Begin typing your search above and press return to search.

ఇంట్లోనే కేటీఆర్‌కు వ్యాక్సిన్ .. చీల్చి చెండాడిన కాంగ్రెస్

By:  Tupaki Desk   |   18 Sept 2021 4:00 PM IST
ఇంట్లోనే కేటీఆర్‌కు వ్యాక్సిన్ .. చీల్చి చెండాడిన  కాంగ్రెస్
X
అనుకున్న‌ది ఒక్క‌టి, అయిందొక్క‌టి అన్నట్టుగా ఉంది తెలంగాణ మంత్రి కేటీఆర్ పరిస్థితి. క‌రోనా వైరస్ సెకండ్ డోస్ కంప్లీట్ అంటూ, మంత్రి కేటీఆర్ గ్రేట్‌ గా ఫీల్ అవుతూ పెట్టిన ట్వీట్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ప్ర‌ధాని మోడీ, కేంద్ర మంత్రులు సైతం ఆస్ప‌త్రికి వెళ్లి వ్యాక్సిన్ తీసుకుంటే, కేటీఆర్ తాను ఇంటి ద‌గ్గ‌ర‌ వ్యాక్సిన్ వేయించుకోవ‌డం ఏమిట‌ని నెటిజ‌న్లు విమర్శలు చేస్తున్నారు. ప్ర‌జ‌లంతా వ్యాక్సిన్ దొర‌క్క ఆరోగ్య కేంద్రాల ముందు క్యూ లైన్లనో నిల్చుని నీర‌సించిపోతోంటే.. మంత్రి మాత్రం ద‌ర్జాగా ఇంట్లో కూర్చొని వ్యాక్సిన్ తీసుకుంటారా అంటూ నిల‌దీస్తున్నారు.

ప్ర‌భుత్వ ఆరోగ్య కేంద్రాల వ‌ద్ద‌కు వెళ్ల‌డం నామోషీ అనుకుంటే, క‌నీసం ఏ య‌శ‌దో ఆస్ప‌త్రికో వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవాల్సి క‌దా అని ప్ర‌శ్నిస్తున్నారు. కేటీఆర్ తాను ఇంట్లో వ్యాక్సిన్ తీసుకున్న‌ట్టే, ప్ర‌జ‌ల‌కు కూడా ఇంటింటికి వెళ్లి ఎందుకు వ్యాక్సిన్ ఇవ్వ‌రు అని ప్ర‌శ్నిస్తున్నారు. మంత్రికో రూల్.. ప్ర‌జ‌ల‌కో రూలా, అని కేటీఆర్‌ను క‌డిగి పారేస్తున్నారు. ఓ వైపు తిట్ల‌తో పాటు.. మ‌రోవైపు సెటైర్లు ప‌డుతున్నాయి కేటీఆర్ చేసిన ట్వీట్‌కు. ప్ర‌ధాని మోడీ జ‌న్మ‌దినం రోజునే కేటీఆర్ వ్యాక్సిన్ వేసుకోవాల్సి వ‌చ్చింద‌ని.. కేంద్రం ఏం సాయం చేయలేద‌ని విమ‌ర్శించే ఆయ‌న‌కు కాల‌మే స‌మాధానం చెప్పింద‌ని కామెంట్లు చేస్తున్నారు. ఇక మ‌రికొంద‌రేమో, ఇంత‌కీ కేటీఆర్ వేసుకున్న వ్యాక్సిన్ మోడీ ఉచితంగా ఇచ్చిన‌దేనా అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

ఇక ఇంట్లోనే మంత్రి వ్యాక్సిన్ తీసుకోవడం పై కాంగ్రెస్ కూడా ట్విట్టర్ ద్వారా ఎద్దేవా చేసింది. ప్రజలు ఒకే మోతాదు వ్యాక్సిన్ పొందడానికి కష్టపడుతుండగా, ఇక్కడ మా మంత్రి తన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటూ టీకాలు వేసుకుంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ విమర్శలు చేసింది. మంత్రికి ఇంట్లో వ్యాక్సిన్ ఇచ్చారు సరే , మరి ప్రజలకి ఇంటి వద్దే ఎందుకు వ్యాక్సిన్ ఎవ్వరూ అని ప్రశ్నించారు. అలాగే, దీన్ని బట్టి మంత్రులకి , సామాన్య ప్రజలకి రూల్స్ వేరేగా ఉంటాయని కాంగ్రెస్ విమర్శలు చేస్తుంది.