Begin typing your search above and press return to search.

వంగవీటి వార్నింగ్...పొలిటికల్ పొలి కేక...?

By:  Tupaki Desk   |   1 March 2022 11:30 AM GMT
వంగవీటి వార్నింగ్...పొలిటికల్ పొలి కేక...?
X
ఏపీ రాజకీయాల్లో కొన్ని పేర్లు తలచుకుంటేనే వైబ్రేషన్స్ వస్తాయి. అలాంటి వాటిలో వంగవీటి రంగా కూడా ఒకటి. ఈ పేరుకు అంతటి పవర్ ఉంది. విజయవాడను బేస్ చేసుకుని ఒక దశాబ్దం పాటు రాజకీయాలను నడిపిన వంగవీటి మోహనరంగా చనిపోయి మూడున్నర దశాబ్దాలు కావస్తోంది. కానీ ఆయన పేరు ఇప్పటికీ మారు మోగుతోంది. ప్రత్యేకించి ఒక బలమైన సామాజిక వర్గానికి ఆయన ఆరాధ్యదేవుడు. ఏపీ రాజకీయాల్లో వంగవీటి ప్రస్థావన లేకుండా ఈ రోజు అయితే ఏదీ జరగదు, అన్ని పార్టీలు ఆయన్ని తలచుకోవాల్సిందే.

అంతటి పాపులారిటీ సంపాదించారు కాబట్టే వంగవీటి అన్న నాలుగు అక్షరాలే రాజకీయ జీవులకు తారకమంత్రంగా మారిపోయాయి. ఇదిలా ఉంటే తాజాగా విజయవాడలో విజయవాడలోని శ్రీనగర్ కాలనీలో రంగా కాంస్య విగ్రహాన్ని రంగా, రాధా మిత్రమండలి అభిమానులు ఏర్పాటు చేశారు. ఈ కాంస్య విగ్రహాన్ని రంగా కుమారుడు రాధాక్రిష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. అవి రాజకీయంగా భారీ ప్రకంపనలే సృష్టిస్తున్నాయి.

ఈ కామెంట్స్ ఏంటి అంటే వంగవీటి సైన్యం తలచుకుంటే ప్రభుత్వాన్ని కూల్చేయగలమని. మరి ఆయన ఎవరికి ఉద్దేశించి అన్నారో తెలియదు కానీ. ఈ కామెంట్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి. అంతే కాదు వంగవీటి సైన్యం కనుక తలచుకుంటే ఏమైనా చేయగలరు అని కూడా చెప్పుకొచ్చారు. తమను ఎవరూ తక్కువ అంచనా వేయవద్దు అని కూడా హెచ్చరించారు. తన తండ్రి ఒక జిల్లాకో ప్రాంతానికో పరిమితం కాదని, ఆయన మొత్తం తెలుగు వారికే ఆరాధ్యనీయుడు అని రాధా అన్నారు.

ఇక తనకు ఏ పదవీ లేకపోయినా పరవాలేదని, అయినా తనకు ఏ హోదా అయినా వంగవీటి రంగా గారి అబ్బాయి అన్న దాని ముందు దిగదుడుపే అని కూడా అన్నారు. తనకు ఈ జన్మకు దక్కిన అరుదైన గౌరవం అని కూడా చెప్పుకున్నారు. తన తండ్రిని కులాలను, మతాలను దాటి అంతా ప్రేమిస్తున్నారు అంటే అంత కంటే గర్వకారణం ఏముంటుంది అని కూడా ఆయన అన్నారు.

ఇక తనకు ఏ పార్టీ కూడా కనీస గౌరవం ఇవ్వలేదని రాధాక్రిష్ణ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేయడం విశేషం. తనను సరిగ్గా వాడుకోలేదని కూడా ఆయన అన్నారు. ప్రస్తుతానికి ఆయన టీడీపీలో ఉంటున్నారు. మరి టీడీపీలో తనకు గౌరవ మర్యాదలు పెద్దగా దక్కడం లేదని ఆయన ఆవేదన చెందుతున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది.

మరో వైపు చూస్తే విజయవాడకు రంగా పేరు పెట్టాల్సిందే అని కూడా రాధా డిమాండ్ చేయడం విశేషం. ఇప్పటిదాకా చాలా మంది ఆ మాట అన్నా కుమారుడు రాధా నోటి నుంచి తొలిసారి అది వచ్చింది. మరి దీని మీద ప్రభుత్వం ఏమంటుందో చూడాలి. ఏది ఏమైనా ప్రభుత్వాలను కూల్చేయగలమని ఇచ్చిన వంగవీటి వార్నింగ్ అయితే ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తావిస్తోంది. మరి ఇదే దూకుడు రానున్న రోజుల్లో రాధా చూపిస్తారా...ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తారా అన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే.