Begin typing your search above and press return to search.

లగడపాటి లాబీయింగ్.. వంగవీటి-బాబు భేటి

By:  Tupaki Desk   |   12 March 2019 6:00 AM GMT
లగడపాటి లాబీయింగ్.. వంగవీటి-బాబు భేటి
X
వంగవీటి రాధా.. ఈ మధ్య వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఈ నేత ఏ పార్టీలో చేరుదామనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఆ మధ్య కొడాలి నానితో భేటి అయ్యి తిరిగి వైసీపీలో చేరుదామని చూసినా.. వంగవీటి బలం, బలగం.. రెండు సార్లు ఓడిపోయిన చరిత్ర చూసిన వైసీపీ అధిష్టానం ఈయనను పట్టించుకోలేదని సమాచారం. దీంతో ఎట్టకేలకు ఈ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ.. బెజవాడకే చెందిన సీనియర్ రాజకీయ వేత్త, మాజీ ఎంపీ లగడపాటితో కలిసి నిన్న అర్థరాత్రి చంద్రబాబును కలిసి చర్చలు జరిపినట్టు సమాచారం. వంగవీటికి నరసాపురం లేదా అనకాపల్లి ఎంపీ టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించినట్టు మీడియాలో వార్తలొచ్చాయి. మచిలీపట్నం ఎంపీ టికెట్ ను ఇవ్వాలని వంగవీటి కోరినట్టు సమాచారం.

లగడపాటి ప్రస్తుతం ఏపార్టీలో లేరు. తెలంగాణ విభజన జరగడంతో రాజకీయ సన్యాసం తీసుకొని దూరం జరిగారు. ఇప్పుడు 2019 ఎన్నికల వేళ మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఈ మధ్య తరచూ చంద్రబాబును కలుస్తూ లాబీయింగ్ చేస్తున్నారు. అయితే టీడీపీలో చేరుతారా అంటే నోరుమెదపడం లేదు. ఈ ఎన్నికల ముందర టీడీపీలో చేరి ఎంపీగా పోటీచేస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నా.. లగడపాటి మాత్రం స్పందించడం లేదు. అసలు ఏ పార్టీలో లేకున్నా టీడీపీలో ఆయన రాజకీయం చేస్తుండడం అందరినీ అయోమయానికి గురిచేస్తోంది.

అందులో భాగంగా వైసీపీ దారులు మూసుకుపోవడంతో వంగవీటి రాధా టీడీపీని ఆశ్రయించారు. నిన్న రాత్రి బాబుతో భేటిలో విజయవాడ సీట్ల విషయంలో చర్చలు జరిపారు. కానీ అక్కడ సీట్లు ఇప్పటికే కేటాయించామని.. ఖాళీగా ఉన్న నరసాపురం - అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీచేయాలని బాబు ప్రతిపాదించినట్టు తెలిసింది. ఇక చేసేందేం లేక ఈ రెండు స్థానాల్లో ఒకస్థానం నుంచి బరిలోకి దిగేందుకు వంగవీటి ఒప్పుకున్నట్టు సమాచారం. అవసరమైతే మచిలీపట్నం సీటైనా ఇవ్వాలని కోరారట.. కానీ అక్కడ సిట్టింగ్ ఎంపీ కొనకళ్ల నారాయణ ఉండడంతో మార్పులు చేర్పులపై ఆలోచిస్తానని బాబు చెప్పినట్టు తెలిసింది. టికెట్ కన్ఫం అని చెప్పడంతోనే త్వరలోనే వంగవీటి రాధ టీడీపీలోకి చేరబోతున్నట్టు తెలిసింది.