Begin typing your search above and press return to search.

గాలి తీసేస్తున్న జగన్ పై తమ్ముళ్ల గుస్సా

By:  Tupaki Desk   |   16 Feb 2017 12:51 PM GMT
గాలి తీసేస్తున్న జగన్ పై తమ్ముళ్ల గుస్సా
X
అధికారంలో ఉన్న వారు అద్దాల మేడలో ఉంటున్నట్లే. అలాంటి వారిపై విమర్శలు.. ఆరోపణలు మామూలే. అపార పాలనా అనుభవం ఉన్న చంద్రబాబు లాంటి నేత ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో.. అబద్ధాలు.. అర్థసత్యాలు నిజాలుగా చలామణీ అవుతున్న తీరు చూస్తే.. ఒళ్లుమండిపోవాల్సిందే. చేతకాకపోతే చేతకాలేదని నిజాయితీగా ఒప్పుకుంటే ఎవరూ ఏమీ అనరు. గొప్పలు చెప్పుకునేందుకు ఉన్నవి.. లేనివి కల్పించుకొని చెప్పేసే తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. ఏపీ విపక్ష నేత జగన్ ఆధారాలతో చంద్రబాబుపై విరుచుకుపడటంతో తెలుగు తమ్ముళ్లలో ఫస్ట్రేషన్ లెవెల్స్ పీక్ స్టేజ్ కి వెళ్లిపోతున్నాయి. నోటికి వచ్చినట్లుగా మాట్లాడేటం.. తిట్ల దండకాన్ని అందుకోవటం చేస్తున్న వైనం చూస్తే.. నిజం చెబితే ఇంతలా విరుచుకు పడతారా? అని ఆశ్చర్యపోయేపరిస్థితి.

ప్రత్యేక హోదా మీదా.. పెట్టుబడుల సదస్సు మీద బాబు తీరును సూటిగా ప్రశ్నిస్తున్న జగన్ పై ఏదో విధంగా విరుచుకుపడి బాబు దగ్గర మార్కులు కొట్టేసే ప్రయత్నానికి తెర తీశారు తెలుగు తమ్ముళ్లు. ఇందులో భాగంగా కొందరు నోటికి వచ్చినట్లు మాట్లాడటం కనిపిస్తుంది. ఇందుకు నిదర్శనంగా ఏపీ గృహనిర్మాణ సంస్థ ఛైర్మన్ వర్ల రామయ్యను చెప్పాలి. కోర్టు తీర్పు ఇంకా రాకున్నా.. లేనిపోని పోలికలు తీసుకొచ్చి.. జగన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేప్రయత్నానికి తెర తీస్తున్నారు.

రూ.60 కోట్ల అవినీతికి నాలుగేళ్లు శిక్ష పడితే.. రూ.43వేల కోట్ల అవినీతి కేసుల్లో జగన్ ఎన్నేళ్లు శిక్ష పడుతుందంటూ చిత్రమైన వాదనను వినిపించారు. చిత్రమైన వాదన ఎందుకంటే.. చంద్రబాబు మొదలుకొని.. ఆయన పార్టీకి చెందిన నేతలంతా జగన్ లక్ష కోట్ల అవినీతి చేసినట్లుగా ప్రచారం చేస్తుంటారు. మరి.. లక్ష కోట్లకు సంబంధించి కేసులు ఉండాలిగా?

అలా కాకుండా అంతకంటే తక్కువ ఉండటం అంటేనే.. అందులో అసలు విషయం ఏమిటో ఇట్టే అర్థమవుతుంది. జగన్ పై అవినీతి కేసులు ఎందుకు పెట్టారో.. ఎవరి కారణంగా పెట్టారో అందరికి తెలిసిన బహిరంగ రహస్యమే. విచారణ పూర్తి అయి.. దోషిగా నిర్దారణ అయ్యాక మాత్రమే విమర్శలు చేయాల్సింది పోయి..ఏదో జరుగుతుందంటూ ఊహాగానాలతో మాట్లాడటం చిత్రం కాక మరేంటి?ఈ తరహా మాటలకు బాగా అలవాటు పడటం వల్లే కావొచ్చు.. వాస్తవంగా లేకున్నా పదిలక్షలకోట్ల రూపాయిల పెట్టుబడులు వచ్చేసినట్లుగా ఉదరగొట్టేస్తున్నారు. పెట్టుబడుల విషయంలో ఎంతటి డొల్లతనంతో మాట్లాడతారో.. జగన్ మీద ఆరోపణల విషయంలోనూ అంతే డొల్లతనంతో తెలుగు తమ్ముళ్లు మాట్లాడుతున్నారని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/