Begin typing your search above and press return to search.

వంశీ డిసైడ్ : బెయిల్ వ‌ద్దు లొంగిపోతా

By:  Tupaki Desk   |   15 Feb 2016 12:17 PM GMT
వంశీ డిసైడ్ : బెయిల్ వ‌ద్దు లొంగిపోతా
X
విజ‌య‌వాడ‌లో అధికార పార్టీ ఎమ్మెల్యే వల్ల‌భనేని వంశీపై న‌మోదైన కేసు ఆస‌క్తిక‌ర మలుపులు తిరుగుతోంది. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు తాను వెళితే కేసు న‌మోదు చేయ‌డంపై క‌ల‌త చెందిన గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వంశీ ఈ ప‌రిణామంలో కీల‌కమైన అడుగు వేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. పోలీసులు తన మీద అక్రమ కేసు పెట్టార‌ని బ‌లంగా వాదిస్తున్న వంశీ స్వచ్ఛందంగా లొంగిపోవాలని, స్టేషన్ బెయిల్ కూడా తీసుకోకుండా జైలుకు వెళ్లాలని డిసైడ‌యిపోయారు. ఇదే విష‌యాన్ని పార్టీ ముఖ్యుల‌కు తెలిపారు.

వంశీ ఎపిసోడ్ ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితుల దిశ‌గా మారుతుంద‌ని గ‌మ‌నించిన మచిలీపట్నం టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ - కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు బచ్చల అర్జునుడు వంశీ ఇంటికి వెళ్లి ఆయ‌నతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా వంశీ జ‌రుగుతున్న ప‌రిణామాల ప‌ట్ల తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశార‌ని స‌మాచారం. త‌న నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో జ‌రుగుతున్న ధర్నా కాబ‌ట్టి ఆ విష‌యంలో తాను విరమింపజేయడానికి వెళ్లాన‌ని వంశీ వారితో చెప్పారు. చిత్రంగా తనను ఏ1 నిందితుడిగా కేసు పెట్టడం ఏంటని మండిప‌డ్డారు. అధికారులు ఇంత ధైర్యంగా అడుగులు వేయ‌డం వెనుక కార‌ణం ఏంట‌ని వంశీ ప్ర‌శ్నించారు. ఇంత‌టితో ఆగ‌ని వంశీ...ఇలా జ‌ర‌గ‌డం వెన‌క ఎవ‌రున్నారో చెప్పాల‌ని ఎంపీ కొన‌క‌ళ్ల‌తో వాదించారు.

మ‌రోవైపు ఈ కేసును సీరియ‌స్‌గా తీసుకోవాల‌ని వల్లభనేని వంశీ నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు. అస‌లు త‌న‌పై కేసు పెట్టేందుకు కార‌ణం ఎవ‌రో చెప్పాల‌ని కలెక్టర్‌ ను ప్ర‌శ్నించేందుకు వంశీ సిద్ధ‌మైపోయారు. ఇంత‌టితో స‌రిపెట్ట‌కుండా పార్టీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబుకు అస‌లు ఏం జ‌రుగుతుందో వివ‌రించాల‌ని బాబు నిర్ణ‌యం తీసుకున్నార‌ని స‌మాచారం. మొత్తంగా త‌న‌పై న‌మోదైంది అక్ర‌మ కేసని భావిస్తున్న వంశీ త‌న కేసు విష‌యాన్ని తేలిగ్గా వ‌దిలేలా లేరని స‌మాచారం.