Begin typing your search above and press return to search.

టీడీపీకే ప్రచార యావ ఎక్కువ

By:  Tupaki Desk   |   19 Sep 2021 3:30 PM GMT
టీడీపీకే ప్రచార యావ ఎక్కువ
X
'ఆడబిడ్డలను చంపినా, అత్యాచారాలు జరిగినా హోంమంత్రి అసలు మీడియా ముందుకే రారు' .. ఇది తాజాగా తెలుగుదేశంపార్టీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత చేసిన కామెంట్లు. పనిలో పనిగా జగన్మోహన్ రెడ్డి కూడా మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీయటమే విచిత్రంగా ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మీడియా మ్యానేజ్మెంట్ లో, 24 గంటలూ ప్రచారంలోనే ఉండాలనే యావ టీడీపీ నేతలకు ఉన్నట్లు జగన్ అండ్ కో కు ఉండదు.

మీడియాలో కనబడకుండా చంద్రబాబునాయుడు ఒక్కరోజు కూడా ఉండలేరు. మీడియా సమావేశమో, నేతలతో సమావేశమనో ఏదో ఓ కార్యక్రమం పెట్టుకుంటారు, వివరాలను మీడియాకు అందించి ప్రచారం చేయించుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు ఎదుగుదలే మీడియా మీద ఆధారపడుంది కాబట్టి మీడియా లేకుండా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఉండలేరు.

యధా రాజా తథా ప్రజ అన్నట్లు చంద్రబాబు మీడియా చుట్టూ తిరుగుతుంటే మిగిలిన నేతలు మాత్రం మీడియాకు దూరంగా ఎందుకుంటారు. మీడియా పిచ్చి గతంలో కాంగ్రెస్ కూడా లేదు ఇపుడు వైసీపీ నేతలకూ లేదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుకు నత్యం మీడియానే శరణ్యం. కానీ జగన్ కు ఆ అలవాటు లేదు. ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా జగన్ ఆరుమాసాలకో ఏడాదికో ఒకసారి మీడియా సమావేశం పెడితే చాలా ఎక్కువ. అదే పద్దతిని ముఖ్యమంత్రయిన తర్వాత కంటిన్యు చేస్తున్నారు.

ఈ కారణంగానే జగన్ మీడియాలో ఎక్కడా కనబడరు. ఈ విషయంలో కూడా సీఎంను చంద్రబాబు, టీడీపీ నేతలు తప్పుపడుతుండటమే ఆశ్చర్యంగా ఉంది. జగన్ లాగే కొందరు మంత్రులు కూడా మీడియాకు దూరంగానే ఉంటున్నారు. అలాంటి వారిలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత కూడా ఒకరు. ఏదో మేజర్ ఇన్సిడెంట్ జరిగినపుడు మాత్రమే సుచరిత మీడియాతో మాట్లాడుతారు. అంతేకానీ చీటికి మాటికి మీడియాలో కనబడాలనే కోరికైతే మంత్రికున్నట్లు లేదు.

మరి ఈ విషయంలో అనితకు వచ్చిన సమస్యేంటో అర్ధం కావటంలేదు. టీడీపీలో చాలామంది నేతలకు క్షేత్రస్ధాయిలో బలంలేని కారణంగా మీడియా మద్దతుతోనే రాజకీయాల నెట్టుకొచ్చేస్తున్నారు. అలాంటి వారిలో అనిత కూడా ఉన్నారేమో. అందుకనే సుచిరతను పట్టుకుని మీడియాతో మాట్లాడరంటూ గోల చేశారు. మీడియాతో మాట్లాడటం, దూరంగా ఉండటం అన్నది మంత్రి సమస్య. మధ్యలో అనితకు వచ్చిన నొప్పేంటో అర్ధం కావటంలేదు.