Begin typing your search above and press return to search.

12వేల మంది ప్రాణాలు నిలిపిన వ్యాక్సిన్లు ... పీహెచ్ఈ వెల్లడి !

By:  Tupaki Desk   |   15 May 2021 10:30 AM GMT
12వేల మంది ప్రాణాలు నిలిపిన వ్యాక్సిన్లు ... పీహెచ్ఈ వెల్లడి !
X
ప్రపంచాన్ని అల్లాడిపోయేలా చేస్తోన్న కరోనా ను అరికట్టడానికి తయారు చేసిన వ్యాక్సిన్లు సత్ఫలితాలు ఇస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వ్యాక్సినేషన్‌ లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్న ఇంగ్లాండ్‌ లో వ్యాక్సిన్ల వల్ల ఇప్పటివరకు 12వేల మరణాలను నిర్మూలించినట్లు అక్కడి ప్రజారోగ్య విభాగం తెలిపింది. అలాగే , మరో 30వేలకుపైగా వృద్ధులు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి బారినపడకుండా వ్యాక్సిన్‌లు అడ్డుకున్నాయని పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లాండ్‌ (పీహెచ్‌ ఈ) వెల్లడించింది. బ్రిటన్ లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని యుద్ధ ప్రతిపాదికన అమలు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఐదున్నర కోట్ల డోసులను అందించగా మొత్తం జనాభాలో దాదాపు 53శాతం తొలి డోసు తీసుకోగా , అలాగే 28శాతం రెండు డోసులను తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల ఫలితాలను విశ్లేషించిన అక్కడి ప్రజారోగ్య విభాగం, ఏప్రిల్‌ చివరి నాటికి 60ఏళ్లకు పైబడిన వారిలో 11,700 మరణాలను తగ్గించినట్లు తెలిపింది.అలాగే , 65ఏళ్లు పైబడిన మరో 33వేల మందిని ఆసుపత్రి చేరికల నుంచి నివారించామని, ఇవి వ్యాక్సిన్ల ప్రత్యక్ష ప్రభావాల వల్ల అంచనా వేసినవి మాత్రమేనని పీహెచ్‌ ఈ తెలిపింది. వీటికి అదనంగా వ్యాక్సినేషన్‌ తో వైరస్‌ వ్యాప్తిని నిర్మూలించడం వల్ల మరణాలు, ఆసుపత్రి చేరికలను భారీ స్థాయిలో నిరోధిస్తున్నామనేందుకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ఇంగ్లాండ్‌ ప్రజారోగ్య విభాగం స్పష్టం చేసింది. కరోనా వ్యాక్సిన్‌లు ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలను కాపాడాయి. ప్రజలు వైరస్‌ బారినపడి తీవ్ర అస్వస్థతకు గురికాకుండా నివారించడంలో వ్యాక్సిన్ల ప్రభావం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. వీరినే కాకుండా ఆసుపత్రులను, ఆరోగ్య వ్యవస్థలను వ్యాక్సిన్లు రక్షిస్తున్నాయి అని ఇంగ్లాండ్‌ ప్రజారోగ్య విభాగంలోని వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు నేతృత్వం వహిస్తున్న ఆరోగ్య నిపుణులు మేరీ రామ్సే తెలిపారు. ఇదిలాఉంటే, కరోనా వైరస్‌ విజృంభణ ధాటికి వణికిపోయిన బ్రిటన్‌ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. సుదీర్ఘకాలం పాటు కొనసాగిన ఆంక్షలను బ్రిటన్ ప్రభుత్వం సడలిస్తోంది. ఇప్పటివరకు 44లక్షల మందిలో వైరస్‌ బయటపడగా , లక్షా 27 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.