Begin typing your search above and press return to search.

బాబు తేడా వ‌స్తే..సింగ‌పూర్‌ కు పోవాల్సిందే

By:  Tupaki Desk   |   4 Jun 2018 5:30 PM GMT
బాబు తేడా వ‌స్తే..సింగ‌పూర్‌ కు పోవాల్సిందే
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఒక‌నాటి స‌న్నిహితుడు - మాజీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి వడ్డె శోభనాద్రీశ్వరరావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అమ‌రావ‌తి భూసేక‌ర‌ణ విష‌యంలో గ‌తంలో తీవ్రంగా విమ‌ర్శించిన వ‌డ్డే శోభ‌నాద్రీశ్వ‌రావు భోగాపురం మండలంలోని విమానాశ్రయం బాధిత గ్రామాల్లో పర్యటించారు. విమానాశ్రయం వద్దంటూ ప్రజలు ఉద్యమిస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినబడటంలేదని వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్ర‌బ‌స్సు లేని గ్రామాల‌కు ఎయిర్‌ బ‌స్ ఎందుక‌ని ప్ర‌శ్నిస్తూ బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇలా గ‌తంలో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తీరుపై విమ‌ర్శ‌లు చేసిన వ‌డ్డే తాజాగా ఆయ‌న తీరుపై సంచ‌ల‌న విమ‌ర్శ‌లు చేశారు.

అమ‌రావ‌తిలో మీడియాతో మాట్లాడిన వ‌డ్డే అత్యంత సారవంతమైన భూములను కాంక్రీట్ జంగల్ గా మార్చాలని ఏపీ ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. ఆ భూములను చూస్తే ఏడుపు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వేల కోట్ల విలువైన రాజధాని భూములను బలవంతంగా రైతుల నుంచి లాక్కొని అప్పనంగా సింగపూర్‌ కంపెనీలకు చంద్రబాబు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. రైతులు భూములు ఇవ్వడమే కాదు, అప్పులు కూడా ఇవ్వాలని చంద్రబాబు అడుగుతున్నారని విమర్శించారు. అమరావతి ద్వారా లబ్ధి పొందేది సింగపూర్ దేశమేనని...సింగపూర్ కంపెనీలకు, వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములను కట్టబెడతారా? ప్లాట్లు వేసి అమ్మేందుకు సింగపూర్ కంపెనీలకు భూములివ్వాలా? అని వ‌డ్డే శోభ‌నాద్రీశ్వ‌ర రావు ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం కోసం సింగపూర్‌ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాల వివరాలను ముఖ్యమంత్రి వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. అవేమైనా చీక‌టి ఒప్పందాలా అని వ‌డ్డే ప్ర‌శ్నించారు. పైగా సింగపూర్‌ కంపెనీలకు భారత చట్టాలు వర్తించవని, ఏమైనా తేడాలు వస్తే సింగపూర్‌ వెళ్లాల్సిందేనని వడ్డే శోభనాద్రీశ్వరరావు ​హెచ్చరించారు. ఏడాది క్రితం సింగపూర్‌ సం‍స్థలతో చేసుకున్న ఒప్పందాలు ఇప్పటివరకూ అమలుకు నోచుకొలేదని, తాజాగా వేరే కంపెనీలతో ఒప్పందం చేసుకుంటున్నారని తెలుస్తోందని.. గతంలో చేసుకున్న ఒప్పందం సంగతేంటని ప్రశ్నించారు.