Begin typing your search above and press return to search.

వైసీపీలోనే కొన‌సాగ‌నున్న రాధా?

By:  Tupaki Desk   |   11 Oct 2018 2:45 PM GMT
వైసీపీలోనే కొన‌సాగ‌నున్న రాధా?
X
విజ‌య‌వాడ‌లో వైసీపీ కీల‌క‌నేత వంగ‌వీటి రాధా..పార్టీ వీడ‌బోతున్నారంటూ కొద్ది రోజులుగా ఊహాగానాలు వినిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. విజ‌య‌వాడ సెంట్ర‌ల్ టికెట్ ఇవ్వకపోతే వైసీపీని వీడుతాన‌ని రాధా పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నాడ‌ని పుకార్లు వ‌చ్చాయి.

మల్లాది విష్ణుకు తాము వ్య‌తిరేకం కాద‌ని చెబుతూనే....రాధ‌కు విజయవాడ ఎంపీ టికెట్ ఇవ్వాలని రాధా వర్గం ప్ర‌తిపాద‌న పెడుతోంద‌ని వ‌దంతులు వ‌చ్చాయి. విజయవాడ సెంట్రల్ రాధాకు ఫిక్స్ చేసి.....విష్ణుకు విజయవాడ ఎంపీ సీటివ్వాలన్న ప్ర‌పోజ‌ల్ కు వైసీపీ అధిష్టానం సుముఖంగా లేద‌ని కూడా టాక్ వ‌చ్చింది. రాధాను మ‌చిలీప‌ట్నం పార్ల‌మెంటు స్థానం నుంచి పోటీ చేయించాల‌ని అధిష్టానం భావించింద‌ని క‌థ‌నాలు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా రాధా త‌న మ‌న‌సు మార్చుకున్నార‌ని - వైసీపీలోనే కొన‌సాగ‌బోతున్నారని తెలుస్తోంది.

వైసీపీని వీడేందుకు రాధా...త‌న వ‌ర్గంతో స‌మావేశాలు నిర్వహించార‌ని టాక్ వ‌చ్చింది. రాధాకు సెంట్ర‌ల్ సీటు త‌ప్ప‌...మ‌రేమీ వ‌ద్దు అన్న‌ట్లు రాధా వ‌ర్గం ...వైసీపీ అధిష్టానానికి స‌రికొత్త ప్రతిపాదనలు పెడుతోందని ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే, తాజాగా రాధా త‌న మ‌న‌సు మార్చుకున్న‌ట్లు తెలుస్తోంది. మ‌చిలీప‌ట్నం నుంచి బరిలోకి దిగేందుకు ఆయ‌న సుముఖంగా ఉన్నార‌ని తెలుస్తోంది. అయితే, మ‌చిలీ ప‌ట్నం లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం కింద‌కు వ‌చ్చే గ‌న్న‌వ‌రం - అవ‌నిగ‌డ్డ‌ - పామ‌ర్రు - పెన‌మ‌లూరు ప్రాంతాల్లో బ‌లంగా ఉన్న టీడీపీని రాధా ఏవిధంగా ఎదుర్కొంటార‌న్న‌ది ఆస‌క్తికరంగా మారింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కాపు ఓటు బ్యాంకును జ‌న‌సేన చీల్చే అవ‌కాశ‌ముంద‌ని అనుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌చిలీప‌ట్నం బ‌రిలో రాధా పోటీ చేయ‌డం ఆయ‌న అనుచ‌రుల‌కు సుత‌రాము ఇష్టం లేద‌ని తెలుస్తోంది.