Begin typing your search above and press return to search.

వంశీ వర్సెస్ వెంకట్రావ్.. మధ్య ఏం జరుగుతోంది?

By:  Tupaki Desk   |   6 May 2019 11:42 AM GMT
వంశీ వర్సెస్ వెంకట్రావ్.. మధ్య ఏం జరుగుతోంది?
X
కృష్ణ జిల్లా గన్నవరం నుంచి టీడీపీ నుంచి పోటీచేసిన వల్లభనేని వంశీ, వైసీపీ నుంచి పోటీచేసిన యార్లగడ్డ వెంకట్రావ్ మధ్య వివాదం ముదిరిపాకాన పడుతోంది. వెంకట్రావ్ ఇంటికి వెళ్లి వంశీ స్నేహ హస్తం అందిస్తే.. అది హస్తం కాదు.. భస్మాసుర హస్తం అంటూ వెంకట్రావ్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వంశీ స్నేహగీతం ఆలపిస్తే.. వెంకట్రావ్ ఇందులో కుట్రకోణం ఉందంటున్నారు. ఇంతకీ వీరిద్దరి మధ్య ఏం జరుగుతుందనేది గన్నవరం నేతలకే కాదు.. రాజకీయాల్లో తలపండిన వారికి కూడా అర్థం కావడం లేదట..

కృష్ణ జిల్లా గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ పోటీచేశారు. వైసీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావ్ బరిలో దిగి మొన్నటి ఎన్నికల్లో హోరీ హోరీగా పోరాడారు. తాజాగా ఫలితాల ముందట టీడీపీ అభ్యర్థి వంశీ నేరుగా వైసీపీ అభ్యర్థి వెంకట్రావ్ కు ఫోన్ చేసి మీరు ఎన్నికల్లో గెలుస్తున్నారు.. మీకు సన్మానం చేస్తాననడం.. మీ ఇంటికే వస్తానని చెప్పడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

టీడీపీ అభ్యర్థి వంశీ ఇలా సడన్ గా మారి స్నేహహస్తం అందించడంపై వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. వంశీ తమను బెదిరిస్తున్నాడని వైసీపీ నేతలు యార్లగడ్డ వెంకటరావు, దాసరి బాలవర్ధన రావులు విజయవాడ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. వంశీ నుంచి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే వంశీపై వైసీపీ అభ్యర్థి వెంకట్రావ్ తీవ్ర విమర్శలు చేశారు. వంశీలాగా తాను దిగజారి ప్రత్యర్థి పార్టీల పంచన చేరనని చెప్పుకొచ్చాడు. వంశీ ఓ సందర్భంగా గన్నవరం వచ్చిన జగన్ ను అప్యాయంగా కౌగిలించుకున్నాడని.. తన భార్యతో కలిసి జగన్ వద్దకు బెంగళూరు వెళ్లి సంప్రదింపులు జరిపాడని వెంకట్రావ్ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతోనే వంశీ ఇలా ప్రవర్తిస్తున్నాడని వెంకట్రావ్ ఆరోపించాడు. వంశీలాగా తాను ఏనాడు ప్రవర్తించలేదని చెప్పుకొచ్చారు. జగన్ అధికారంలోకి వస్తున్నారన్న భయంతోనే వంశీ ఇలా ఏమేమో చేస్తున్నారని వెంకట్రావ్ ఆరోపించారు. ఇలా ఇద్దరు నేతలు భిన్న మనస్తత్వాలతో మైండ్ గేమ్ ఆడుతుండడం గన్నవరం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.