Begin typing your search above and press return to search.

కారణం ఏదైనా..తెలంగాణలో టీకా వేసే సీన్ లేదా?

By:  Tupaki Desk   |   17 May 2021 1:26 AM GMT
కారణం ఏదైనా..తెలంగాణలో టీకా వేసే సీన్ లేదా?
X
ఓవైపు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మహమ్మారి బారిన పడకుండా ఆపలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి వేళ.. వీలైనంతవరకు వ్యాక్సినేషన్ వేయటం ద్వారా పాజిటివ్ బారిన పడటం కాస్త తగ్గించే వీలుంది. అయితే.. అందుకు అవసరమైన టీకాలు లేకపోవటం తలనొప్పిగా మారింది. గడిచిన రెండు రోజులుగా (శని.. ఆదివారాల్లో) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని తెలంగాణలో నిలిపివేశారు.

ఈ రోజు (మే 17) నుంచి టీకా కార్యక్రమాన్ని మళ్లీ షురూ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. అయితే.. ఆదివారం సాయంత్రానికి రావాల్సిన కొవాగ్జిన్ స్టాక్ రాకపోవటంతో రెండో డోస్ మీద అయోమయం నెలకొంది. అదే సమయంలో.. మరో టీకా అయిన కోవిషీల్డ్ కు సంబంధించి రెండో డోసు వేసుకునే గడువును భారీగా పెంచటంతో.. ఇప్పుడు సెకండ్ డోస్ వేయాల్సిన అవసరం లేని పరిస్థితి.

ఇదంతా చూస్తే.. కొరత కారణంగా కోవాగ్జిన్ లేదని చెబితే.. గడువు పేరుతో కోవీ షీల్డ్ వేయకుండా అడ్డుకుంటున్న పరిస్థితి. దీంతో.. తెలంగాణలో టీకా కార్యక్రమం మళ్లీ ఎప్పుడు మొదలువుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. వాస్తవానికి ఈ రోజు (సోమవారం) నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం తెలంగాణలో షురూ కావాల్సి ఉంది. కోవీషీల్డ్ ను 84 రోజుల తర్వాతే ఇవ్వాలంటూ కేంద్ర ఆరోగ్య.. కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేయటంతో.. స్లాబులు బుక్ చేసుకున్న పాత వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పింది.

స్లాట్ బుక్ చేసుకోని కొత్త వారికి మాత్రం మొదటి డోస్ వేసుకున్న 84 రోజుల తర్వాతే బుక్ చేసుకునే అవకాశం ఇవ్వాలని చెప్పింది. దీంతో.. తెలంగాణలో అయోమయ పరిస్థితి నెలకొంది. పాత గడువుతో స్లాట్ బుక్ చేసుకున్న వారు పెద్దగా లేకపోవటం.. కొత్త గడువు ప్రకారం మరికొంత సమయం ఉండటంతో ఇప్పటికప్పుడు వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం లేదన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా తెలంగాణలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ లో పడిపోయిందని చెప్పక తప్పదు.