Begin typing your search above and press return to search.

వంగ‌వీటి...హ‌స్తం పార్టీలోకి వెళుతున్నారా?

By:  Tupaki Desk   |   29 Dec 2018 12:05 PM GMT
వంగ‌వీటి...హ‌స్తం పార్టీలోకి వెళుతున్నారా?
X
సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు ఏపీ అసెంబ్లీకి త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌కు గ‌డువు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ... ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీ రాజ‌కీయాల‌కు సంబంధించి ఈ ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగేందుకు కొత్త‌గా వ‌చ్చిన జ‌న‌సేన ఉన్నా... ప్ర‌ధాన పోటీ అధికార టీడీపీ - విప‌క్ష వైసీపీల మ‌ధ్యే ఉంటుంద‌న్న వాద‌న వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నా... ఆ పార్టీ తెలంగాణ ఎన్నిక‌ల్లో భాగంగా టీడీపీతో క‌లిసి పోటీ చేసింది క‌దా. ఆ పొత్తును ఏపీలో కూడా కొన‌సాగిస్తారా? లేదా? అన్న విష‌యంపై ఇప్ప‌టిదాకా స్ప‌ష్ట‌త లేకున్నా...ఆ రెండు పార్టీల మ‌ధ్య పొత్తు కొన‌సాగే అవ‌కాశాలే ఎక్కువ అన్న వాద‌న వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇటు టీడీపీలో - అటు వైసీపీలో సీటు ద‌క్క‌ని నేత‌లంతా ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరిపోయినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌సరం లేద‌న్న విశ్లేష‌ణ‌లు కొన‌సాగుతున్నాయి.

ఈ విశ్లేష‌ణ‌ల‌కు బ‌లం చేకూరుస్తూ... విజ‌యవాడ రాజ‌కీయాల్లో త‌మ‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకున్న వంగ‌వీటి ఫ్యామిలీ ఏ ఒక్క‌రూ ఊహించ‌ని అడుగు వేయ‌బోతున్న‌ట్లుగా ప్ర‌చారం సాగుతోంది. గ‌తంలో విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వంగ‌వీటి రాధాకృష్ణ‌...ఇప్పుడు వైసీపీలోనే ఉన్నారు. జ‌గ‌న్‌ తో స‌న్నిహితంగా మెల‌గుతున్న ఈ నేత‌...ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో తాను విజ‌యవాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తాన‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించేశారు. పార్టీ అధిష్ఠానం నిర్ణ‌యం వెలువ‌రించ‌క ముందే వంగ‌వీటి ఈ ప్ర‌క‌ట‌న చేశారు. అయితే ఎన్నిక‌ల‌కు చాలా స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో పార్టీ అధిష్ఠానం కూడా అప్పుడేమీ అన‌లేదు. అయితే ఎన్నిక‌లు స‌మీపిస్తున్న క్ర‌మంలో పార్టీలోకి కొత్త‌గా వ‌చ్చి చేరిన మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణుకు విజ‌య‌వాడ సెంట్ర‌ల్ టికెట్‌ ను కేటాయించేసింది. దీంతో రాధా ఒక్క‌సారిగా భ‌గ్గుమ‌న్నారు. అయినా కూడా వెన‌క్కు త‌గ్గ‌ని పార్టీ అధిష్ఠానం... సెంట్ర‌ల్ లో మ‌ల్లాది విష్ణుకు విజయావ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని - తూర్పు స్థానంలో రాధాకు మంచి ప‌ట్టుంద‌ని తెల‌ప‌డంతో పాటుగా తూర్పు నియోజ‌క‌వర్గం నుంచి పోటీకి దిగాల‌ని రాధాకు సూచించింది. అయితే రాధా అందుకు స‌సేమిరా అనడంతో పాటు తన‌కు సెంట్ర‌ల్ టికెట్ కావాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టారు.

ఈ క్ర‌మంలో గ‌త‌కొంత కాలంగా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు కాస్తంత దూరంగా ఉంటున్న రాధా... మొన్న త‌న తండ్రి వ‌ర్ధంతి సంద‌ర్భంగా రాధా కీల‌క నిర్ణ‌యం తీసుకుంటార‌ని అంతా భావించారు. అయితే ఆ రోజు తండ్రికి నివాళి అర్పించేసి కామ్‌గా ఉండిపోయారు. తాజాగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం... వంగ‌వీటి రాధాకృష్ణ విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నుంచే పోటీ చేయాల‌ని గ‌ట్టిగానే నిర్ణ‌యించుకున్నార‌ట‌. ఇందుకోసం త‌న‌కు ఆ టికెట్‌ ను ఏ పార్టీ ఇస్తుంద‌న్న విష‌యాన్ని ప‌రిశీలించిన ఆయ‌న కాంగ్రెస్ లో చేరిపోవాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా స‌మాచారం. కాంగ్రెస్‌ - టీడీపీ పొత్తులో భాగంగా ప్ర‌స్తుతం సెంట్ర‌ల్ లో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావును ఏదో విధంగా త‌ప్పించేసి ఆ సీటును టీడీపీ... కాంగ్రెస్‌కు కేటాయిస్తుంద‌ని - కాంగ్రెస్ పార్టీ ఆ టికెట్ ను త‌న‌కు క‌ట్ట‌బెడుతుంద‌న్న‌ది రాధా ప్లాన్‌ గా ప్ర‌చారం సాగుతోంది. అయితే సెంట్ర‌ల్ సీటే కావాల‌నుకుంటే... చేరేదేదో టీడీపీలోనే చేరితే స‌రిపోయేదిగా అన్న ప్ర‌శ్న వినిపిస్తున్నా... బోండాను ఓడించాల‌న్న క‌సితోనే ఉన్న రాధా... టీడీపీలోకి డైరెక్ట్‌ గా ఎంట్రీ ఇచ్చేందుకు ఇష్ట‌ప‌డ‌లేద‌ని స‌మాచారం. అంతేకాకుండా త‌న తండ్రిని చంపిన పార్టీ అని ఆరోప‌ణ‌లున్న‌ - త‌న వ‌ర్గం వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంటున్న పార్టీ అయిన టీడీపీలోకి వెళ్లినా ఆయ‌న‌కు క‌ష్ట‌మే. అందుకే మ‌ధ్యేమార్గంగా త‌న‌తైన కోణంలో ఆలోచించిన రాధా... ఇలా హస్తం పార్టీలో చేరిపోయి... త‌న ల‌క్ష్యాన్ని చేరుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. చూద్దాం... ఏ జ‌రుగుతుందో?

Watch Here: పవన్ కళ్యాణ్ పావలా అయితే నీ రేటు ఎంత..?