Begin typing your search above and press return to search.

ఒంటేరుకు అంత ప్రాధాన్యం అందుకేనా?

By:  Tupaki Desk   |   9 March 2019 6:11 AM GMT
ఒంటేరుకు అంత ప్రాధాన్యం అందుకేనా?
X
ప్ర‌త్య‌ర్థి సైతం పాహిమాం.. పాహిమాం అంటూ సాగిల‌ప‌డేలా చేసే నేర్పు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ సొంతంగా చెప్పాలి. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థికి చుక్క‌లు చూపిస్తూనే.. ర‌క్ష‌.. ర‌క్ష అంటూ శ‌ర‌ణు కోరినా.. త‌మ‌కు అవ‌స‌రం వ‌చ్చినా.. పాత‌వి వ‌దిలేసి.. కొత్త‌గా కౌగిలించుకోవ‌టంలో కేసీఆర్ దిట్ట‌. తాజాగా అలాంటి ప‌రిస్థితే ఒంటేరు ప్ర‌తాప‌రెడ్డి విష‌యంలోనూ చోటు చేసుకుంద‌ని చెప్పాలి.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ మీద‌నే పోటీ చేసిన వ్య‌క్తిగా.. కేసీఆర్ కు మెజార్టీ త‌గ్గించ‌టంలో కీల‌క‌భూమిక పోసిస్తార‌న్న ప్ర‌చారంతో పాటు.. ఒక‌ద‌శ‌లో ఒంటేరు జెయింట్ కిల్ల‌ర్ గా మార‌నున్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. ఇదంతా ప‌చ్చ మీడియా సృష్టి త‌ప్పించి వాస్త‌వం కాద‌న్న‌ది కొద్ది రోజుల‌కే స్ప‌ష్ట‌మైంది.

కేసీఆర్ మీద గెలుపే త‌న ధ్యేయంగా వ్య‌వహ‌రించిన ఒంటేరు ప్ర‌తాప‌రెడ్డి.. రాజకీయంగా ఎన్ని ఎదురుదెబ్బ‌లు తిన్నారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. అలాంటి పెద్ద మ‌నిషి ఈ రోజు గులాబీ కండువా భుజాన వేసుకొని తిరగ‌టం ఒక ఎత్తు అయితే.. ఆయ‌న హుషారుకు త‌గ్గ‌ట్లే.. టీఆర్ ఎస్ అగ్ర‌నాయ‌క‌త్వం ఆయ‌న‌కు అధిక ప్రాధాన్య‌త ఇవ్వ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

లోక్ స‌భ ఎన్నిక‌ల స‌న్నాహ‌క స‌భ‌ల్లో ఒంటేరుకు అధిక ప్రాధాన్యం ఇవ్వ‌టం క‌నిపిస్తుంది. ఆయ‌న చేతులు ప‌ట్టుకొని ప్ర‌జ‌ల‌కు అభివాదం చేయ‌టం.. ఆయ‌న‌తో భుజం.. భుజం రాసుకోవ‌టం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఎందుకిలా? పార్టీలోకి చాలామంది నేత‌లు వ‌చ్చినా.. ఎవ‌రికి ఇవ్వ‌నంత ప్రాధాన్య‌త ఒంటేరుకు ఎందుకు ఇస్తున్న‌ట్లు? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

అయితే.. దీనికి భారీ లెక్క‌లే ఉన్న‌ట్లు చెబుతున్నారు. రానున్న లోక్ స‌భ ఎన్నికల అనంత‌రం బీజేపీ.. కాంగ్రెస్ ల‌కు సీట్లు పెద్ద‌గా రాకుండా.. తృతీయ ఫ్రంట్ కు భారీ సీట్లు వ‌స్తే.. కేంద్రంలో చ‌క్రం తిప్పేందుకు కేసీఆర్ సిద్ధ‌మ‌వుతున్నారు. ఒక‌వేళ అలాంటి ప‌రిస్థితే ఏర్ప‌డితే.. అందుకు అవ‌స‌ర‌మైన ప్లాన్ ను ఇప్పుడే సిద్ధం చేసుకుంటున్నార‌ని చెప్పాలి. అదెలా అంటే.. కేసీఆర్ కానీ కేంద్రానికి వెళ్లాల్సి వ‌స్తే.. ఆయ‌న త‌న ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేయాల్సి వ‌స్తుంది. అప్పుడు ఉప ఎన్నిక అనివార్యం.

కేసీఆర్ బ‌రిలో ఉన్న కార‌ణంగా ఒంటేరు ఓడిపోతున్నారు కానీ.. ఆయ‌నే లేకుంటే.. ఒంటేరు విజ‌యం ఖాయం. కేసీఆర్ రాజీనామా సీటులో వేరే వారు పోటీ చేసి ఒంటేరు చేతిలో ఓడిపోతే జ‌రిగే డ్యామేజ్ అంతా ఇంతా కాదు. అందుకే.. అలాంటి అవ‌కాశం లేకుండా చేయ‌టం కోసం.. దాదాపు ఏడెనిమిది నెల‌ల ముందే ఒంటేరును గులాబీ కారులో ఎక్కించ‌టం ద్వారా ఆయ‌న్ను త‌మ నేత‌గా మార్చేసుకున్నార‌ని చెబుతారు.

అంతేకాదు.. ఇప్పుడు జ‌రుగుతున్న స‌భ‌ల్లో ఒంటేరుకు ప్రాధాన్యం ఇవ్వ‌టం వెనుక కార‌ణం ఏమంటే.. మొన్న‌టి వ‌ర‌కూ త‌మ‌ను తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేసిన నేత త‌మ వాడ‌ని.. తాము ప్రోత్స‌హించ‌టం ద్వారానే ఎదుగుతున్న భావ‌న క‌లిగించేందుకే ఇలా చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఒంటేరుకు ప్రాధాన్య‌త ఇవ్వ‌టం ద్వారా.. ఆయ‌న త‌మ వాడేన‌ని.. త‌మ స‌న్నిహిత వ‌ర్గంలోకి చేరిన‌ట్లుగా అంద‌రి దృష్టిలో ప‌డేందుకేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఒక‌వేళ కేసీఆర్ త‌న అసెంబ్లీ సీటుకు రాజీనామా చేసి ఢిల్లీ వెళితే.. అప్పుడు జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో ఒంటేరుకు టికెట్ ఖాయంగా ఇచ్చారు. అప్పుడు ఆయ‌న్నుగెలిపించిన దాన్లో ఒంటేరు కంటే త‌మ వ‌ల్ల‌నే ఆయ‌న గెలిచార‌న్న అభిప్రాయాన్ని క‌లిగించ‌టం కూడా ముఖ్యం. అందుకే.. పార్టీలో చేరిన మిగిలిన నేత‌ల‌తో పోలిస్తే.. ఒంటేరుకు ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.