Begin typing your search above and press return to search.

క‌ఠిన నిర్ణ‌యంః వ్యాక్సిన్ తీసుకోకుండా రోడ్డెక్కారో..

By:  Tupaki Desk   |   7 Jun 2021 12:30 AM GMT
క‌ఠిన నిర్ణ‌యంః  వ్యాక్సిన్ తీసుకోకుండా రోడ్డెక్కారో..
X
క‌రోనా నియంత్ర‌ణ‌కు ఎన్ని చ‌ర్య‌లు తీసుకున్నా.. మ‌హ‌మ్మారి అదుపులోకి రాని రాష్ట్రాల్లో మ‌హారాష్ట్ర మొద‌టి స్థానంలో ఉంటుంది. దేశవ్యాప్తంగా తొలి విడ‌త క‌రోనా త‌గ్గినా.. అక్క‌డ మాత్రం అదుపులోకి రాలేదు. ఆ ప‌రిస్థితి అలా ఉండ‌గానే.. సెకండ్ వేవ్ భీక‌ర‌మైన దాడి కొన‌సాగించింది. సెకండ్ వేవ్ నియంత్ర‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా లాక్ డౌన్ విధించిన తొలి రాష్ట్రం కూడా మ‌హారాష్ట్రనే కావ‌డం గ‌మ‌నార్హం. అందుకే.. అక్క‌డ క‌ఠిన నిర్ణ‌యాలు అమ‌లు చేస్తోంది ప్ర‌భుత్వం. కార‌ణం లేకుండా రోడ్ల‌మీద‌కు వ‌స్తే.. సెల‌బ్రిటీలైనా కేసులు న‌మోదు చేస్తున్నారు అధికారులు.

కాగా.. ఆ రాష్ట్రంలో అధికంగా కేసులు న‌మోదైన సిటీల్లో ఔరంగాబాద్ కూడా ఉంది. క‌రోనా నియంత్ర‌ణ‌లో భాగంగా అక్క‌డి అధికారులు మ‌రో క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌భుత్వ లెక్క‌ల ప్ర‌కారం ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 45 సంవ‌త్స‌రాలు దాటిన వారంద‌రికీ వ్యాక్సిన్ వేసిన‌ట్టే. ఆ త‌ర్వాత‌నే 45 ఏళ్ల లోపు వారికి వ్యాక్సినేష‌న్ డ్రైవ్ మొద‌లు పెట్టారు. కానీ.. వాస్త‌వంగా చూసిన‌ప్పుడు 45 ఏళ్లు పైబ‌డిన‌వారిలో వ్యాక్సిన్ తీసుకోన‌టువంటి వారు ఎంతో మంది ఉన్నారు. వ్యాక్సిన్ అంద‌క తీసుకోనివారు కొంద‌రైతే.. ఏవేవో కార‌ణాలు చెబుతూ కావాల‌నే వ్యాక్సిన్ తీసుకోన‌టువంటివారు కూడా ఉన్నారు.

ఇలాంటి వారి విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ఔరంగాబాద్ అధికారులు భావిస్తున్నారు. 45 ఏళ్లు దాటిన వారు వ్యాక్సిన్ తీసుకోకుండా రోడ్డెక్కితే ఫైన్ విధించాల‌ని నిర్ణ‌యించారు. ఔరంగాబాద్ లో దాదాపు 17 ల‌క్ష‌ల జ‌నాభా ఉండ‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు మూడున్న‌ర ల‌క్ష‌ల మందికి కూడా వ్యాక్సిన్ అంద‌లేద‌ని స‌మాచారం. 45ఏళ్లు దాటిన వారిలో చాలా మంది ఉద్దేశ‌పూర్వ‌కంగానే వ్యాక్సిన్ తీసుకోక‌పోవ‌డంతో.. ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు అక్క‌డి అధికారులు చెబుతున్నారు.