Begin typing your search above and press return to search.

దేశాధ్య‌క్షుడి మెడ‌కు వ్యాక్సిన్ అక్ర‌మం.. విచార‌ణ‌కు సుప్రీం ఆదేశం!

By:  Tupaki Desk   |   4 July 2021 8:30 AM GMT
దేశాధ్య‌క్షుడి మెడ‌కు వ్యాక్సిన్ అక్ర‌మం.. విచార‌ణ‌కు సుప్రీం ఆదేశం!
X
భార‌త్ బ‌యోటెక్ త‌యారు చేసిన క‌రోనా వ్యాక్సిన్ ‘కొవాగ్జిన్’ ను కొనుగోలు చేసేందుకు బ్రెజిల్ ప్ర‌భుత్వం భార‌త్ బ‌యోటెక్ సంస్థతో ఒప్పందం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. ఈ ఒప్పందంలో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని, బ్రెజిల్ధ్య‌క్షుడు బోల్సోనారో అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని తీవ్ర విమ‌ర్శ‌లు రావ‌డంతో ఈ వ్యాక్సిన్ కొనుగోలు ఒప్పందం ర‌ద్దు అయ్యింది.

మొత్తం 20 కోట్ల డోసుల కొవాగ్జిన్ కోసం.. 324 మిలియ‌న్ డాల‌ర్లు వెచ్చించేందుకు బ్రెజిల్ సిద్ధ‌మైంది. అయితే.. చెల్లింపుల విష‌యంలో బ్రెజిల్ అధ్య‌క్షుడు బోల్సోనారో అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్టు ఆరోపణలు రావడంతో.. ఈ డీల్ అనివార్యంగా ర‌ద్దైపోయింది.

ఓ థర్డ్ పార్టీ కంపెనీ పేరుతో తప్పుడు ఇన్ వాయిస్ లు సృష్టించిన‌ట్టు బ్రెజిల్‌ ఫెడ‌ర‌ల్ ద‌ర్యాప్తు సంస్థ‌లు తేల్చాయి. వ్యాక్సిన్ ధ‌ర ఎక్కువ చెల్లించాల్సి ఉన్న‌ట్టు రికార్డుల్లో న‌మోదు చేసిన‌ట్టు స‌మాచారం. ఈ వ్య‌వ‌హారంపై బ్రెజిల్ ఫెడ‌ర‌ల్ ప్రాసిక్యూట‌ర్లు, కంప్ట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ వేర్వేరుగా ద‌ర్యాప్తు చేస్తున్నాయి.

తాజాగా.. ఈ విష‌య‌మై విచార‌ణ చేప‌ట్టిన‌ బ్రెజిల్ సుప్రీం కోర్టు.. అధ్య‌క్షుడు బోల్సోనారోపై విచార‌ణ‌కు అనుమ‌తులు జారీచేసింది. ఈ విచార‌ణ నివేదిక‌ను స‌మ‌ర్పించేందుకు 90 రోజుల గ‌డువు విధించింది. దీంతో.. ద‌ర్యాప్తు సంస్థ‌లు ఎలాంటి ఆధారాలు సేక‌రిస్తాయి? అధ్యక్షుడు బోల్సోనారో విషయంలో సుప్రీం కోర్టు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోనుంద‌నే ఆస‌క్తి నెల‌కొంది.

కాగా.. ఈ విష‌య‌మై భార‌త్ భ‌యోటెక్ కూడా స్పందించింది. త‌మ వైపు నుంచి ఎలాంటి త‌ప్పూ జ‌ర‌గ‌లేద‌ని, ప్ర‌తీ నిబంధ‌న‌ను పాటించామ‌ని చెప్పింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆ దేశ ప్ర‌భుత్వం నుంచి త‌మ‌కు ఒక్క రూపాయి కూడా అంద‌లేద‌ని, అదే స‌మ‌యంలో తాము కూడా ఒక్క డోసును కూడా స‌ర‌ఫ‌రా చేయ‌లేద‌ని స్ప‌స్టం చేసింది.

బ‌య‌టి దేశాల‌న్నింటికీ ఒక డోసు ధ‌ర‌ను 15 నుంచి 20 డాల‌ర్లుగా నిర్ణ‌యించామ‌ని, బ్రెజిల్ కు సైతం 15 డాల‌ర్ల‌కే వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా చేసేలా ఒప్పందాలు చేసుకున్న‌ట్టు తెలిపింది. ఆ దేశంలో రెగ్యులేట‌రీ అనుమ‌త‌ల కోసం, మూడో ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ కు సైతం ఇప్ప‌టికే ద‌ర‌ఖాస్తు చేశామ‌ని తెలిపింది. మీడియాలో ప‌లు త‌ప్పుడు క‌థ‌నాలు వ‌స్తున్నాయ‌ని, అందుకే.. ఈ స్ప‌ష్ట‌త ఇస్తున్నామ‌ని భార‌త్ భ‌యోటెక్ చెప్పింది.