Begin typing your search above and press return to search.

వంగ‌వీటి రూటు మారిందా?

By:  Tupaki Desk   |   31 Jan 2019 8:45 AM GMT
వంగ‌వీటి రూటు మారిందా?
X
పార్టీకి రాజీనామా చేయ‌టం.. ఆ వెంట‌నే అధినేత మీద విమ‌ర్శ‌లు చేయ‌టం ఇప్పుడు అల‌వాటుగా మారింది. ఆ బాట‌లోనే న‌డిచారు వంగ‌వీటి రాధా. తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్లుగా చెప్పి.. వీరావేశంగా ప్రెస్ మీట్ పెట్టిన ఆయ‌న‌.. అత‌క‌ని ఆరోప‌ణ‌లు చేశారు.

వంగ‌వీటి కుటుంబానికి టీడీపీకి మ‌ధ్య ఉన్న పంచాయితీ ఈనాటిది కాదు. అయిన‌ప్ప‌టికీ... తండ్రిని హ‌త్య చేసిన ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న పార్టీలోకి వంగ‌వీటి రాధా వెళ్లేందుకు రెఢీ అయ్యార‌న్న ప్ర‌చారం ఆయ‌న్ను అభిమానించే ప‌లువురికి ఒక ప‌ట్టాన జీర్ణం కాని ప‌రిస్థితి. ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల కాలంలో వివిధ పార్టీల‌కు రాజీనామా చేసిన ప‌లువురు నేత‌లు.. ఆ వెంట‌నే తాము చేరాల్సిన పార్టీలోకి చేరిపోయారు. అది టీడీపీ నేత మేడా మ‌ల్లికార్జున‌రెడ్డి కావొచ్చు.. బీజేపీ నేత ఆకుల స‌త్య‌నారాయ‌ణ కావొచ్చు. కానీ.. వంగ‌వీటి రాధా మాత్రం ఏ పార్టీలోకి చేర‌కుండా మౌనంగా ఉండ‌టం ఇప్పుడు చ‌ర్చ‌గా మారింది.

ప్రెస్ మీట్ పెట్టిన వారం త‌ర్వాత కూడా ఏ పార్టీలో చేరే విష‌య‌మై క్లారిటీ ఇవ్వ‌ని రాధా వైనంలో కొత్త కోణం తెర మీద‌కు వ‌చ్చింది. మొద‌ట్లో టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న‌ప్ప‌టికీ.. ప్రెస్ మీట్ త‌ర్వాత ఆయ‌న స‌న్నిహితులు.. శ్రేయోభిలాషులు ప‌లువురు సైకిల్ ఎక్కాల‌నుకున్న ఆలోచ‌న‌ను వారించిన‌ట్లుగా చెబుతున్నారు. వంగ‌వీటి రంగా లాంటి నేత కొడుకు హోదాలో టీడీపీలో చేర‌టం ఆయ‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు ఏ మాత్రం మంచిది కాద‌న్న విష‌యాన్ని చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.

అదే స‌మ‌యంలో బాబు తీరును చెబుతూ..టీడీపీ నేత‌లు ఆయ‌న‌కు ఇచ్చిన ఆఫ‌ర్లను క్రాస్ చెక్ చేసుకోవాల‌న్న సూచ‌న‌ను చేసిన‌ట్లుగా తెలుస్తోంది. దీంతో సందేహం వ‌చ్చిన వంగ‌వీటి.. త‌న‌కు పార్టీలో చేరితే ఏమేం చేస్తారో క్లారిటీగా చెప్పాల‌ని కోరిన‌ట్లుగా చెబుతున్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో టికెట్టు ఇచ్చే అవ‌కాశం లేద‌ని.. గెలిచిన త‌ర్వాత ఎమ్మెల్సీ ఇస్తామ‌ని చెప్ప‌టంతో పాటు.. పార్టీ ప‌ద‌వి ఇస్తామ‌న్న‌ట్లు తెలిసింది.

పార్టీ ప‌ద‌వి పెద్ద విష‌యం కాక‌పోవ‌టం.. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టికెట్ మీద హామీ ఇవ్వ‌క‌పోవ‌టంతో రాధా పున‌రాలోచ‌న‌లో ప‌డిన‌ట్లుగా తెలుస్తోంది. పార్టీ గెలిస్తే ఓకే. ఒక‌వేళ పార్టీ ఓడితే ప‌రిస్థితి ఏమిట‌న్న దానిపై ఎవ‌రూ స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్తితి. తాను పార్టీలో చేరి.. పార్టీ త‌ర‌ఫున ప్ర‌చారం చేసిన త‌ర్వాత త‌న‌కు ఫ‌లితం వ‌స్తుందా? రాదా? అన్న సందేహం ఉన్న వేళ.. పార్టీలో చేరాల్సిన అవ‌స‌రం ఉందా? అన్న ప్ర‌శ్న‌తోనే టీడీపీలోకి రాధా ఎంట్రీ ఆగిన‌ట్లుగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. రాధా స‌న్నిహితులు ప‌లువురు టీడీపీతో పోలిస్తే.. జ‌న‌సేన‌లో చేర‌టం మంచిద‌న్న వాద‌న‌ను బ‌లంగా వినిపించిన‌ట్లు చెబుతున్నారు.

చిరు పెట్టిన ప్ర‌జారాజ్యంతో పోలిస్తే జ‌న‌సేన మంచి ఆవ‌కాశ‌మ‌ని.. ప‌వ‌న్ పార్టీలో బ‌ల‌మైన నేత‌లు పెద్ద‌గా లేని నేప‌థ్యంలో ఆ పార్టీలో చేరితే మంచి ఫ్యూచ‌ర్ ఉంటుంద‌న్న మాట‌ను చెప్ప‌టంతో ఆయ‌న పున‌రాలోచ‌న‌లో ప‌డిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ కార‌ణంతోనే ఏ పార్టీలోకి చేర‌కుండా ఉన్న‌ట్లు చెబుతున్నారు.