Begin typing your search above and press return to search.

వల్లభనేని వంశీ తాజా వ్యాఖ్యలతో బాబు ఉక్కిరిబిక్కిరి ఖాయమట

By:  Tupaki Desk   |   29 Jan 2022 4:22 AM GMT
వల్లభనేని వంశీ తాజా వ్యాఖ్యలతో బాబు ఉక్కిరిబిక్కిరి ఖాయమట
X
విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరును డిసైడ్ చేస్తూ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై తాజాగా స్పందించారు టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. తాజాగా ఆయన తన పార్టీ అధినేత చంద్రబాబుకు దిమ్మ తిరిగేలా షాకులతో కూడిన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ పేరును విజయవాడ జిల్లాకు పెట్టటం.. సీఎం జగన్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయంగా ఆయన అభివర్ణించారు. ఎన్టీఆర్ అభిమానులుగా తాము.. తెలుగు దేశం పార్టీలో ఉన్న నాయకులు.. కార్యకర్తలు సైతం ఎంతో ఆనందపడుతున్నట్లుగా చెప్పుకొచ్చారు.

జిల్లాల అంశంపై చంద్రబాబు కనీసంనోరు మెదపటం లేదన్న ప్రశ్నను సంధించిన ఆయన.. పద్నాలుగేళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు ఎందుకు ఒక్క జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెట్టే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. మొత్తంగా తన వ్యాఖ్యలతో.. ప్రశ్నలకు చంద్రబాబును ఇరుకున పెట్టటమే థ్యేయంగా వల్లభనేని వంశీ మాటలు ఉన్నాయని చెప్పాలి. పాదయాత్ర సందర్భంగా ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను.. ముఖ్యమంత్రి అయ్యాక నిలబెట్టుకున్నారన్నారు.

ఈ సందర్భంగా ఆయనో ఆసక్తికరమైన అంశాన్ని చెప్పుకొచ్చారు. నాడు విపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి.. పాదయాత్ర సందర్భంగా ఎన్టీఆర్ పేరును జిల్లా పేరుగా మారుస్తామని హామీ ఇచ్చిన రోజున.. ఇదే విషయాన్ని చంద్రబాబు వద్ద తామీ విషయాన్ని ప్రస్తావించామన్నారు. అందుకు అప్పట్లో చంద్రబాబు స్పందిస్తూ.. ‘మీకు రాజకీయాలు తెలియవు. వైసీపీ అధికారంలోకి రాదు. ఏం చేయాలో నాకు తెలుసు’’ అంటూ తమతో వాదించారన్నారు.

ఎన్టీఆర్ ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదని.. ఆయన పేరును ఒక జిల్లాకు పెట్టి పరిమితం చేయటం సరికాదంటూ సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారం మొత్తం.. డబ్బులు ఇచ్చి మరీ చేయిస్తున్నారని.. అలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. జిల్లాల పేర్లను తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వేదికగా రాజకీయం చేస్తుందని ధ్వజమెత్తిన వల్లభనేని.. పాత విషయాల్ని చెప్పుకొచ్చి.. తన మాజీ బాస్ ను అడ్డంగా బుక్ చేశారని చెప్పాలి. తన మీద వేసిన మరకను చంద్రబాబు తుడుచుకుంటారా? విననట్లు ఊరుకుంటారా? ఒకవేళ రియాక్టు కాకపోతే.. వల్లభనేని వంశీ మాటలు నిజమే అన్న భావన కలుగక మానదు. మరి.. స్పందిస్తే.. వల్లభనేని వంశీ మరింత రెచ్చిపోతే.. బాబుకే ఎక్కువ డ్యామేజ్ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరేం జరుగుతుందో చూడాలి.