Begin typing your search above and press return to search.

టీడీపీ ఎమ్మెల్యేనే అంటున్న వల్లభనేని...?

By:  Tupaki Desk   |   10 Dec 2021 1:30 AM GMT
టీడీపీ ఎమ్మెల్యేనే అంటున్న వల్లభనేని...?
X
వల్లభనేని వంశీ ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్. ఆయన ఆవేశంతో పేల్చే డైలాగులు రాజకీయ కాక పుట్టిస్తాయి. ఆయన మాటలు ఒక విధంగా మంటలనే రేపుతాయి. ఆయన చంద్రబాబు మీద లోకేష్ మీద చేసిన కామెంట్స్ ఒక రకంగా రాజకీయ యుద్ధాన్నే ఏపీలో రగిలించేలా చేశాయి. వంశీ దూకుడు అలా ఉంటుంది. ఆయన పాలిటిక్స్ అలాగే చేస్తారు అన్న పేరు కూడా ఉంది. ఇక ఆయన 2014లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో అదే పార్టీ నుంచి విజయవాడ గన్నవరం సీట్లో గెలిచారు.

ఆయన ఇపుడు వైసీపీకి మద్దతు ఇస్తున్నారు. ఆయన ఇపుడు ఏ పార్టీ అంటే జనాలకు తెలియదు, కానీ ఆయన ఏ మాత్రం తడుముకోకుండా ఠక్కున జవాబు చెప్పారు. తాజాగా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లడుతూ తాను ఈ రోజుకీ టీడీపీ ఎమ్మెల్యే అని చెప్పి షాక్ ఇచ్చేశారు. తాను వైసీపీలో చేరలేదని, కేవలం మద్దతు ఇస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు.

తనకు ఓటేసిన ప్రజలకు న్యాయం చేయడం కోసమే తాను అధికార పార్టీకి మద్దతు ఇవ్వాల్సి వచ్చింది తప్ప తనకు ఎలాంటి వ్యక్తిగత వ్యాపార ప్రయోజనాలు లేవని ఆయన స్పష్టం చేశారు. తన మీద ఫిరాయింపుల నిరోధక చట్టం మేరకు టీడీపీ ఎందుకు ఫిర్యాదు చేయలేదు అని ఆయన ఎదురు ప్రశ్నించారు. టీడీపీకి కనాకష్టంగా 23 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారని, అందులో కొందరు పార్టీకి దూరంగా ఉన్నారని, ఈ పరిస్థితుల్లో తనను బయటకు పంపిస్తే చంద్రబాబుకే నష్టమని టెక్నికల్ గా తనను టీడీపీలో ఉంచారని వంశీ చెప్పుకొచ్చారు.

అందుకే తన అనర్హత మీద చర్యలు తీసుకోలేదని భావిస్తున్నాట్లుగా ఆయన చెప్పారు. తన మీద అనర్హత వేటు వేస్తే టీడీపీ ఎమ్మెల్యేల నంబర్ ఇంకా తగ్గిపోతుందని, చివరికి చంద్రబాబు ప్రతిపక్ష స్థానానికి ముప్పు వస్తుందని తనకు టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగిస్తున్నారు అనుకోవచ్చు అని ఆయన అన్నారు. తాను ఎవరికీ భయపడే ప్రసక్తి లేదని, తనను వైసీపీ వారు ప్రలోభాలకు గురి చేశారని చెప్పడం కూడా తప్పే అని ఆయన అన్నారు. తాను కచ్చితంగా ఉంటానని, అందుకే తాను రాజకీయాల‌లో రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్నానని చెప్పారు.

ఇదిలా ఉంటే జగన్ తనను వైసీపీలోకి రమ్మని ఎపుడూ ఆహ్వానించలేదని కూడా వంశీ కుండబద్ధలు కొట్టారు. తాను గెలిచిన చోట ఇళ్ల పట్టాల సమస్యతో పాటు ప్రజల సమస్యలు పరిష్కరించాలనే అధికార పార్టీకి మద్దతు ఇచ్చానని, పైగా వైసీపీ ప్రభుత్వ విధానాలు నచ్చి తాను మద్దతు ఇచ్చానని వంశీ చెప్పడం విశేషం. కొడాలి నాని తాను మంచి మిత్రులమని, తమ బంధం రాజకీయాలకు అతీతమైనది అని కూడా వంశీ పేర్కొన్నారు.