Begin typing your search above and press return to search.

మాల్ కు.. హోటల్ కు వెళ్లాలా? అయితే వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందే

By:  Tupaki Desk   |   1 Aug 2021 4:02 AM GMT
మాల్ కు.. హోటల్ కు వెళ్లాలా? అయితే వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందే
X
కరోనా ప్రమాదం పొంచి ఉందన్న సంగతి తెలిసిందే. ఒక ఊపు ఊపిన సెకండ్ వేవ్ తీవ్రత తగ్గిపోయి చాలా కాలమే అయ్యింది. ముఖానికి మాస్కులు.. చేతికి అప్పుడప్పుడు రాసుకుంటున్న శానిటైజర్ తప్పించి.. కరోనాకు సంబంధించి మరిక ఎలాంటి ముందు జాగ్రత్తలు పాటించని వైనం ఇప్పుడు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

ఇలాంటివేళ.. తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త రూల్ ను తెర మీదకు తీసుకురానున్నారా? అన్న అభిప్రాయానికి గురయ్యేలా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావు మాటలు ఉన్నాయి. ప్రస్తుతం మూడో వేవ్ కు సంబంధించిన టెన్షన్ తో ఉన్న విషయం తెలిసిందే. డెల్టా.. డెల్టా ప్లస్ వేరియంట్లు ఎక్కడ విరుచుకుపడతాయన్నది ఇప్పుడో ప్రశ్నగా మారింది.

ఈ నేపథ్యంలో ఆయనో కీలక వ్యాఖ్య చేశారు. బయటే కాదు ఇంట్లో కూడా ముఖానికి మాస్కు వేసుకోవాల్సిన పాడు రోజులు వచ్చినన వైనాన్ని వివరించారు. డెల్టా వైరస్ ప్రమాదకరమని.. బయటే కాకుండా ఇంట్లోనూ మాస్కు ధరించటం మంచిదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం.. నల్గొండ.. కరీంనగర్.. వరంగల్ అర్బన్.. వరంగల్ రూరల్.. మంచిర్యాల.. పెద్దపల్లి.. కుమురం భీం.. మహబూబాబాద్ జిల్లాల్లో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న విషయాన్ని వెల్లడించారు.

పాజిటివ్ వచ్చిన వారు బయటకు వచ్చి తిరుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. ఈ కారణంగానే కేసుల సంఖ్య పెరగటానికి కారణమవుతోందన్నారు. భారత్ తో సహా 135 దేశాల్లో డెల్టా వేరియంట్ ప్రభావాన్ని చూపించిందన్న ఆయన.. తెలంగాణ రాష్ట్రంలోరెండు డెల్టా ప్లస్ కేసులు హైదరాబాద్ లో మేలో నమోదైన విషయాన్ని బయటపెట్టమే కాదు.. ఆ ఇద్దరు పేషెంట్లు పూర్తిగా కోలుకున్నారన్నారు. తెలంగాణలో ఇప్పటివరకు 1.12 కోట్ల మందికి మొదటి డోస్ ఇచ్చామని.. తొలి డోసు తీసుకున్న వారిలో 30 శాతం మందికి రెండో డోస్ ఇచ్చినట్లు చెప్పారు.

రానున్న ఒకటి రెండు వారాల్లో రెండో డోసు టీకాలకే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. గడల శ్రీనివాస్ చెప్పిన పాయింట్లలో కీలకమైనది.. రానున్న రోజుల్లో వ్యాక్సిన్ వేసుకోకుంటే మాల్ కు.. హోటళ్లకు నో ఎంట్రీ అని చెప్పటం. ఇదంతా చూస్తే.. భవిష్యత్తులో ఎక్కడికైనా.. చివరకుఏ షాపుకు వెళ్లాలన్నా.. వ్యాక్సిన్ వేసుకున్నట్లుగా ధ్రువీకరణ అడిగే పరిస్థితి రావటం ఖాయమన్నట్లుగా అర్థమవుతుంది. అందుకే.. వ్యాక్సిన్ వేయించుకోని వారు వెంటనే వేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది మర్చిపోకూడదు.