Begin typing your search above and press return to search.

వల్లభనేని వంశీ, యలమంచి రాజేంద్ర ప్రసాద్ ఎలా తిట్టుకున్నారంటే..

By:  Tupaki Desk   |   15 Nov 2019 4:15 AM GMT
వల్లభనేని వంశీ, యలమంచి రాజేంద్ర ప్రసాద్ ఎలా తిట్టుకున్నారంటే..
X
నిన్న మొన్నటి వరకు ఒకే పార్టీలో ఉన్న నాయకులు ఇప్పుడు నువ్వెంతంటే నువ్వెంత అంటూ రాయలేని భాష లో తిట్టుకుంటున్నారు. సామాజిక బంధం బలంగా పెన వేసుకుని అధికారం వెలగబెట్టిన నాయకులు ఇప్పుడు అధికారం పోయిన తరువాత ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. అవును.... నిన్న మొన్నటి వరకు తెలుగు దేశం పార్టీలోనే ఉన్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, యలమంచిలి రాజేంద్ర ప్రసాద్ నిన్న ఒక టీవీ చానల్ చర్చ లో ఒకరినొకరు దారుణంగా తిట్టుకున్న వైనం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ చర్చకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో సర్క్యులేట్ అవుతోంది. ఆ వీడియో లో వల్లభనేని వంశీ అయ్యప్ప మాలలో ఉన్నట్లుగా కనిపించడం తో జనం నోరెళ్లబెడుతున్నారు. అయ్యప్ప మాల లో ఉంటూ వంశీ నోట ఆ మాటలేంటి అంటూ ఆశ్చర్య పోతున్నారు. అరేయ్.. ఒరేయ్.. నోర్ముయ్‌ రా.. రారా చూసుకుందాం.. అంటూ తొడలు కొట్టడం అయ్యప్ప దీక్ష లో ఉన్న వ్యక్తి కి తగునా అన్న ప్రశ్న వినిపిస్తోంది.


గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేయడం.. సీఎం, వైసీపీ అధినేత జగన్‌ను కలవడం తెలిసిందే. వంశీ తాజా టీడీపీ అధినేత చంద్రబాబుపై, ఆయన కుమారుడు లోకేష్‌ పై తీవ్ర స్థాయి లో ధ్వజమెత్తడం తెలిసిందే. వంశీ చంద్రబాబు పై ఆరోపణలు చేసిన తరువాత టీవీలో చర్చా కార్యక్రమం నిర్వహించారు. పార్టీకి రాజీనామా చేసిన వంశీ, పార్టీ లోనే ఉన్న యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్ అందులో పాల్గొన్నారు. ఈ సందర్భం గా ఇద్దరూ దారుణం గా దూషించుకున్నారు.

"వల్లభనేని వంశీకి ఆయన తండ్రి జన్మనిస్తే.. చంద్రబాబు రాజకీయ జన్మనిచ్చారు" అని రాజేంద్ర ప్రసాద్ అనడంతో వంశీ ఒక్కసారిగా రెచ్చిపోయారు. రాజేంద్రప్రసాద్ తొలుత ఆ స్థాయి లో రెస్పాండ్ కానప్పటికీ వంశీ స్పీడు తగ్గక పోవడంతో ఆయనా అంతే స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇద్దరూ ఒకరినొకరు హద్దులు దాటి దూషించుకుంటుంటే వ్యాఖ్యాత వారిని నిలువరించేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.

ఎన్టీఆర్ ఫ్యామిలీ కి సన్నిహితమైన దాసరి కుటుంబాన్ని పక్కన బెట్టి.. వంశీకి చంద్రబాబు సీటిచ్చారన్నారు. అంతేకాదు డెల్టాకు రావాల్సిన పోలవరం కుడి కాల్వ నీటిని.. మోటార్ల ద్వారా తరలించడానికి వంశీ ప్రయత్నిస్తే.. ఆ సమయంలో దేవినేని ఉమా అడ్డుకున్నారని.. అయితే అదే సమయం లో చంద్రబాబు నాయుడు వంశీకి మద్దతు తెల్పుతూ నీటి తరలింపుకు అంగీకరించారని రాజేంద్ర ప్రసాద్ పాత విషయాలన్నీ గుర్తుచేశారు. దీంతో వంశీ వాటిని ఖండిస్తూ యలమంచిలిపై మండిపడ్డారు. ఇద్దరూ కాసేపు పరుష పదజాలం తో దూషించుకున్నారు.