Begin typing your search above and press return to search.

వందే భారత్: 130కి.మీ. దిక్కులేదు ఇప్పుడు 220కి.మీ.

By:  Tupaki Desk   |   21 Jan 2023 1:30 AM GMT
వందే భారత్: 130కి.మీ. దిక్కులేదు ఇప్పుడు 220కి.మీ.
X
'ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానందట' అన్న సామెత గుర్తుకు వచ్చేలా మారింది వందే భారత్ వేగానికి సంబంధించిన వ్యవహారం. ఈ రైళ్ల విషయంలో తీవ్రమైన విమర్శలు ఎదురవుతున్నాయి. వందే భారత్ రైళ్లలో సానుకూలతలు చాలానే ఉన్నా.. వాటికి విపరీతమైన హైప్ తీసుకురావటం ద్వారా భారీ మైలేజీని సాధించాలని భావిస్తోంది మోడీ ప్రభుత్వం. అయితే..

ఈ ప్రచారం అంతకంతకూ ఎక్కువై.. అసలుకే మోసం అన్నట్లుగా పరిస్థితి మారింది.వందే భారత్ రైళ్లను ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకురావటం.. సంక్రాంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త సర్వీసును రావటం తెలిసిందే. గంటకు 130కి.మీ. వేగంతో ప్రయాణించే ఈ రైలు వాస్తవ కోణంలో చూసినప్పుడు.. గంటకు 80-90 కిలోమీటర్ల వేగంతోనే నడుస్తుందన్న మాట వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే లెక్కలు చూపిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య దూరం 697 కిలోమీటర్లు.

తేలిగ్గా అర్థం చేసుకోవటానికి వీలుగా 700కి.మీ. అనుకుందాం. తాజాగా నడుస్తున్న వందే భారత్ రైలు ప్రయాణ సమయం 8.40 గంటల సమయం. అంటే.. 700 కిలోమీటర్లకు గంటకు 83 కి.మీ. వేగంతో ప్రయాణం చేస్తున్న విషయం అర్థమవుతుంది.ప్రచారంలో గంటకు 110 కి.మీ. తగ్గట్లేదని చెప్పినప్పుడు.. ప్రయాణ వేగం కేవలం 6.3 గంటలు మాత్రమే ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇదంతా చూసినప్పుడు వందే భారత్ రైలు గంటకు 110 కి.మీ వేగంతో ప్రయాణం చేస్తుందన్న ప్రచారాన్ని ఎలా చేస్తారన్న సందేహం కలుగుతుంది. దీనికి రైల్వే అధికారుల చెప్పే మాటేమంటే.. ఈ రెండు రూట్ల మధ్య ఉన్న ట్రాక్ లోని కొన్ని భాగాల్లో తక్కువ స్పీడ్ తో వెళ్లాల్సి వస్తుందని.. అందుకే ప్రయాణ వేగం అంత పడుతుందన్న మాట వినిపిస్తోంది.

అలాంటప్పుడు వందే భారత్ స్లీపర్ ట్రైన్ల వేగం గంటకు 220 కి.మీ. ఉన్నప్పటికీ.. ట్రాక్ సామర్థ్యం అంత లేని నేపథ్యంలో.. లాభం ఏముంటుంది? అన్నది ప్రశ్న. మరింత బాగా అర్థం కావాలంటే.. గంటకు 500కి.మీ. వేగంతో పరుగులు తీసే సామర్థ్యం ఉన్న హైటెక్ కారు మీదగ్గర ఉందని అనుకుందాం. కానీ.. మీరు ప్రయాణించే రోడ్డు.. సింగిల్ రోడ్డు అది కూడా గతుకులతో ఉందని అనుకుందాం? అప్పుడు ఏమవుతుంది? కారును సదరు రోడ్డుకు తగ్గట్లు నడపాలే తప్పించి.. అంతకు మించి చేసేదేమీ ఉండదు.

వందే భారత్ విషయంలోనూ సరిగ్గా ఇదే వర్తిస్తుంది. వందే భారత్ సిట్టింగ్ ట్రైన్లను గంటకు 110 కి.మీ. వేగంతో నడపలేని దరిద్రం మనకు ఉన్నప్పుడు వందే భారత్ స్లీపర్ ట్రైన్లను గంటకు 220 కి.మీ. వేగంతో నడుస్తాయని చెప్పటంలో అర్థం లేదు. ఇదంతా చూసినప్పుడు మోడీ సర్కారు వ్యూహం కనిపిస్తుంది. తమ హయాంలో వేగవంతమైన రైళ్లను ప్రవేశ పెట్టామన్న భావన ప్రజలకు కలిగేలా చేస్తున్నారని చెప్పాలి. వేగవంతమైన రైళ్లు ఉన్నప్పటికీ.. వాటి పరుగులు మాత్రం మిగిలిన రైళ్ల వేగానికి కాస్తంత ఎక్కువగానే తప్పించి అంతకు మించి లేదన్న కఠిన వాస్తవం అందరికి అర్థమవుతున్న వేళ.. ఈ ప్రచారం వల్ల అనవసరమైన విమర్శలు తప్పవంటున్నారు. అందుకే.. వందే భారత్ విషయంలో కాస్తంత తక్కువ ప్రచారం చేసుకుంటే మంచిదన్న మాట వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.