Begin typing your search above and press return to search.

గడప గడపకు ప్రోగ్రాంలో హోం మంత్రికి తప్పలేదు

By:  Tupaki Desk   |   20 Jan 2023 8:30 AM GMT
గడప గడపకు ప్రోగ్రాంలో హోం మంత్రికి తప్పలేదు
X
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానసపుత్రికగా చెప్పుకునే కార్యక్రమాల్లో ఒకటి గడప గడపకు మన ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి మంత్రి మొదలుకొని.. ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీలుపర్యటించాలని.. ప్రజలతోనేరుగా కలిసి వారి కష్టనష్టాల గురించి తెలుసుకోవటంతో పాటు.. తమ ముందుకు వచ్చిన సమస్యల్ని వెంటనే పరిష్కరించేలా చేయటం ద్వారా.. ప్రజల కోసం ప్రభుత్వం ఎంతలా పని చేస్తుందన్న విషయం అర్థమవుతుందని భావించారు. ఒకవేళ.. ఒకటి అరా చోట్ల వ్యతిరేకత వ్యక్తమైనా.. సదరు నాయకుడి మీద తర్వాతి కాలంలో తీసుకునే చర్యలకు ఈ కార్యక్రమం ఒక రిఫరెన్సుగా మారుతుందని భావించినట్లు చెబుతారు.

అయితే.. అనుకున్నది ఒకటి.. అయినది ఒకటిగా మారింది గడప గడపకూ మన ప్రభుత్వ ప్రోగ్రాం. ఈ కార్యక్రమంలో భాగంగా రోడ్ల మీదకు వచ్చి.. జనాలతో కలిసిన వైసీపీ నేతలకు చుక్కలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. చాలా తక్కువ చోట్ల మినహా.. ప్రతి చోటా ఏదో ఒక ఇష్యూ చోటుచేసుకోవటం.. వాటిని సదరు నేతలు సర్దుబాటు చేయలేక.. మీడియాలో రాకుండా ఆపలేకుండా పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు. మరోవైప.. ప్రభుత్వ ఇమేజ్ ను దెబ్బ తీసేలా వచ్చే నిలదీతల విషయంలో వైసీపీ నేతలు మరింత కటువుగా వ్యవహరించటంతో జగన్ సర్కారుకు మరిన్ని ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయి.

తాజాగా ఇలాంటి పరిస్థితే రాష్ట్ర హోం మంత్రి తానేటి వనితకు ఎదురైంది. తాజాగా ఆమె తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులోని మూడో వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది చేస్తున్న నిర్వాకాలపై ప్రజలు గళం విప్పారు. హోం మంత్రిని ప్రశ్నించారు. ఇటీవల పింఛన్ నిలిపేస్తున్నట్లుగా సచివాలయ సిబ్బంది నోటీసులు ఇవ్వటంతో బెంగ పడిన తన తండ్రి.. చనిపోయారంటూ గంధం తాతబ్బాయి చేసిన వ్యాఖ్యపై మంత్రి వనిత సీరియస్ అయ్యారు.

దీంతో రియాక్టు అయిన హోం మంత్రి సచివాలయ సిబ్బంది మీద సీరియస్ అయ్యారు. విధి నిర్వహణలో ఇలాంటివి కుదరదని చెప్పిన ఆమె.. బాధితులకు సర్ది చెప్పేందుకు ఇబ్బందికి గురయ్యారు. ఇక.. టిడ్యో ఇళ్లను తమకు అప్పగించాలని పలువురు ఆమెను కోరారు. గడపగడపకుమన ప్రభుత్వంలో భాగంగా ఇబ్బందులు పడిన మంత్రుల జాబితాలో తాజాగా వనిత కూడా చేరారని చెప్పక తప్పదు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.