Begin typing your search above and press return to search.

ఇది వంగ‌వీటి రాధా సెంటిమెంటా..!స్పెషాలిటీనా..!

By:  Tupaki Desk   |   11 Dec 2015 9:08 AM GMT
ఇది వంగ‌వీటి రాధా సెంటిమెంటా..!స్పెషాలిటీనా..!
X
విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో మ‌రో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. దివంగ‌త మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి మోహ‌న‌రంగా వార‌సుడిగా పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చిన వంగ‌వీటి రాధా నాలుగోసారి నియోజ‌క‌వ‌ర్గం మార‌డం బెజ‌వాడ పాలిటిక్స్‌ లో పెద్ద చ‌ర్చ‌నీయాంశ‌మైంది. రాధా 2004లో 26 సంవ‌త్స‌రాల‌కే ఎమ్మెల్యే గా ఎన్నిక‌య్యారు. పోటీ చేసిన తొలిసారే ఎమ్మెల్యే గా ఎన్నికైన ఆయ‌న‌ త‌ర్వాత రాజ‌కీయంగా వేసిన త‌ప్ప‌ట‌డుగుల‌తో పొలిటిక‌ల్ ప‌రంగా వెన‌క‌ప‌డిపోయారు. 2004లో దివంగ‌త మాజీ సీఎం రాజ‌శేఖ‌ర్‌ రెడ్డి అండ‌తో విజ‌య‌వాడ 2 నియోజ‌క‌వ‌ర్గం టిక్కెట్టు సంపాదించిన రాధా ఆ ఎన్నిక‌ల్లో ఏకంగా 25వేల ఓట్ల ఆధిక్యంతో ఘ‌న‌విజ‌యం సాధించి ఎమ్మెల్యే అయ్యారు.

2009 ఎన్నిక‌ల్లో రాజ‌శేఖ‌ర్‌ రెడ్డి వ‌ద్ద‌ని చెపుతున్నా ఆయ‌న చిరంజీవి స్థాపించిన ప్ర‌జారాజ్యం పార్టీలో చేరి విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నుంచి పోటీ చేసి మ‌ల్లాది విష్ణు చేతిలో ఓడిపోయారు. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌తో రాధా సెంట్ర‌ల్‌ కు మారాల్సి వ‌చ్చింది. ఇక 2014 ఎన్నిక‌ల్లో రాధా మరో రాంగ్ స్టెప్ వేశాడు. అప్ప‌టి వ‌ర‌కు సెంట్ర‌ల్‌ కు ఇన్‌ ఛార్జ్‌ గా ఉండి ఆ ఎన్నిక‌ల‌కు ముందు వైకాపాలో చేరి ఈ సారి తూర్పు నియోజ‌క‌వ‌ర్గానికి మారారు. పార్టీ మారినా...నియోజ‌క‌వ‌ర్గం మారినా మ‌ళ్లీ సేమ్ రిజ‌ల్ట్‌. ఈ సారి టీడీపీ అభ్య‌ర్థి గ‌ద్దే రామ్మోహ‌న్ చేతిలో రాధా ఓట‌మి పాల‌య్యారు.

తాజాగా మ‌రోసారి రాధా నియోజ‌క‌వ‌ర్గం మారారు. వైకాపా అధినేత జ‌గ‌న్ రాధాను విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి ఇన్‌ ఛార్జ్‌ గా నియ‌మించారు. విజయవాడ సెంట్రల్ నుంచి కాంగ్రెస్ నేత విష్ణు వైకాపాలో చేర‌తార‌న్న ప్ర‌చారం జ‌రుగుతుండ‌గానే ఆయ‌న క‌ల్తీ మ‌ద్యం కేసులో ఇరుక్కోవ‌డంతో ఆయ‌న‌కు రాజ‌కీయంగా పెద్ద ఎదురు దెబ్బే త‌గిలింది. దీంతో విష్ణు వైకాపా చేరిక‌తో సంబంధం లేకుండానే జ‌గ‌న్ రాధాను సెంట్ర‌ల్‌ కు ఇన్‌ ఛార్జ్‌ గా నియ‌మించారు. దీంతో రాధా వ‌చ్చే 2019 ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ సెంట్ర‌ల్ నుంచి పోటీ చేయాలి. ఈ లెక్క‌న చూస్తే 2004 నుంచి ఆయ‌న నాలుగు నియోజ‌క‌వ‌ర్గాలు మారిన‌ట్ల‌య్యింది.