Begin typing your search above and press return to search.

వంటేరు ఒంటిపై పెట్రోలు- గ‌జ్వేల్లో గ‌డ‌బిడ‌

By:  Tupaki Desk   |   27 Nov 2018 5:36 AM GMT
వంటేరు ఒంటిపై పెట్రోలు- గ‌జ్వేల్లో గ‌డ‌బిడ‌
X
గ‌జ్వేల్‌... ముఖ్య‌మంత్రికి - ఓ మాజీ ఎమ్మెల్యేకు మ‌ధ్య వార్‌. తెలంగాణ‌లో అతిపెద్ద హాట్ టాపిక్‌. చాలా సాఫీగా జ‌ర‌గాల్సిన ఈ నియోజ‌క‌వ‌ర్గం ఎన్నిక‌ వీలైనంత వెలుగులోకి వ‌స్తోంది. దీనికి కార‌ణం ఒక‌టే... ఒక మామూలు అభ్య‌ర్థి... ఒక ముఖ్య‌మంత్రిని ఢీకొంటున్నాడు. అందుకే ఎట్టి ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌ల అటెన్ష‌న్‌ను త‌న వైపు తిప్పుకోవాల‌నుకుంటున్నాడు. ఆయ‌న ఎవ‌రో కాదు... గ‌త ఎన్నిక‌ల్లో కేసీఆర్ చేతిలో ఓడిపోయిన వంటేరు ప్ర‌తాప్ రెడ్డి. మొన్న‌నే చాలా ఓట్లు వ‌చ్చాయి. ఈ సారి రెండు పార్టీల అండ ఉంది కాబ‌ట్టి ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తాన‌ని... ఆయ‌న‌కు కాన్ఫిడెన్స్‌. దాంతో తీవ్రంగా పోరాడుతున్నారు. కానీ ఎన్ని పార్టీలు క‌లిసినా ఎదుట ఉన్న‌ది కేసీఆర్ కావ‌డంతో ఫైట్ చాలా ట‌ఫ్‌గా ఉంది వంటేరుకు. అయితే, వంటేరు చుట్టూ రెండు మూడు రోజులుగా నాట‌కీయ ప‌రిణామాలు జ‌రిగాయి. నిన్న అర్ధ‌రాత్రి త‌ర్వాత అది ఏకంగా ఆత్మ‌హ‌త్యాయ‌త్నం దాకా వెళ్లింది. ఇంత‌కీ అక్క‌డ ఏం జ‌రిగిందంటే...

కేసీఆర్ గెలుపు కోసం టీఆర్ ఎస్ డ‌బ్బు పంచుతుంద‌ని వంటేరు ఆరోప‌ణ‌. ఫిర్యాదు ఇచ్చినా త‌నిఖీలు చేయ‌డం లేద‌ని ఆయ‌న మొన్న ఎన్నిక‌ల అధికారి ఆఫీసు ముందు ధ‌ర్నాకు దిగారు. ఆ త‌ర్వాత ఆయ‌న‌ను అరెస్టు చేశారు. ఈ క్ర‌మంలోనే కొంపల్లిలోని ప్రతాప్ రెడ్డి కుమారుడు విజయ్ రెడ్డి ఇంట్లో భారీ నగదు, మ‌ద్యం నిల్వలు ఉన్నాయ‌ని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఒకరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయ‌న ఇంటికి అర్ధరాత్రి త‌నిఖీల‌కు వెళ్లారు.

విష‌యం తెలుసుకున్న వంటేరు ప్రతాప్ రెడ్డి అక్క‌డికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చంపేస్తారా చంపేయండి అంటూ పోలీసులతోఆయ‌న వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. దీంతో అర్ధరాత్రి హై టెన్షన్ నెల‌కొంది. నగదుతో పాటు భారీగా మద్యం ఉందనే ఫిర్యాదు వ‌చ్చినందుకే సోదాలకు వ‌చ్చామ‌ని పోలీసుల వాదన. ఇంట్లో ఎవరూ లేరని చెబుతున్నా తనిఖీల పేరిట ఇంట్లోకి చొరబడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఏమీ దొర‌క్క‌పోతే ప్రెస్‌ మీట్ పెట్టి దొర‌క‌లేద‌ని చెబుతారా అని పోలీసుల‌ను ప్ర‌శ్నించారు.

దీనిపై అనంత‌రం స్పందించిన వంటేరు టీఆర్ ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంద‌ని ఆరోపించారు. కేసీఆర్ ఆదేశాలతోనే పోలీసులు తనను వేధిస్తున్నట్లు వాపోయారు. మూడు రోజులుగా పోలీసులు తన వెంటే పడ్డారని ప్రచారం చేసుకోనివ్వ‌డం లేద‌న్నారు. వంటేరు సూసైడ్ అటెంప్ట్ విషయం తెలియగానే ఆయన అనుచరులు - పార్టీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకోవ‌డం ప‌రిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. వారు పోలీసుల‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.

అయితే నిన్న ఉద‌యం గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్ లో పోలీసులు - ఎన్నికల అధికారులు టీఆర్ ఎస్ తో చేతులు కలిపారని వంటేరు ప్రతాప్ రెడ్డి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ ను కలిసి ఫిర్యాదు చేశారు. గజ్వేల్ లో కాంగ్రెస్ కార్యకర్తలను హరీశ్ రావు భయపెడుతున్నారని - ఇప్పటికే టీఆర్ ఎస్ నేతలు 50 కోట్ల వరకు ఖర్చు చేశారని ఆరోపించారు. ఇంకా కేసీఆర్ ఫామ్ హౌజ్ లో డబ్బులున్నాయని మేము చెబితే త‌నిఖీలు చేయ‌లేద‌ని - మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నార‌ని ఆరోపించారాయ‌న‌. అయితే వంటేరు ప్ర‌చారం చేయ‌డం మానేసి ప‌బ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నార‌ని ధ‌ర్నాకు దిగ‌డం వ‌ల్లే ఆయ‌న‌ను పోలీసులు అరెస్టు చేశార‌ని టీఆర్ఎస్ నేత‌లు చెబుతున్నారు.