Begin typing your search above and press return to search.

వంగవీటి... ఈసారి రాంగ్ కాదు... రైటే...?

By:  Tupaki Desk   |   16 Oct 2021 12:57 PM GMT
వంగవీటి... ఈసారి రాంగ్ కాదు... రైటే...?
X
లెక్కలు అన్నీ సరిపోవాలి. దానికి లక్కు కూడా ఫేవర్ చేయాలి. అపుడే ఏ రంగం అయినా ఎవరైనా వీరంగం వేసేది. అంతా మన మహిమే అనుకుంటే ఎపుడూ తేడా కొడుతూనే ఉంటుంది. ఇవన్నీ రాజకీయాల్లో చాలా జాగ్రత్తలు కూడా చెబుతాయి. ఇక వంగవీటి రంగా వారసుడు రాధా అంటే ఒక సామాజిక వర్గానికి ఉప్పొంగిపోయే ప్రేమ. ఆయన కూడా తండ్రి ఆశయాల సాధన కోసం పనిచేస్తాను అంటూ దూకుడుగానే రాజకీయాల్లోకివచ్చారు. రంగా కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ పార్టీ కోసమే ప్రాణాలు వదిలారు. ఇక ఆయన కుమారుడి రాజకీయ ఎంట్రీ కూడా కాంగ్రెస్ ద్వారానే జరగడం విశేషం.

రాధా 2004 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి కాంగ్రెస్ తరఫున తొలిసారి గెలిచారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే 2009 నాటికి మాత్రం ఆయన కాంగ్రెస్ ని వీడి రాంగ్ స్టెప్ వేశారు అంటారు. ఆనాడు వైఎస్సార్ చెప్పినా కూడా వినకుండా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరి పోటీ విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2014 ఎన్నికల్లో ఆయన వైసీపీలో చేరి మరో మారు లక్ పరీక్షించుకున్నారు. ఈసారి ఆయన విజయవాడ తూర్పు నుంచి పోటీ చేశారు. అయినా టీడీపీ చేతిలో ఓడిపోయారు. ఇక 2019 నాటికి ఆయన విజయవాడ సెంట్రల్ మీద దృష్టి పెట్టారు. అయితే జగన్ ఆయనకు విజయవాడ సెంట్రల్ టికెట్ ఇవ్వడానికి నిరాకరించారు. అంతే కాదు, అవనిగడ్డ అసెంబ్లీ టికెట్ అయినా లేక బందరు నుంచి ఎంపీగా అయినా ఇస్తామని చెప్పారు.

కానీ దానిని అవమానంగా భావించిన రంగా 2019 ఎన్నికల ముందే వైసీపీకి గుడ్ బై కొట్టేశారు. ఆయన టీడీపీలో చేరినా టికెట్ దక్కలేదు. ఆ తరువాత టీడీపీ ఓడిపోయింది. ఇక మళ్లీ ఎన్నికలు రెండేళ్లలో ఉన్నాయి. దాంతో ఈసారి రాధా సరైన డెసిషన్ తీసుకోవాలని చూస్తున్నారు. ఈసారి ఆయనకు జనసేన ఆశాకిరణంగా కనిపిస్తోంది అంటున్నారు. జనసేన నుంచి పోటీ చేయాలని కూడా ఆయన అభిమానులు కోరుతున్నారుట. నిజానికి టీడీపీ కూడా రాధాకు కోరిన చోట టికెట్ ఇచ్చేందుకు రెడీనే. అయితే జనసేన టీడీపీల మధ్య పొత్తు ఉంటుందని ఊహిస్తున్న రాధా వ్యూహాత్మకంగానే ఆలోచిస్తున్నారు అనుకోవాలి.

పొత్తులో భాగంగా తాను అనుకున్న సీటు నుంచి పోటీ చేయడం ఒక ఎత్తు అయితే రేపటి రోజున ఈ కూటమి అధికారంలోకి వస్తే మంత్రి పదవి కూడా జనసేన కోటాలో కన్ ఫర్మ్ గా ఉంటుందని ఆలోచిస్తున్నారు అంటున్నారు. ఆయన అనుచరులు అభిమానులు కూడా ఇదే విధంగా సలహాలు ఇస్తున్నారుట. అర్జంటుగా పార్టీని మారమని చెబుతున్నారుట. ఇక ఈ మధ్యనే జనసేనాని పవన్ కి మద్దతుగా మాట్లాడి రాధా తన రూట్ ఏంటో చెప్పేశారు. ఆయన కనుక జనసేనలోకి వెళ్తే మాత్రం విజయవాడ రాజకీయాల్లో కీలకమైన మార్పులు సంభవిస్తాయి అన్నది వాస్తవం. చూడాలి మరి రాధా ఈసారి రాంగ్ కాదు, రైటే అంటున్నారు.