Begin typing your search above and press return to search.

కేసీఆర్ సంబరాన్ని నీరుగారుస్తున్న ఉద్య‌మ‌కారులు

By:  Tupaki Desk   |   7 Dec 2017 6:11 PM GMT
కేసీఆర్ సంబరాన్ని నీరుగారుస్తున్న ఉద్య‌మ‌కారులు
X
ఔను...తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంబ‌రంలో ఉంటే...ఆయ‌న‌తో క‌లిసి పోరాటంలో ముందుకు న‌డిచిన ఉద్య‌మకారులు మాత్రం ఎర్ర‌జెండా ఎగుర‌వేస్తున్నారు. ఒక‌వైపు అట్ట‌హాసంగా..ఆడంబ‌రంగా వేడుక‌ల‌కు కేసీఆర్ సిద్ధ‌మ‌వుతుంటే...మ‌రోవైపు నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌కు వేదిక‌గా తెలంగాణా ను మార్చుతున్నారు. ఇదంతా తెలంగాణ మ‌హాస‌భ గురించి. హైదరాబాద్ లో ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగే ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ కోసం సీఎం కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.తెలుగు మహాసభల కోసం ఇప్పటికే సీఎం కేసీఆర్ రూ.50 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులు వేదికల ఏర్పాటు - అలంకరణ - అతిథుల వసతులు - సౌకర్యాల కోసం ఖర్చుచేస్తున్నారు. ఏకంగా కోర్ కమిటీని నియమించారు కూడా.

ఇలా తెలుగు మ‌హాసభ‌ల నిర్వ‌హ‌ణ‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా సిద్ధ‌మ‌వుతోంది. మ‌రోవైపు తెలంగాణ ఉద్య‌మంలో గులాబీ ద‌ళ‌ప‌తితో క‌లిసి న‌డిచిన విప్లవ రచయితల సంఘం తాజాగా కేసీఆర్ తీరును విబేధించింది. విర‌సం ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో సమావేశంలో ర‌చ‌యిత వరవరరావు మాట్లాడుతూ తప్పకుండా తెలుగు మహాసభలను అడ్డుకుంటామ‌ని ప్ర‌క‌టించారు. కష్టజీవికి ఇరువైపుల ఉండే వాళ్లే కవులని చాటుతామ‌న్నారు. ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరిస్తామ‌ని తెలిపారు. ఇటీవ‌ల జరిగిన జీఈఎస్ సదస్సు ప్రజలను - శ్రమశక్తి - పేదలను దోచుకోవడానికి ఎలా అయితే జరిగాయో ఇప్పుడు ప్రపంచ తెలుగు మహా సభలు అలాగే జరుగుతున్నవని వ‌ర‌వ‌ర‌రావు ఆరోపించారు.ఇవి దోపిడి వర్గాల మహాసభలు తప్ప తెలుగు మహాసభలు కావని ఆయ‌న మండిప‌డ్డారు.

1974 వెంగళరావు ప్రభుత్వంలో శ్రీ శ్రీ తెలుగు మహాసభలను అడ్డుకుని 36 గంటలపాటు బొల్లారం పోలీస్ స్టేషన్ లో ఉన్నార‌ని వ‌ర‌వ‌ర‌రావు గుర్తు చేశారు. కే చంద్రశేఖరరావు ప్రభుత్వం కూడా వెంగళరావు ప్రభుత్వానికి ఏమాత్రం తక్కువ కాదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు కేసీఆర్ - నందిని సిద్ధారెడ్డి లు రెండు తెలుగులు ఒకటి కాదన్నారని...అప్ప‌టి ముఖ్య‌మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమయములో తెలుగు మహాసభలను పెడితే బహిష్కరించారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే ప్రపంచతెలుగు మహాసభలకు వెంకయ్యనాయుడు - చంద్రబాబులను పిలుస్తున్నారని ఆరోపించారు.

ఇది పెట్టుబడిదారుల కోసం మాత్రమే జరిగే సభలని ఆరోపించారు. ప్రొపెసర్ సాయిబాబాకు జీవిత ఖైదు - జర్నలిస్టులపై దాడులు - ప్రొఫెసర్ కంచె ఐలయ్యపై దాడులు - రోహిత్ వేములది ఆత్మహత్యగా చిత్రీకరించడం ...ఇవన్నీ కూడా పెట్టుబడిదారులకు కేసీఆర్ ప్రభుత్వం మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న తీరుకు నిదర్శనమ‌ని పేర్కొంటూ అందుకే తాము బ‌హిష్క‌రిస్తున్నామ‌న్నారు.