Begin typing your search above and press return to search.

అధికార పార్టీ ఎమ్మెల్యే లేఖాస్త్రం..ఏపీలో క‌ల‌క‌లం

By:  Tupaki Desk   |   8 Jun 2018 1:35 PM GMT
అధికార పార్టీ ఎమ్మెల్యే లేఖాస్త్రం..ఏపీలో క‌ల‌క‌లం
X
ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. అధికార‌ టీడీపీలో క్రియాశీలంగా ఉండే ఎమ్మెల్యే సంధించిన లేఖాస్త్రం ఆ పార్టీలో ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా సంచ‌ల‌నం రేకెత్తిస్తున్న అంశంపై అధికార పార్టీ ఎమ్మెల్యే లేఖ రాయ‌డం రాజ‌కీయ‌వ‌ర్గాల‌ను ఆశ్చ‌ర్యంలో ముంచెత్తుతోంది. టీడీపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన ఆ నాయ‌కుడు గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ కాగా -స‌ద‌రు అంశం గ‌న్న‌వ‌రం ప‌శువైద్య క‌ళాశాల‌లో చోటుచేసుకున్న‌ బ‌దిలీల ప‌ర్వం.

గన్నవరం పశువైద్య కళాశాలలో పనిచేస్తున్న ఓ సహ అధ్యాపకురాలిని గత నెల 23న ప్రొద్దుటూరుకు బదిలీ చేశారు. మూడ్రోజులు దాటిన త‌ర్వాత‌ 26న ప్రొద్దుటూరు నుంచి తిరుపతికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు సవరించారు. తిరిగి ఈ నెల 2న మళ్లీ ఆమెను తిరుపతి నుంచి గన్నవరం బదిలీ చేశారు.ఈ ప‌రిణామం పెద్ద ఎత్తున చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ నేప‌థ్యంలో క‌ళాశాల పూర్వవిద్యార్థి - గ‌న్న‌వ‌రం శాస‌న‌స‌భ్యుడు అయిన వ‌ల్ల‌భ‌నేని వంశీ జోక్యం చేసుకున్నారు. సిబ్బంది బదిలీలకు సంబంధించి తన అనుమానాలను నిగ్గుతేల్చమని ఉపకుపలతి డాక్టర్‌ హరిబాబుకు వల్లభనేని వంశీ లేఖ‌రాశారు. 22 అంశాలను పేర్కొన్న వ‌ల్ల‌భ‌నేని వంశీ ప్ర‌ధానంగా విశ్వవిద్యాలయం బదిలీ విధానంలో పారదర్శకత లేదని - విశ్వవిద్యాలయ పరిధిలోని బోధన - బోధనేతర ఉద్యోగుల్లో నెలకొన్న అభద్రత భావాలనుతొలగించడంలో విఫలం అయ్యారని వస్తున్న ఆరోపణలపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరారు. యూనివర్శిటీ రూపొందించుకున్న పాలసీ విధానం - ప్రభుత్వ ఉత్తర్వుల అమలు చేయకపోవడానికి కారణాలు, ఒకే చోట ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న బోధన - బోధనేతర ఉద్యోగుల వివరాలు వీటి గురించి తెలపాలంటూ లేఖలో పేర్కొన్నారు. అందులో బదిలీ చేయని వారి జాబితా - మత్య్స - వ్యాయమ - గ్రంథాలయ విభాగాల్లో జరిగిన బదిలీల జాబితా, నన్నపనేని రాజకుమారి ఉత్తర్వులు బేఖాతరు చేయడంలో ఉద్దేశమేంటని ప్రశ్నించారు. వీటితోపాటుగా బదిలీల విషయంలో ప్రత్యేక జ్యూడిషియల్‌ అధికారాలు కలిగిన మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ నన్నపనేని రాజకుమారి ఆదేశాలను బేఖాతరు చేయడం - పశుసంవర్థకశాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి ఆదేశాలను పట్టించుకోకుండా బదిలీలను కొనసాగించేలా ఒత్తిడి తేవడం, ఆ శాఖ ప్రధాన కార్యదర్శి నుంచి బదిలీలను తాత్కాలింగా వాయిదా వేయాలని వచ్చిన ఉత్తర్వులను పక్కన పెట్టేయడం వంటి వాటిప‌ట్ల వంశీ ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేస్తూ వాటిని నివృత్తి చేయాల‌ని డిమాండ్ చేశారు.

కాగా, ఏకంగా మంత్రి ఆదేశాలు బేఖాత‌రు అవ‌డం - బ‌దిలీల విష‌యంలో అనూహ్య‌మైన ప‌రిణామాల‌తో ఉద్యోగులు అమ‌రావ‌తిలో ప‌ర్య‌టిస్తున్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే వివాదం ముదురుపాకాన ప‌డుతోంది. దీనికి కొన‌సాగింపు అన్న‌ట్లుగా ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేనే లేఖ రాయ‌డం సంచ‌ల‌నంగా మారింది. వ‌ర్సిటీపై పాల‌కుల‌కు ప‌ట్టుత‌ప్పుతోందా అనే సందేహాల‌ను ప‌లువురు వ్య‌క్తం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. కాగా, అధికార పార్టీ ఎమ్మెల్యే లేఖ‌పై ఇప్ప‌టికే పాల‌క‌ప‌క్షం నుంచి స్పంద‌న రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.