Begin typing your search above and press return to search.

భార‌త్ కీలక ముంద‌డుగు.. తొలిసారిగా ఆ వ్యాధికి వ్యాక్సిన్‌!

By:  Tupaki Desk   |   1 Sep 2022 7:33 AM GMT
భార‌త్ కీలక ముంద‌డుగు.. తొలిసారిగా ఆ వ్యాధికి వ్యాక్సిన్‌!
X
ప్ర‌పంచ వ్యాక్సిన్ల త‌యారీ రంగంలో కీల‌క పాత్ర పోషిస్తున్న భార‌త్ మ‌రో ముంద‌డుగు వేసింది. గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్‌కు చెక్ పెట్టేలా వ్యాక్సిన్ ను తయారు చేసింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏటా కొన్ని లక్ష‌ల మంది మ‌హిళ‌లు గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్‌తో మ‌ర‌ణిస్తున్నారు. వీరిలో చైనా, భార‌త్‌ల‌కు చెందిన‌వారే ఎక్కువ‌. ఈ రెండు దేశాల నుంచే 35 శాతం మందికిపైగా గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్ బారిన‌ప‌డుతున్నార‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. మ‌న‌దేశంలో ఏటా ల‌క్ష మందికి పైగా మ‌హిళ‌లు గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్ బారిన ప‌డుతున్నారు. వీరిలో 65 శాతం మందికి పైగా మృత్యువాత ప‌డుతున్నారు.

ఈ నేప‌థ్యంలో దేశంలోనే తొలి గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్ వ్యాక్సిన్... క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిల్లోమావైరస్ వ్యాక్సిన్(Quadrivalent Human Papillomavirus vaccine) ను సెప్టెంబ‌ర్ 1న విడుద‌ల చేశారు.

గర్భాశ‌య క్యాన్స‌ర్ 90 శాతం ఒకే ఒక నిర్దిష్ట వైర‌స్ వ‌ల్ల వ‌స్తుంద‌ని వైద్యులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో భార‌త్ రూపొందించిన ఈ వ్యాక్సిన్ ఆ వైర‌స్‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేస్తుంద‌ని అంటున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ల తయారీతో సంచ‌ల‌నం సృష్టించిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్ల‌ను నిరోధించే వ్యాక్సిన్‌ను రూపొందించింది.

గర్భాశయ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా మ‌న‌దేశంలో వ్యాక్సిన్‌ను తయారు చేసే బాధ్యతను డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది జూలై నెల‌లో సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు అప్పగించిన సంగ‌తి తెలిసిందే.

ఢిల్లీలోని ఐఐసీలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ ఈ వ్యాక్సిన్‌ను ప్రారంభించారు.ఈ వ్యాక్సిన్ రాకతో భారతదేశ వైద్య శాస్త్రంలో ఒక మైలురాయి సాధించినట్లయింద‌ని ఆయ‌న తెలిపారు. గర్భాశయ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిల్లోమావైరస్ వ్యాక్సిన్ ను మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు.

మ‌న‌దేశంలో 9 నుంచి 14 సంవత్సరాల లోపు బాలికలకు ఈ గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్ ను జాతీయ ఇమ్యూనైజేషన్ కార్యక్రమంలో భాగంగా అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

"90 శాతం గర్భాశయ క్యాన్సర్ నిర్దిష్ట వైరస్ వల్ల వస్తుందని, ఈ వ్యాక్సిన్ ఆ వైరస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుంది" అని కోవిడ్ వర్కింగ్ గ్రూప్ చైర్‌పర్సన్, నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ డాక్టర్ ఎన్‌కె అరోరా తెలిపారు. సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూపొందించిన‌ క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిల్లోమావైరస్ వ్యాక్సిన్ తో గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్‌కు చెక్ పెట్ట‌వ‌చ్చ‌న్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.