Begin typing your search above and press return to search.

అనిత టార్గెట్ గా వైసీపీ : మరీ ఇంత దారుణంగానా...?

By:  Tupaki Desk   |   21 July 2022 9:30 AM GMT
అనిత టార్గెట్ గా వైసీపీ : మరీ ఇంత దారుణంగానా...?
X
ఏపీలో రాజకీయాలు మామూలుగా లేవు అని అంతా అంటున్న విషయమే. ఒకపుడు భాష, హుందాతనం, సంస్కారం వంటివి బాగా కనిపించేవి. అప్పట్లో అయితే రాజకీయాల్లో ప్రత్యర్ధులుగానే తక్కిన వారిని చూసేవారు. ఇపుడు శత్రువులను మించి మరీ వారిని జమ కడుతున్నారు. నీవు ఒకటి అంటే నేను నాలుగు అంటాను అన్న దుర్నీతిని అమలు చేస్తున్నారు. అంతే కాదు అసభ్య పదజాలమే ఫైర్ బ్రాండ్ కి అసలైన లక్షణం అనుకుంటున్నారు.

వాస్తవానికి తిట్లు ఎన్ని ఉన్నాయో తెలుగు భాష‌లో లెక్క చూడాలీ అంటే కొందరు రాజకీయ నాయకులు మాట్లాడే దాన్ని చూస్తే చాలు అన్న భావన కూడా జనాల్లో వచ్చేసింది. ఇదిలా ఉంటే తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత వైసీపీ మీద ఘాటుగానే విమర్శలు చేస్తుంది అన్నది తెలిసిందే. ఆమె లేటెస్ట్ గా ఒక చానల్ ఇంటర్వ్యూలో కూడా సీఎం స్థాయిలో కూర్చున్న వ్యక్తి మీద పరుష పదజాలమే ఉపయోగించారు.

కొన్ని సీట్లకు విలువ గౌరవం ఇవ్వాల్సిందే. అలాగే వయసు దృష్ట్యా కొందరికి మర్యాద ఇవ్వాలి. ఇక అనుభవం చూసినపుడు కూడా కొంతమందికి సమాదరించాలి. కానీ ఇపుడు ఈ ప్రమాణాలు ఎవరూ పాటించడంలేదు. తమ అధినాయకత్వం ఆదేశించడమే చాలు గట్టు తెగిన ప్రవాహం మాదిరిగా దూకుడుతో నోటికి పని చెబుతున్నారు. ఇలా అనిత విమర్శలు చేస్తే ఇన్నాళ్ళూ దానికి పెద్దగా కౌంటర్లు ఇవ్వని వైసీపీ ఇపుడు ఒక ఆయుధాన్ని బయటకు తీసింది.

ఆమె సామాజికవర్గానికే చెందిన వైసీపీ మహిళా నాయకురాలు విశాఖ జిల్లా నేత అయిన రోజారాణిని రంగంలోకి దింపింది. అనిత ముఖ్యమంత్రి జగన్, ఆయన భార్య భారతిల మీద చేసిన ఆరోపణలకు ధీటుగా అనే దానికంటే కూడా దారుణంగా రోజారాణి అనితను పదింతలు విమర్శించింది. అలా అనే కంటే తిట్టింది అనే చెప్పాలి. ఆమె మీడియా ముందుకొచ్చి బూతులే మాట్లాడింది అంటున్నారు.

ఆమె అనిత మీద అనుచిత కామెంట్స్ కి ఒక దశలో చానల్ లో ప్రసారం చేయలేక బీప్స్ అనేకసార్లు ఇచ్చారూ అంటే ఆ తిట్ల ధాటీ ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతుంది. ఆమెను పట్టుకుని చింతామణి అని, ఆమెకు గోవా, బెంగుళూరులలో కంపెనీలు ఉన్నాయంటూ రోజారాణి రెచ్చిపోయారు.

అనిత బండారం బయటపెడతామని ఇదే తమ చివరి వార్నింగ్ అంటూ కూడా రోజారాణి హెచ్చరించడమూ అంతా చూశారు. మరి ఆమె భాగోతం ఏమో తెలియదు కానీ ఇలా బూతులకు తెర తీసి వైసీపీ మహిళా నేతలు పలుచన అవుతున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి. ఏపీలో ఇపుడు రాజకీయ విమర్శలు లేవు, తిట్లు స్థాయి కూడా దాటిపోయింది. ప్రస్తుతం చూస్తే బూతుల పర్వమే సాగుతోంది. ఇన్నాళ్ళూ కొందరు మగవారు మాత్రమే బూతులు మాట్లాడేవారు అన్న ఆరోపణలు ఉన్నాయి.

ఇపుడు వారిని దాటి మహిళలు ముందుకు వచ్చారు. అధినాయకుల మెప్పు పొందడానికి ఇలా అసభ్యపదజాలం మాట్లాడం ఎంతవరకూ సబబు అన్న ప్రశ్న వస్తోంది. అటు అనిత అయినా ఇటు రోజారాణి అయినా ఇద్దరూ సమాజం గౌరవించాల్సిన మహిళలు. ఎవరికి వారు విమర్శలు చేసుకోవడం ఆగ్రహంతో మంచీ చెడ్డా మానేసి నోటికి పని చెప్పడం వల్ల సామన్య జనం ఏమనుకుంటారు అన్న ఆలోచన చేస్తున్నారా అన్నదే ఇక్కడ ప్రశ్న.

టీడీపీ దీనికి శ్రీకారం చుడితే వైసీపీ మరో పది అడుగులు కిందకు దిగింది. ఇపుడు దీని మీద ఎవరెన్ని మెట్లు దిగుతారో అసలు ఈ కువిమర్శలకు అంతం ఉంటుందా ఇంకా కొనసాగిస్తారా అన్నదే ఇపుడు చర్చగా ఉన్న విషయం.