Begin typing your search above and press return to search.

వెలుగు చూడ‌ని వ‌న‌మాలెంద‌రో?

By:  Tupaki Desk   |   8 Jan 2022 10:30 AM GMT
వెలుగు చూడ‌ని వ‌న‌మాలెంద‌రో?
X
రాజ‌కీయం అంటేనే ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డం అనే ద‌శ‌ నుంచి ప్ర‌జ‌ల‌ను దోచుకోవ‌డం అనే స్థాయికి వ‌చ్చేసింద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అధికారంలోకి వ‌స్తే చాలు ఆస్తులు వెన‌కేసుకోవ‌చ్చ‌ని ప్ర‌జ‌ల‌ను పిండి పిప్పి చేయొచ్చ‌నే ఉద్దేశం నేత‌ల్లో క‌నిపిస్తుంద‌ని ప్ర‌జాస్వామ్య వాదులు ఆందోళ‌న వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అందుకే ఎన్ని కోట్లు ఖ‌ర్చ‌యినా ప‌ర్వాలేదు ఒక్క‌సారి అధికారంలోకి వ‌స్తే వ‌డ్డీతో క‌లిసి అంత‌కు ప‌దింత‌లు వ‌సూలు చేసుకోవ‌చ్చ‌ని నేత‌లు భావిస్తున్నార‌నే టాక్ ఉంది. ఇప్పుడు తాజాగా తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ కొత్త‌గూడెం ఎమ్మెల్యే వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర్‌రావు త‌న‌యుడు వ‌న‌మా రాఘ‌వేంద్ర‌రావు అలియాస్ రాఘ‌వ అరాచ‌కాలు వెలుగులోకి రావ‌డం తీవ్ర చ‌ర్చనీయాంశంగా మారింది.

అధికారం అడ్డుపెట్టుకుని..

ప్ర‌భుత్వంలో ఉన్న ఎమ్మెల్యే తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని పంచాయ‌తీలు, సెటిల్‌మెంట్లు, బెదిరింపులకు పాల్ప‌డుతున్నారంటూ రాఘవేంద్ర‌రావుపై తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే వివిధ కార‌ణాల వ‌ల్ల ఆయ‌న‌పై ఆరు కేసులు న‌మోదైన‌ట్లు చెబుతున్నారు. తాజ‌గా త‌న కుటుంబం ఆత్మ‌హ‌త్య‌కు రాఘ‌వ‌నే కార‌ణ‌మంటూ చ‌నిపోయేముందు రామ‌కృష్ణ సెల్ఫీ వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. దీంతో రాఘ‌వ కోసం పోలీసులు వెతుకుతున్నారంటూ.. ఆయ‌న్ని అరెస్టు చేశారంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో ఒక్క‌క్కటిగా రాఘ‌వ అరాచాకాలు బ‌య‌ట ప‌డుతున్నాయి. ఆస్తి వివాదం నేప‌థ్యంలో ప‌రాయి వ్య‌క్తి భార్య‌ను త‌న ద‌గ్గ‌ర‌కు పంపించ‌మ‌ని బెదిరించ‌డంతో రాఘ‌వ దుర్మార్గానికి ప‌రాకాష్ఠగా చెబుతున్నారు. అధికారం ఉంది క‌దా అని సామాన్య ప్ర‌జ‌ల జీవితాలతో ఆడుకుంటున్న ఇలాంటి నాయ‌కుల‌పై తీవ్రంగా శిక్షించాల‌ని కోరుతున్నారు.

ఇంకా ఎంత‌మందో..

ఇప్పుడు రామ‌కృష్ణ కుటుంబం అసువులు బాప‌డంతో రాఘ‌వ ఆగ‌డాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. కానీ రాష్ట్రవ్యాప్తంగా అధికార అండ‌తో చెల‌రేగుతున్న‌వాళ్లు చాలా మందే ఉన్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అధికారం చూసుకుని ప్ర‌జ‌ల జీవితాల‌తో ఆడుకుంటున్నార‌ని అలాంటివాళ్లు తెర‌వెన‌క ఎంతో మంది ఉన్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. సామాన్య ప్ర‌జ‌ల భూములను క‌బ్జా చేయ‌డం.. వాళ్ల ఆస్తుల‌ను లాక్కోవ‌డం.. ఎదిరిస్తే చంపేస్తామ‌ని బెదిరించ‌డం సాధార‌ణంగా మారిపోయింద‌నే విమ‌ర్శ‌లున్నాయి. ఇప్ప‌టికే టీఆర్ఎస్ మంత్రి మ‌ల్లారెడ్డి లాంటి నాయ‌కుల‌పై భూ క‌బ్జా ఆరోప‌ణ‌లున్నాయి. ప్ర‌తిప‌క్షాలు ఈ విష‌యంపై ప్ర‌శ్నిస్తూనే ఉన్నాయి. ఇక తండ్రులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచ‌కం సాగేంచే త‌న‌యుల‌కు అంతే లేద‌ని ప్ర‌జ‌లు వాపోతున్నారు. ఇలాంటి వ‌న‌మాలు ఇంకా ఎంతో మంది ఉన్నార‌ని చెబుతున్నారు. కానీ ఇప్ప‌టికీ రాఘ‌వ‌పై కానీ ఆయ‌న తండ్రిపై కానీ కేసీఆర్ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం సిగ్గుచేట‌ని విప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. వెలుగులోకి వ‌చ్చిన వాళ్ల‌పైనే ఎలాంటి చ‌ర్య‌లు లేక‌పోతే ఇక తెర‌వెన‌క ఉన్న వాళ్ల ఆగ‌డాల‌ను అరిక‌ట్టేదెవ‌ర‌నే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి.