Begin typing your search above and press return to search.

నేనంటే నేనే : వల్లభనేని వంశీకి రాసిచ్చేశారా...?

By:  Tupaki Desk   |   21 May 2022 3:30 PM GMT
నేనంటే నేనే : వల్లభనేని వంశీకి రాసిచ్చేశారా...?
X
అసలు ఆయన ఎందుకు వైసీపీలోకి వచ్చారో ఈ రోజుకు అయితే జనాలను వైసీపీ నేతలను కన్విన్స్ చేసే ఒక్కటంటే ఒక్క పాయింట్ లేదు. ఆయన టీడీపీకి పరమ విధేయుడిని అని ఆ పార్టీలో ఉండగా చెప్పుకునే వారు. అలాంటి వల్లభనేని వంశీ 2019 ఎన్నికల్లో పార్టీ ఓడి తాను గెలవగానే టీడీపీని వదిలేశారు.

అంతే వైసీపీలోకి వచ్చి అక్కడ నుంచి చంద్రబాబు మీద చినబాబు మీద బాణాలు వేశారు. అవి శృతి మించి అటు వైసీపీ పరువు కూడా బజార్లో పడింది. ఇదిలా ఉండగా వంశీ వైసీపీలోకి వచ్చి గన్నవరంలో అప్పటికే పాతుకుపోయి ఉన్న వైసీపీ నేతలను ఖాతరు చేయకుండా తన అడ్డా అన్నట్లుగా వ్యవహరించడంతోనే చిచ్చు రాజుకుంది.

ఇక వల్లభనేని మీద 2014 ఎన్నికల్లో పోటీ చేసిన యార్లగడ్డ వెంకటరావు ఉన్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన దుట్టా రామచంద్రరావు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తమలో ఒకరు పోటీ చేయాలని వారు వారు చూస్తున్నారు. మధ్యలో వచ్చిన వంశీ సీటు నాది, టికెట్ నాకే అంటూ చేస్తున్న హడావుడితోనే అసలైన వైసీపీ నేతలకు మండుకువస్తోంది.

మొత్తానికి ఈ పంచాయతీ జగన్ వద్దకు వెళ్లినా ఏమీ తేలలేదని తెలిసిపోయింది. మరో వైపు దుట్టా అయితే మీడియాతో మాట్లాడుతూ తాము వైఎస్సార్ ఫ్యామిలీకి వైసీపీకి వీర విధేయులం తప్ప మరెవరికీ కాదని వంశీ మీద గట్టిగానే కామెంట్స్ చేశారు. తాము వైసీపీలో కొనసాగుతామని, తమదే గన్నవరం అని కూడా వారు అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే వైసీపీలోకి జంప్ చేసి వచ్చిన వంశీ అక్కడ ఉన్న వారితో సర్దుకుపోకుండా నేనంటే నేనే అన్న టైప్ లో పాలిటిక్స్ చేస్తున్నారు అని అంటున్నారు. ఆయన సడెన్ గా గన్నవరం టికెట్ నాదే, 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున తానే పోటీ చేస్తాను అని చెప్పేసుకోవడం పట్ల కూడా చర్చ సాగుతోంది.

ఈ పరిణామాలను చూసిన వారు అంతా వంశీ మొత్తానికి గన్నవరం సీటులో తానుండి పార్టీకి లాయల్టీగా ఉన్న వారిని పంపించేసేలా చేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు. ఇక వంశీకే అధినాయకత్వం కూడా ఓకే చెబితే మాత్రం యార్లగడ్డ కానీ, దుట్టా కానీ వైసీపీలో ఉండే చాన్స్ లేదని అంటున్నారు. వారు కూడా తమ దోవ తాము చూసుకుంటారు అని చెబుతున్నారు.

మొత్తానికి వైసీపీలోని అవతల వారికి ఇగోలు అని చెబుతున్న వంశీ తన ఇంగో విషయంలో మాత్రం అసలు మాట్లాడడం లేదని, హై కమాండ్ కూడా ఆయన తీరునే సపొర్ట్ చేస్తే ఆది నుంచి పార్టీ కోసం పనిచేసే వారు ఇక ఉండరని కూడా అంటున్నారు. మొత్తానికి జగన్ గన్నవరం విషయంలో పంచాయతీ చేయడానికి అందరు నేతలను పిలిచారు అని వార్తలు వస్తే అదే లేదు, నా టికెట్ నాదే అని హై కమాండ్ తో సంబంధం లేకుండా ప్రకటించుకున్న వల్లభనేని తో వైసీపీ నేతలు మా వల్ల కాదు అనే అంటున్నారు.

మరి ఈ జంపింగ్ లీడర్ వైసీపీలో ఎన్నాళ్ళు ఉంటారు అన్న చర్చ కూడా వారే ముందు పెడుతున్నారు. ఎందుకంటే రేపటి రోజున టీడీపీ పవర్ లో వస్తే ఫస్ట్ బయటకు వెళ్లేది వంశీయే అని కూడా అంటున్నారు. మరి అధినాయకత్వం జర జాగ్రత్తగా ఇలాంటివి చూడాలని కూడా అంటున్నారు.