Begin typing your search above and press return to search.

దేవినేని చేరిక వైసీపీకే లాభ‌మా?

By:  Tupaki Desk   |   17 Sep 2016 4:06 PM GMT
దేవినేని చేరిక వైసీపీకే లాభ‌మా?
X
ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ప‌రిణామాలు టీడీపీలో ప్ర‌కంప‌న‌ల‌కు కార‌ణ‌మ‌య్యేలా క‌నిపిస్తున్నాయి. మాజీ మంత్రి - కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ దేవినేని నెహ్రూ సైకిల్ ఎక్క‌డంతో గ‌న్న‌వ‌రం టీడీపీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ అస్సలు జీర్ణించులేకపోతున్నారని తెలుస్తోంది. ఎలాగూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో సత్సంబంధాలున్నాయి కాబట్టి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని విజ‌య‌వాడ‌లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతోందని సమాచారం. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గన్నవరంలో వైసీపీ తరపున పోటీచేసి గెలవాలనే ఆలోచనలో వంశీ ఉన్నట్టు సమాచారం.

గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని - విజయవాడలో ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌ వంగవీటి రాధా కూడా వంశీకి మంచి స్నేహితులుగా ఉన్నందున వంశీ త్వరలోనే విజయవాడలో భారీ ఎత్తున సభ నిర్వహించి జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని రాజకీయవర్గాలు జోస్యం చెపుతున్నాయి. ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబుపై ఉన్న కేసులు, ప్రభుత్వ తీరుపై ఉన్న ఇతర ఆరోపణల నేపధ్యంలో వైసీపీలోకి భారీ వలసలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇవ‌న్నీ ప్రాథ‌మికంగా వెలువ‌డుతున్న చ‌ర్చ‌లేన‌ని....ఇవి నిజం అవ‌చ్చు, కాక‌పోవ‌చ్చున‌ని చెప్తున్నారు.ఇదిలాఉండ‌గా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స‌మ‌క్షంలో దేవినేని చేరిన‌పుడే టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళావెంకట్రావ్‌ సమక్షంలోనే ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్‌ - వల్లభనేని వంశీ త‌మ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబును క‌లిసి నెహ్రూ చేరికపై తమ అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఇబ్బందులు, గతంలో జరిగిన సంఘటనల్ని చంద్ర‌బాబుకు వారు వివరించారు. పార్టీ బ‌లోపేతం కోణంలో నిర్ణ‌యం తీసుకుంటున్న‌ప్ప‌టికీ అనేక విప‌రిమాణాలు ఉంటాయ‌ని వారు చెప్పిన‌ట్లు స‌మాచారం.