Begin typing your search above and press return to search.

దొరకని వనమా రాఘవను ఎలా పట్టేశారు?

By:  Tupaki Desk   |   12 Jan 2022 4:57 AM GMT
దొరకని వనమా రాఘవను ఎలా పట్టేశారు?
X
స్వామి భక్తి ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. విధేయత అన్ని బాగున్నప్పుడు కాదు.. కాలం పరీక్ష పెట్టిన వేళలో.. ఎవరు ఎంత కమిట్ మెంట్ తో పని చేస్తారన్న ఆధారంగా వారిని నమ్మొచ్చని కొందరు రాజకీయ నేతలు చెబుతుంటారు. ఇలాంటి దరిద్రపుగొట్టు మాటలకు స్ఫూర్తి పొంది అడ్డంగా బుక్ అవుతుంటారు.

ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు ఖమ్మంజిల్లాకు చెందిన పోలీసు అధికారులు కొందరు. నాగ రామక్రిష్ణ కుటుంబం పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న ఉదంతంలో.. ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవేంద్ర పాత్ర ఎంతన్న విషయాన్ని సెల్ఫీ వీడియో బయట పెట్టటం తెలిసిందే.

కుటుంబంతో సహా రామక్రిష్ణ ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం బయటకు వచ్చినంతనే.. వనమా రాఘవ ఇంటి నుంచి పరారీ కావటంతో ఆయన తీరుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ సందర్భంగా తన మీద వస్తున్న ఆరోపణల్ని ఖండిస్తూ.. ఆయనో వాయిస్ మెసేజ్ కూడా విడుదల చేశారు. ఎప్పుడైతే బాధితుడి సెల్ఫీ వీడియో బయటకు వచ్చి.. తన ఆర్థిక సమస్యల పరిష్కారానికి తన భార్యను వనమా రాఘవ కోరుకున్నారని.. ఒత్తిడి తెచ్చారని.. భరించలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా పేర్కొన్న వీడియో వచ్చాక.. రాఘవ తీరు పూర్తిగా మారిందని చెబుతున్నారు.

అతన్ని పట్టుకునేందుకు పోలీసులు ఎంతగా ప్రయత్నించిన ఆచూకీ లభించలేదు. దీంతో సాంకేతిక సాయంతో రాఘవను అరెస్టు చేయాలని భావిస్తే.. ఆయన ఎప్పుడూ వాడే సిమ్ వాడని విషయాన్ని గుర్తించారు. దీంతో.. లొకేషన్ ను ట్రేస్ చేయటం కష్టమైంది.

అదే సమయంలో హైదరాబాద్ లో ఉన్న రాఘవను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా వార్తలు రావటం.. ఆ తర్వాత అతన్ని తాము అరెస్టు చేయలేదంటూ ఏఎస్పీ చేసిన వ్యాఖ్యలు కలకలాన్ని రేపాయి. ఎన్నో సందేహాలకు తెర తీశాయి. మీడియాలో వచ్చిన తప్పుడు వార్తలతోనే అలాంటి గందరగోళం చోటు చేసుకున్నట్లు చెప్పారు.

అనంతరం అతడ్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోవటంతో..రివర్సు ఇంజనీరింగ్ విధానంలో అతడ్ని అదుపులోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు. రాఘవ తను వాడే సిమ్ వాడకుండా..కొత్త సిమ్ వాడటం.. దాన్ని ఎప్పటికప్పుడు మార్చేయటంతో అతని ఆచూకీ లభించలేదు. దీంతో.. రాఘవ కాల్ డేటాను తీసి.. గతంలో అతను తరచూ మాట్లాడే పోలీసు సిబ్బంది నెంబర్లను గుర్తించారు. వాటి ఆధారంగా రివర్సు మెథడ్ లో.. వారి నెంబర్లకు వస్తున్న కొత్త నెంబర్లు ఏమిటి? వాటి లొకేషన్ ఏమిటి? అన్న విషయాన్ని గుర్తించారు.

దీంతో.. అతన్ని పట్టుకోవటానికి అవకాశం లభించిందని చెబుతున్నారు. పోలీసు సిబ్బందితో పాటు.. రాఘవకు సన్నిహితంగా ఉండి పనులు చేసే అనుచరులు.. కుటుంబ సభ్యులకు ఎక్కడెక్కడ నుంచి ఫోన్లు వస్తున్నాయన్న విషయం మీదా పోలీసులు కన్నేయటంతో.. పని తేలికైందని చెబుతున్నారు. తాజా ఎపిసోడ్ లో రాఘవకు సహకరించిన పోలీసుల వివరాల్ని సేకరించిన అధికారులు.. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

నేరం చేసినట్లుగా బలమైన ఆరోపణలు వచ్చిన వేళలోనూ.. అతనికి సాయం చేయటం.. సమాచారాన్ని అందిస్తున్న తీరును చూసిన అధికారులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్వామి భక్తి ఉండొచ్చు.. కానీ మరీ ఇంతలానా? అని ప్రశ్నిస్తున్నారు. రాఘవను సేవ్ చేయటానికి ప్రయత్నించిన వారికి.. ఇప్పుడు కొత్త కష్టాలు ఖాయమని స్పష్టం చేస్తున్నారు.