రిగింది. ప్ర‌తి గ్రామ స‌చివాల‌యం వ‌ద్దా వ్యాక్సినేష‌న్ ఉధృతంగా జ‌రిగింది. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఎవరికీ సాధ్యం కాని రీతిలో వ్యాక్సిన్లు వేసింది. కోవిడ్ నియంత్రణ చర్యల్లో జాతీయస్థాయిలో అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ మరోసారి వ్యాక్సినేషన్‌ లో తన సామర్థ్యంను చాటుకుంది. వ్యాక్సినేషన్ లో కొత్త రికార్డు సృష్టించింది. గతంలో ఒకేరోజు 6 లక్షల మందికి వ్యాక్సిన్‌లు వేసి రికార్డులు సృష్టించి దేశంలోనే నంబర్‌ వన్ గా ఉన్న ఏపీ సర్కార్ తాజాగా తన రికార్డును తానే అధిగమించి వ్యాక్సినేషన్ ప్రక్రియలో రికార్డులను తిరగరాసింది. వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ లో 13 లక్షల మందికి వ్యాక్సిన్ వేయడం ద్వారా నేడు కొత్త రికార్డు సృష్టించింది.

ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 13 లక్షల మందికి వ్యాక్సిన్ అందించారు. ఉదయం నుంచి ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా ప్రజలకు చేరువ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాల్లో ఏర్పాటు చేసిన 2,232 కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఒక ప్రత్యేక డ్రైవ్‌ గా నిర్వహించారు. రాష్ట్రంలో కోట్లాది మందికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేయాల్సిన పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ముందుస్తుగానే వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందికి అవసరమైన శిక్షణను ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం నేడు సత్ఫలితాలను ఇచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రజలకు వ్యాక్సిన్‌ను అందించాలన్న సీఎం ఆదేశాలను వైద్య, ఆరోగ్యశాఖ కార్యరూపంలోకి తీసుకువచ్చింది. దీనికితోడు క్షేత్రస్థాయిలో పనిచేసే ఆశావర్కర్లు, ఎఎన్‌ఎంలకు వ్యాక్సినేషన్‌లో అవసరమైన శిక్షణను అందించడం, ప్రతి యాబై ఇళ్లకు నియమించిన వాలంటీర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమంపై అవగాహన కల్పించడం వల్ల ఒకేరోజు లక్షలాధి మందికి వ్యాక్సిన్‌ను అందించే సామర్థ్యంను ఎపి సొంతం చేసుకుంది.

కేంద్రం నుంచి వస్తున్న వ్యాక్సిన్‌ను గన్నవనం ఎయిర్ పోర్టు సమీపంలోని సెంట్రల్ వ్యాక్సిన్ స్టోరేజీ సెంటర్‌ కు తరలించడం, అక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లాకు ఎటువంటి జాప్యం లేకుండా వారికి కేటాయించిన డోసులను తరలించేందుకు పటిష్టమైన నెట్‌ వర్క్‌ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గన్నవరం సెంటర్‌ నుంచి ఆయా జిల్లాలకు వ్యాక్సిన్ చేరుకున్న వెంటనే, జిల్లా వ్యాప్తంగా ఉన్న వ్యాక్సినేషన్ కేంద్రాలకు వాటిని పంపిణీ చేయడం, మరోవైపు వ్యాక్సిన్ వేసేందుకు ఆయా కేంద్రాల్లో ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేసుకోవడం వల్ల ప్రజలు ఎక్కువ సేపు కూడా వ్యాక్సిన్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఒక ప్రణాళికాబద్దంగా వ్యాక్సినేషన్ నిర్వహించారు. స్పెషల్ డ్రైవ్‌లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో లక్షన్నర మందికి, పశ్చిమగోదావరి జిల్లాలో1.45 లక్షల మందికి, కృష్ణాలో 1.30 లక్షలు, విశాఖలో 1.10 లక్షలు.. గుంటూరులో 1.01 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. ధర్డ్ వేవ్ ముప్పు నేపథ్యంలో ఈ రోజు స్పెషల్ డ్రైవ్‌ లో ఐదేళ్ల లోపు చిన్నారుల తల్లులకి అధిక ప్రాధాన్యతనిచ్చారు. అయితే , ప్రతి రోజు కూడా ఇంత మొత్తంలో వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందా అంటే ఉండదు అనే చెప్పాలి. అయితే వ్యాక్సిన్ అందుబాటులో ఉండాలే కానీ, ఎంతమందికైనా వ్యాక్సిన్ ఇవ్వగలిగే శక్తి ఏపీ ప్రభుత్వానికి ఉందని ప్రభుత్వం నిరూపించుకుంది.