Begin typing your search above and press return to search.

రాధా స్ట్ర‌యిట్ వార్నింగ్ ఇచ్చేశారు!

By:  Tupaki Desk   |   4 Sep 2017 8:43 AM GMT
రాధా స్ట్ర‌యిట్ వార్నింగ్ ఇచ్చేశారు!
X
దివంగ‌త నేత వంగ‌వీటి రంగాపై వైసీపీ బ‌హిష్కృత నేత గౌతంరెడ్ది నిన్న చేసిన వ్యాఖ్య‌లు బెజ‌వాడ‌లో పెను కల‌క‌లాన్నే రేపాయి. వైసీపీలో ఉంటూనే... ఆ పార్టీకి చెందిన కీల‌క నేత తండ్రిపై ఘాటు వ్యాఖ్య‌లు చేసిన గౌతంరెడ్డిపై పార్టీ అధిష్ఠానం చాలా వేగంగా స్పందించింది. గౌతంరెడ్డికి తొలుత నోటీసు జారీ చేసి... ఆ వెంట‌నే ఏకంగా పార్టీ నుంచి స‌స్పెండ్ చేసింది. ఈ ప‌రిణామంతో గౌతంరెడ్డికి భారీ షాక్ త‌గిలింద‌నే చెప్పాలి. రాజ‌కీయాల్లో ఉన్న‌ప్పుడు నాలుక‌ను అదుపులో పెట్టుకోక‌పోతే ఇలాగే ఉంటుందంటూ ఇప్పుడు పొలిటీషియ‌న్లు చ‌ర్చించుకుంటున్నారు. రంగాపై గౌతంరెడ్డి వ్యాఖ్య‌ల‌తో ర‌గిలిపోయిన రంగా ఫ్యాన్స్‌... నిన్న భారీ ఎత్తున వంగ‌వీటి రాధాకృష్ణ ఇంటికి చేరుకున్నారు. అదే స‌మ‌యంలో గౌతంరెడ్డి కామెంట్ల‌పై స్పందించేందుకు రాధా ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశాన్ని పోలీసులు ఉద్దేశ‌పూర్వ‌కంగానే అడ్డుకుని నిన్న పెద్ద ర‌చ్చ చేశారు.

తాజాగా నేటి ఉద‌యం రాధాకృష్ణ తాను అనుకున్న‌ట్లుగానే... గౌతంరెడ్డి వ్యాఖ్య‌ల‌కు భారీ కౌంట‌రే ఇచ్చారు. వంగవీటి రంగాను విమర్శిస్తే ఊరుకోబోమని రాధాకృష్ణ హెచ్చరించారు. వంగవీటి రంగాపై గౌతమ్‌ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయన అభిమానులు బాధపడ్డారని తెలిపారు. రంగాను అభిమానించే వారు అన్ని పార్టీల్లోనూ ఉన్నారని, ఆయనను విమర్శిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చ‌రించారు. గౌతం రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో రంగా అభిమానులు ఎవరూ బాధపడొద్దని - ధైర్యంగా ఉండాలని ఆయన సూచించారు. రెండు హత్య కేసులతో గౌతంరెడ్డికి సంబంధాలు ఉన్నాయని, ల్యాండ్‌ మాఫియాతోనూ ఆయనకు ప్రమేయముందని రాధా ఆరోపించారు.

గౌతంరెడ్డి వ్యాఖ్యలను ఖండించడానికి నిన్న (ఆదివారం) ప్రెస్‌ మీట్‌ పెట్టేందుకు ప్రయత్నిస్తే.. కొంతమంది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని మండిపడ్డారు. మహిళ - మాజీ ఎమ్మెల్యే అని చూడకుండా త‌న త‌ల్లి రత్నకూమారిని పోలీసులు రోడ్డుపై ఈడ్చుకెళ్లారని, ఈ ఘటనపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. కొంతమంది పోలీసుల అతి వల్లే నిన్న ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయని చెప్పారు. గౌతంరెడ్డిని సస్పెండ్‌ చేస్తూ మా పార్టీ సరైన నిర్ణయం తీసుకుందని రాధా సంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడ నగరంలో అన్ని వర్గాల కోసం వంగవీటి రంగా పనిచేశారని అన్నారు. చనిపోయిన వారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని ఆయన సూచించారు.