Begin typing your search above and press return to search.

బాబు జిగిరీదోస్తుకు ఆయ‌నిప్పుడు న‌చ్చ‌డంలేదు

By:  Tupaki Desk   |   17 Feb 2016 12:40 PM GMT
బాబు జిగిరీదోస్తుకు ఆయ‌నిప్పుడు న‌చ్చ‌డంలేదు
X
వడ్డే శోభనాద్రీశ్వరరావు...వ్య‌వ‌సాయ‌శాఖా మాజీ మంత్రి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు ఉమ్మ‌డి రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో వ్య‌వ‌సాయ‌శాఖ‌ను స‌మ‌ర్థంగా న‌డిపించ‌డ‌మే కాకుండా రైతుల ప‌క్షాన ఆలోచించ‌గ‌ల‌ర‌నే పేరున్న నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. ఇంతే కాకుండా బాబుకు స‌న్నిహితుడైన‌ మంత్రిగా కూడా పేరుంది. కానీ ఇపుడు అదే వ‌డ్డే బాబు తీరుపై మండిప‌డుతున్నారు. గ‌తంలో రాజ‌ధాని భూ సేక‌ర‌ణ‌పై మండిప‌డిన వ‌డ్డే శోభ‌నాద్రీశ్వ‌ర‌రావు తాజాగా తాత్కాలిక సచివాలయం తీరుపై విమ‌ర్శించారు.

చంద్ర‌బాబు ప్ర‌భుత్వం తాత్కాలిక సచివాలయం పేరుతో డబ్బు దుబారా చేస్తోంద‌ని వ‌డ్డే మండిప‌డ్డారు. తాత్కాలిక సచివాలయం పేరుతో రూ.201 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన భవనాన్ని ఆరునెలల తరువాత ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని చెబుతూనే ఇలాంటి దుబారా ఖర్చులు చేయడం ఎంతవరకు సమంజసమని వ‌డ్డే నిల‌దీశారు. ఒకవేళ నిజంగా స‌చివాల‌య‌మే అవసరమైతే విజయవాడలో గోకరాజు గంగరాజు భవనం, గన్నవరంలోని మేధాటవర్స్‌, పశువుల ఆస్పత్రి భవనాలను వినియోగించుకోవచ్చని వ‌డ్డే శోభ‌నాద్రీశ్వ‌ర‌రావు సూచించారు.

గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆర్థిక క్రమశిక్షణ పాటించగా, ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదన్నారు. డబ్బుల్లేవంటూనే ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. సెక్రటేరియట్‌ నిర్మాణానికి రూ.218 కోట్లు ఖర్చవుతుందని కేంద్రానికి నివేదిక సమర్పించారని, మళ్లీ ఇప్పుడు తాత్కాలికం పేరుతో రూ.201 కోట్లు ఖర్చుచేసి నిర్మాణం చేపడుతుండటం సహేతుకం కాదన్నారు. ప్రస్తుతం చంద్ర‌బాబు ప్ర‌వ‌ర్త‌న‌లో ఆర్థిక క్రమశిక్షణ తప్పిందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన రూ.1850 కోట్లకు ఇంతవరకు లెక్కలు లేవని ఆయ‌న మండిప‌డ్డారు. బాబుకు స‌న్నిహిత మంత్రుల్లో ఒక‌రిగా పేరున్న వ‌డ్డే ఇపుడు బాబు తీరును విమ‌ర్శించ‌డం ఆస‌క్తిక‌ర‌మే. త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల విష‌యంలో చంద్ర‌బాబు ఒకింత జాగ్ర‌త్త ప‌డ‌టం అవ‌స‌ర‌మేమో.